అన్నకు ఊరూవాడా నివాళి

ABN , First Publish Date - 2022-01-19T06:22:52+05:30 IST

ఎన్టీఆర్‌ నామస్మరణతో జిల్లా మార్మోగింది. ఎక్కడచూసినా ఆయనను గుర్తుచేసుకుంటూ నివాళులర్పించే కార్యక్రమాలే. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్నిచోట్లా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.

అన్నకు ఊరూవాడా నివాళి
మారెళ్లలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలు రవికుమార్‌, స్వామి, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు

భారీ ఎత్తున ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు

విగ్రహాలు, చిత్రపటాలకు పూలదండలు

పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదానాలు

ఉత్సాహంగా పాల్గొన్న తెలుగుదేశం శ్రేణులు

మారెళ్లలో విగ్రహావిష్కరణ.. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరు

ఎన్టీఆర్‌ నామస్మరణతో జిల్లా మార్మోగింది. ఎక్కడచూసినా ఆయనను గుర్తుచేసుకుంటూ నివాళులర్పించే కార్యక్రమాలే. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్నిచోట్లా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడక్కడా విగ్రహావిష్కరణలు చేశారు. పలుచోట్ల పెద్దఎత్తున అన్నదానంతోపాటు రక్తదాన శిబిరాలను నిర్వహించారు. పలుసేవా కార్యక్రమాలను చేపట్టారు. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనగా.. వివిధ స్థాయిల్లోని ముఖ్యనేతలు వీలైనన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు. 

ఒంగోలు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలు భారీ ఎత్తున జరిగాయి. పలు పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు వందలాది గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలిస్తే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నేతృత్వంలో మార్టూరు సమీపంలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద మెగా మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. తొలుత అన్నకు నివాళులర్పించి మెడికల్‌ క్యాంపును ప్రారంభించిన ఏలూరి అనంతరం నాగండ్ల, బొబ్బేపల్లి, సంతరావూరు తదితర గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తొలుత బల్లికురవలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం సంతమాగులూరు మండలం వెల్లలచెరువులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, పార్టీ యువనేత దామచర్ల సత్యతో కలిసి స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో ఎన్టీఆర్‌, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం టంగుటూరు, తూమాడు, సింగరాయకొండ, పొన్నలూరుల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


ఒంగోలులో భారీగా కార్యక్రమాలు

జిల్లాకేంద్రమైన ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో భారీ రక్తదాన శిబిరం, అన్నదానం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ తదితరులు హాజరయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లోని ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గిద్దలూరు, కంభంలలో జరిగిన వర్ధంతి కార్యక్రమాలు, అలాగే ఎల్‌కోటలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వేములకోటలో, తర్వాత మార్కాపురంలో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. వై.పాలెంలో అక్కడి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రవీంద్రలు, గుడ్లూరులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దివి శివరాం, దర్శి, రాజంపల్లిలో అక్కడి ఇన్‌చార్జి పమిడి రమేష్‌, మాజీ  ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు వర్ధంతి కార్యక్రమాలకు హాజరయ్యారు. 


విగ్రహావిష్కరణకు పోటెత్తిన జనం

సంతనూతలపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పెద్దఎత్తున ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ మద్దిపాడు, సంతనూతలపాడు, చీమకుర్తి మండల కేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారీగా అన్నదానాలు నిర్వహించారు. ఎస్‌ఎన్‌పాడులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కనిగిరి టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అనారోగ్యంతో దూరంగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. చీరాల సెగ్మెంట్‌లోని కొన్నిచోట్ల స్థానిక నేతలు కార్యక్రమాలు చేపట్టారు. ముండ్లమూరు మండలం మారెళ్లలో మంగళవారం రాత్రి ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగ్గా దర్శి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు హాజరయ్యాయి. జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. గతంతో పోల్చితే ఈసారి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-19T06:22:52+05:30 IST