ఇల్లిల్లూ జల్లెడ!

ABN , First Publish Date - 2020-03-31T09:29:21+05:30 IST

రాష్ట్రంలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టాలని, కరోనా వైరస్‌ సోకిందని గుర్తిస్తే తక్షణమే క్వారంటైన్‌ కేంద్రానికి తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రతిరోజూ అందరికీ వైద్య

ఇల్లిల్లూ జల్లెడ!

  • ఒక్కరోజులో వైరస్‌ బయటపడదు
  • రోజూ అందరికీ ఆరోగ్యపరీక్ష
  • అనుమానం వస్తే క్వారంటైన్‌కు..
  • వలంటీర్లు, వైద్యులతో 2 టీమ్‌లు
  • వార్డుకు ఒకరు చొప్పున వైద్యుడు
  • బాధ్యత కలెక్టర్లు, కమిషనర్లదే..
  • క్రిటికల్‌కు 4 ప్రత్యేక ఆస్పత్రులు
  • పాజిటివ్‌ కోసం జిల్లాకో ఆస్పత్రి: సీఎం
  • కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్‌


అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టాలని, కరోనా వైరస్‌ సోకిందని గుర్తిస్తే తక్షణమే క్వారంటైన్‌ కేంద్రానికి తీసుకువెళ్లాలని  జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రతిరోజూ అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ అమలు తీరుపై  సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇకముందూ  మరింత పకడ్బందీగా వ్యవహరించాలి. లేదంటే లక్ష్యం నీరుగారిపోతుంది’’ అని సూచించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం కలెక్లర్లు, ఎస్పీలతో కరోనా వైరస్‌ నివారణ చర్యలపై ఆయన వీడియోకాన్ఫరెన్సు  నిర్వహించారు. ‘‘కరోనాకు సంబంధించి మనం ఇప్పటివరకూ గట్టి చర్యలు తీసుకున్నాం. సమష్టిగా అందరమూ పనిచేస్తున్నాం. గ్రామవార్డు వలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పోలీసు సిబ్బంది గట్టిగానే పనిచేస్తున్నారు’ అని తెలిపారు.  ఇంకా ఏమన్నారంటే..


జనం మధ్య రెండు బృందాలు 

‘‘పట్టణ ్గణప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. రెండు రకాల బృందాలు దీనికోసం పనిచేయాలి.  మొదటి దశలో వార్డు వలంటీరు,్ల  డ్వాక్రా బృందాలు, ప్రైమరీ రీసోర్సు పర్సన్లు, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీలు, అదనపు ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు ఉంటారు.  విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నా.. లేకున్నా ప్రతి ఇంటినీ సర్వే చేసి వైరస్‌ ఉన్న వారిని గుర్తించాలి. ప్రతి రోజూ ప్రతీ కుటుంబాన్నీ పరిశీలించాలి. రెండో స్థాయిలో.. ప్రతి కార్పొరేషన్‌లోనూ ప్రతి వార్డుకు ఒక డాక్టరును ఏర్పాటు చేయాలి.  మునిసిపాలిటీల్లో  ప్రతి మూడు వార్డులకూ ఒక డాక్టరును ఉంచాలి.  టీమ్‌లను పర్యవేక్షించే బాధ్యత కలెక్టర్లు, కమిషనర్లదే’’


ప్రైవేటు సేవలు వాడుకోవాలి

‘‘ప్రతి రోజూ ప్రతి ఇంటినీ సర్వే చేయాలి. ఇంట్లోనే వైద్యం చేయించుకుని కోలుకునే సందర్భాలు ఉన్నాయి. వయస్సు ఎక్కువగా ఉన్నవారు, బీపీ, షుగరు వ్యాధులతో బాధపడుతున్నవారిపై ఎక్కువగా దృష్టి సారించాలి. ప్రైవేటు వైద్యుల సేవలను వినియోగించుకోవాలి. శానిటరీ వర్కర్లకు మాస్కులు ఇవ్వాలి. రేషన్‌ దుకాణాల దగ్గర భౌతిక దూరం పాటించాలి.  గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో పారిశుధ్ధ్య పనులు విస్తృతంగా జరగాలి.  నిత్యావసర వస్తువులు అధిక ధరలకు అమ్మితే జైలుకు పంపుతాం. విశాఖలో  విమ్స్‌, కృష్ణా జిల్లాలో  సిద్ధార్థ హాస్పిటల్‌, నెల్లూరు జీజీహెచ్‌, తిరుపతిలో పద్మావతి అస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ కోసంఏర్పాట్లు చేస్తున్నాం. వీటిలో ఉన్న 1370 బెడ్లను 1680కు పెంచుతున్నాం. వెంటిలేటర్లతో కూడిన బెడ్‌లనూ 148నుంచి 444 కు పెంచుతున్నాం’’


జిల్లాలవారీగా..

‘‘కరోనా సోకిన దాదాపు 15 శాతం కేసులు ఆసత్రులలో చేర్చించాల్సి  ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికోసం  జిల్లాల వారీగానూ ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచుతున్నాం.  ఈ ఆసుపత్రుల్లో  నాన్‌ ఐసీయూ బెడ్లను 6762   నుంచి 8050కు, ఐసీయూ బెడ్‌లను 336 నుంచి 515కు పెంచుతున్నాం. ఇవిపూర్తిగా కోవిడ్‌ -19 సోకినవారికి ఆయా జిల్లాల్లో సేవలు అందిస్తాయి.  కలెక్టర్లు వీటిని స్వయంగా  పర్యవేక్షించాలి.  ఒక్కో ఆసుపత్రికి ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించాలి. ఇళ్లల్లో ఉండటం ఇష్టంలేనివారు నేరుగా  క్వారంటైన్‌ కేంద్రాలకు రావచ్చు. కల్యాణ మండపాలు, హోటళ్లు, వసతులు ఉన్న కాలేజీలు, హస్టళ్లూ  ఇలాంటి వాటివన్నీ  తీసుకుని వాటిని శానిటైజ్‌  చేసి ప్రతి జిల్లాకూ ఐదువేల  బెడ్లు చొప్పున  సిద్ధం చేయాలి. పట్టణ పేద నిరాశ్రయుల కోసం ఏర్పాటుచేసిన నైట్‌  షెల్టర్లలో  అన్ని సదుపాయాలు ఉంటాయి. తిండిలేనివారికి  సరైన సదుపాయాలు లేవన్న మాట రానివ్వొద్దు. సరిహద్దుల్లో ఉన్న మనవాళ్లను కూడా ఇదే విధంగా చూసుకోవాలి. ప్రతి షెల్టరు వద్ద ఒక రెసిడెంట్‌ అధికారిని పెట్టాలి. జాగ్రత్తలతో  వ్యవసాయ కార్యకలాపాలు నిర్వర్తించాలి. అంపెడా ప్రకటించిన రేట్ల ప్రకారం ఆక్వా రైతులకు ధర వచ్చేలా చూడాలి. గ్రామ సచివాలయాల్లో ఈ ధరలు ప్రకటించాలి. భౌతిక దూరం పాటిస్తూనే  వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టాలి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వలంటీర్లు, వైద్యులు నిర్వహించే  సర్వేకు రైతులు వారి కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండాలి. రబీ ధాన్యం వస్తున్నందున రైతుకు మంచి రేటు వచ్చేలా చూడాలి. వ్యవసాయోత్పత్తులు తరలించే వాహనాలపై ఆంక్షలొద్దు.’’



Updated Date - 2020-03-31T09:29:21+05:30 IST