ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది

ABN , First Publish Date - 2020-04-04T10:11:16+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో రైతులకు ఇబ్బంది కలగొద్దని, వారు

ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది

సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీగా ఏర్పాట్లు  

టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు 


గజ్వేల్‌/సిద్దిపేట సిటీ, ఏప్రిల్‌ 3:  కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో రైతులకు ఇబ్బంది కలగొద్దని, వారు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, అడిషనల్‌ కలెక్టర్లు పద్మాకర్‌, ముజాంబీల్‌ ఖాన్‌, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రవణ్‌ కుమార్‌, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్‌, సివిల్‌ సప్లయ్స్‌, వివిధ శాఖల అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కోతలకు కావాల్సిన హార్వెస్టర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రైతులకు ప్రత్యేక టోకెన్లను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, టోకెన్లను గ్రామంలోని సర్పంచ్‌, కార్యదర్శి, రైతులు, వ్యవసాయ అధికారుల సమక్షంలో అందజేయాలని సూచించారు.


ముందు పంట వేసిన వారి పంటలను ముందుగా కోతలు నిర్వహించేలా టోకెన్‌ నంబర్లు కేటాయింపు ఉండాలని చెప్పారు. జిల్లా స్థాయి, డివిజన్‌ స్థాయిల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 345 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో కేంద్రానికో ప్రత్యేకాధికారిని నియమించి గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఆ సమావేశంలో సర్పంచ్‌, గ్రామ కార్యదర్శి, 30మంది రైతులు, ఏవోలు, వ్యవసాయ విస్తరణాధికారులు పాల్గొని టోకెన్‌ నెంబర్లను రైతులకు టోకెన్‌ నంబర్లను కేటాయిస్తారని మంత్రి తెలిపారు.


అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, కమిటీలో కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, వ్యవసాయాధికారులు, డీఆర్డీఏ పీడీ, డీపీవో, ఆర్టీఏ, ట్రాన్స్‌ పోర్ట్‌ ఏజెన్సీ ప్రతినిధులు సభ్యులుగా ఉండాలని మంత్రి సూచించారు. జిల్లా, డివిజన్‌ స్థాయిలో కూడా కమిటీలు ఉంటాయని, గ్రామ స్థాయిలో ప్రతి రోజూ ఎంతమేరకు కొనుగోళ్లు జరిగాయి, ఎంత మంది రైతుల నుంచి కొనుగోళ్లు చేశాం, వారికి చెల్లించాల్సిన డబ్బు ఎంత ఎంతనే వివరాలను రోజూ వారీగా నివేదికను డివిజన్‌ కంట్రోల్‌ రూమ్‌కు, అక్కడ నుంచి జిల్లా కంట్రోల్‌ రూమ్‌కు పంపాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. 


సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌ డివిజన్‌ వారీగా 3 కంట్రోల్‌  రూమ్స్‌, జిల్లా స్థాయిలో జిల్లా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి, ప్రతి 50 కేంద్రాలకో సిస్టమ్‌ ఆపరేటర్‌ను కేటాయించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. 

Updated Date - 2020-04-04T10:11:16+05:30 IST