ఫీల్డ్‌కు ఎప్పుడో..

ABN , First Publish Date - 2022-04-26T05:30:00+05:30 IST

సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురై విధులకు దూరమైన ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఎదురుచూపులు తప్పడం లేదు.

ఫీల్డ్‌కు ఎప్పుడో..

- ఫీల్డ్‌ అసిస్టెంట్లకు విధులు కేటాయించని ప్రభుత్వం

- అసెంబ్లీ సాక్షిగా నెలన్నర క్రితమే ప్రకటించిన ముఖ్యమంత్రి

- ఉపాధికి దూరమై కుటుంబ పోషణకు అవస్థలు

- జిల్లాలో 180 పైగా ఎఫ్‌ఏలు


కామారెడ్డి, ఏప్రిల్‌ 26: సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురై విధులకు దూరమైన ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన వీరిని ప్రభుత్వం విధుల నుంచి తొలగించి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తోంది. విధుల్లోకి తీసుకోవాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. సీఎం ప్రకటన వచ్చి నెలన్నర రోజులు గడస్తున్నా ఇప్పటి వరకు వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు పిలుపువస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

సీఎం ప్రకటనతో ఆశలు

జీవో నెంబర్‌ 4779ను రద్దు చేయడంతో పాటు డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు 2020 మార్చిలో సమ్మె చేపట్టారు. ప్రభుత్వం ఆదేశించినా సమ్మెను వీడకపోవడంతో ఎఫ్‌ఏలను ఉద్యోగాల నుంచి తొలగించి, ఉపాధి పనుల నిర్వహణ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. దీంతో జిల్లాలో పని చేసిన 180 మందికి పైగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు విధులకు దూరమయ్యారు. అప్పటి నుంచి గ్రామాల్లో ఉపాధిపనులను పంచాయతీ కార్యదర్శులే పర్యవేక్షిస్తున్నారు. సమ్మె చేపట్టి ఉద్యోగాలకు దూరమైన ఫీల్డ్‌ అసిస్టెంట్లు తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని అనేక రకాలుగా విన్నవిస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్‌ సానుకూలంగా వ్యవహరిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. కానీ ఇంత వరకు వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు.

పర్యవేక్షణ లేక నాణ్యత కరువు

గ్రామాల్లో ఉపాధి హామీ బాధ్యతలను అప్పగించడంతో అధిక పని భారంతో పంచాయతీ కార్యదర్శులు ఒత్తిడికి గురవుతున్నారు. పంచాయతీ పనులతో తీరిక లేక ఇబ్బందులు పడుతుంటే ఉపాధి పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో పనులపై పర్యవేక్షణ కొరవడి నాణ్యత లోపిస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉపాధిహామీ పనులు జోరందుకోగా క్షేత్రస్థాయి పనులను పర్యవేక్షించే వారు లేక పనుల్లో క్వాలిటీ, క్వాంటిటీ దెబ్బ తింటోంది. ఒక్కో టెక్నికల్‌ అసిస్టెంట్‌కు 6 నుంచి 7 పంచాయతీలను అప్పగించడంతో వారు ఒకే సమయంలో అన్నిచోట్ల పనులను పర్యవేక్షించలేకపోతున్నారు.

దినదిన గండంగా బతుకులు

అరకొర వేతనానికే పనిచేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చిన ఎఫ్‌ఏలు ప్రస్తుతం కుటుంబ పోషణకు నానా తంటాలు పడుతున్నారు. రెండేళ్లుగా ఎలాంటి ఉపాధిలేక ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నారు. అందులోనే కరోనా కారణంగా మరో ఉపాధి దొరకక ఆర్థికంగా చితికిల పడ్డారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు చాలా మంది కూలీ పనులకు వెళ్తుండగా, మరికొంత మంది వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమను విధుల్లోకి తీసుకుని బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.


చాలా కష్టంగా ఉంది

- రాజేందర్‌, ఎఫ్‌ఏ, సదాశివనగర్‌

ఉపాధికి దూరమై చాలా కష్టంగా బతుకుతున్నాం. సమ్మెతో ఉద్యోగాలు కోల్పోయి రెండు సంవత్సరాలు దాటింది. నాటి నుంచి నేటి వరకు కుటుంబాలను పోషించుకునేందుకు నానా తంటాలు పడుతున్నాం. వెంటనే విధుల్లోకి తీసుకుని ఆదుకోవాలి.


వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

- పరుశురాంగౌడ్‌, ఎఫ్‌ఏల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, దోమకొండ

ఫీల్డ్‌ అసిస్టెంట్లను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకుని బాధ్యతలు అప్పగించాలి. రెండేళ్లు విధులకు దూరంగా ఉన్న మాపై సీఎం కేసీఆర్‌ దయచూపి తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా విధుల్లోకి తీసుకుని బాధ్యతలు అప్పగించాలి.

Updated Date - 2022-04-26T05:30:00+05:30 IST