సాయంత్రం స్నాక్స్‌

ABN , First Publish Date - 2020-06-13T05:30:00+05:30 IST

ఇంట్లో ఉంటే సాయంత్రం ఏవైనా స్నాక్స్‌ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్లకు రెగ్యులర్‌వి కాకుండా స్పెషల్‌గా స్నాక్స్‌ చేసి పెడితే ఇష్టంగా తింటారు. పొటాటో లాలీపాప్స్‌, పోహా నగెట్స్‌, టార్ట్‌ ఛాట్‌, ఫయరీ రింగ్స్‌ ఈ కోవకు చెందినవే. ఆ రుచులను మీరూ ట్రై చేయండి...

సాయంత్రం  స్నాక్స్‌

ఇంట్లో ఉంటే సాయంత్రం ఏవైనా స్నాక్స్‌ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్లకు రెగ్యులర్‌వి కాకుండా స్పెషల్‌గా స్నాక్స్‌ చేసి పెడితే ఇష్టంగా తింటారు. పొటాటో లాలీపాప్స్‌, పోహా నగెట్స్‌, టార్ట్‌ ఛాట్‌, ఫయరీ రింగ్స్‌ ఈ కోవకు చెందినవే. ఆ రుచులను మీరూ ట్రై చేయండి.




పోహా నగెట్స్‌


కావలసినవి

అటుకులు - ఒకకప్పు, బంగాళదుంప - ఒకటి, బియ్యప్పిండి - రెండు స్పూన్లు, కారం - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, ఎండుమిర్చి - రెండు, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌. 


తయారీ

  1. పాత్రలో ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. ఈ అటుకులను శుభ్రంగా కడగాలి. 
  2. తరువాత అటుకుల్లో కొద్దిగా నీళ్లు పోసి కాసేపు పక్కన పెట్టాలి. 
  3. ఇప్పుడు మెత్తగా అయిన అటుకుల్లో మిగిలిన నీళ్లను జాలి సహాయంతో వడబోసి తీసేయాలి.
  4. ఉడికించిన బంగాళదుంపను మెత్తగా చిదిమి అందులో వేయాలి. తరువాత అందులో బియ్యప్పిండి, ఉప్పు, కారం, చిల్లీ ఫ్లేక్స్‌, ధనియాల పొడి వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి.
  5. తరువాత మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ నగెట్స్‌లా చేసుకోవాలి.
  6. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అటుకుల నగ్గెట్స్‌ వేసి వేగించాలి. 
  7. వీటిని చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.



పొటాటో లాలీపాప్స్‌


కావలసినవి

బంగాళదుంపలు - రెండు, బ్రెడ్‌ ప్యాకెట్‌ - ఒకటి(చిన్నది), కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి - అర టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, ఛాట్‌మసాలా - అర టీస్పూన్‌, మైదా - ఒక టేబుల్‌స్పూన్‌, కరివేపాకు - కొద్దిగా,  నిమ్మకాయ - ఒకటి, పసుపు - అర టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత. 


తయారీ

  1. ముందుగా పెద్ద సైజులో ఉండే రెండు బంగాళదుంపలను ఉడికించాలి.
  2. తరువాత వాటి పొట్టు తీసి బౌల్‌లోకి తీసుకొని గుజ్జుగా చేసుకోవాలి.
  3. బ్రెడ్‌ ముక్కలను తీసుకొని ముక్కలుగా కట్‌ చేసి, మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. 
  4. ఇప్పుడు బంగాళదుంప గుజ్జు ఉన్న పాత్ర తీసుకొని అందులో ఒక కప్పు బ్రెడ్‌ క్రంబ్స్‌ వేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒకస్పూన్‌ అల్లంవెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్రపొడి, ఛాట్‌ మసాల వేసి, ఒక టీస్పూన్‌ నిమ్మరసం పిండుకొని కలపాలి. 
  5. మరొక పాత్రలో ఒక టేబుల్‌స్పూన్‌ మైదా తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. 
  6. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకొని మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్‌లా చుట్టుకోవాలి.
  7. వీటిని మైదా నీళ్లలో ముంచుకుంటూ మిగిలిన్‌ బ్రెడ్‌ క్రంబ్స్‌ని అద్దుకోవాలి.
  8. ఒకపాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేగించాలి. ఎక్కువ సేపు వేగించకుండా రెండు, మూడు నిమిషాల పాటు వేగించుకుంటే సరిపోతుంది.
  9. పొటాటో లాలీపాప్స్‌కి టూత్‌పిక్స్‌ గుచ్చి సర్వ్‌ చేసుకోవాలి. 




సీకా కబాబ్స్‌


కావలసినవి

బంగాళదుంప - ఒకటి, క్యారెట్‌ - ఒకటి, పచ్చిబఠాణి - అరకప్పు, ఫ్రెంచ్‌బీన్స్‌ - ఐదారు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, మామిడికాయ పొడి - ఒకటేబుల్‌స్పూన్‌, ఛాట్‌మసాలా - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - నాలుగైదు, జున్ను - 75 గ్రాములు, ఉప్పు - తగినంత.


తయారీ

  1. బంగాళదుంపను ఉడికించి పొట్టు తీసి, గుజ్జుగా చేసుకోవాలి. ఫ్రెంచ్‌బీన్స్‌ను కట్‌ చేయాలి. 
  2. ఒకపాన్‌ తీసుకుని కాస్త వేడి అయ్యాక అల్లంవెల్లుల్లి పేస్టు వేగించాలి. తరువాత బంగాళదుంప గుజ్జు, క్యారెట్‌ ముక్కలు, పచ్చిబఠాణి, ఫ్రెంచ్‌ బీన్స్‌ వేసి కాసేపు వేగించాలి.
  3. తరువాత మామిడికాయపొడి, ఛాట్‌ మసాలా, పచ్చిమిర్చి వేసి మరో రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి.
  4. ఇప్పుడు జున్ను వేసి కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేసి మరోసారి కలపాలి.
  5. ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్‌లోకి తీసుకొని సమాన భాగాలుగా కట్‌ చేయాలి. ఒక్కో భాగాన్ని తీసుకుంటూ గుండ్రంగా చుట్టాలి. 
  6. చిన్నమంటపై నాన్‌ స్టిక్‌ పాన్‌ పెట్టి వాటిని గుండ్రంగా తిప్పుకుంటూ అన్ని వైపులా సమంగా కాల్చాలి. 
  7. చట్నీతో తింటే ఈ కబాబ్స్‌ టేస్ట్‌ సూపర్‌గా ఉంటుంది.




ఫయరీ రింగ్స్‌


కావలసినవి

ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, సెనగపిండి - మూడు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, బ్రెడ్‌ క్రంబ్స్‌ - మూడు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా - పావు టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత,  ఎండుమిర్చి - రెండు, నూనె - వేగించడానికి సరిపడా. 


తయారీ

  1. ఒక పాత్రలో సెనగపిండి, బియ్యప్పిండి, తగినంత ఉప్పు, గరం మసాల, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్‌(ఎండుమిర్చిని గ్రైండ్‌ చేసుకోవాలి) వేసి, తగినన్ని నీళ్లు పోసి మిశ్రమంలా కలపాలి. బాగా గట్టిగా కాకుండా కాస్త నీళ్లలా ఉండేలా చూసుకోవాలి.
  2. ఉల్లిపాయలను గుండ్రంగా(రింగ్స్‌లా) కట్‌ చేసుకోవాలి. టొమాటోలను కూడా మధ్యలో భాగం తీసేసి చక్రాల్లా తరిగి పెట్టుకోవాలి.
  3. మరొక పాత్రలో బ్రెడ్‌ క్రంబ్స్‌ తీసుకుని, అందులో మిగిలిన చిల్లీ ఫ్లేక్స్‌ వేసి కలపాలి.
  4. ఇప్పుడు ఒక్కో ఉల్లిపాయ రింగ్‌ను తీసుకుని సెనగపిండి మిశ్రమంలో ముంచి తీస్తూ, బ్రెడ్‌ క్రంబ్స్‌ అద్దుకుంటూ ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి.
  5. పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక రింగ్స్‌ వేసుకొని వేగించాలి. ముదురు గోధుమ రంగులోకి మారే వరకు వేగించి తీసుకోవాలి.
  6. కెచప్‌తో వేడివేడిగా వడ్డించుకోవాలి.



టార్ట్‌ ఛాట్‌


కావలసినవి

ఆపిల్‌ - ఒకటి, కీర - ఒకటి, టొమాటో - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, మొలకెత్తిన గింజలు - పావుకప్పు, దానిమ్మ గింజలు - పావుకప్పు, కారప్పూస - కొద్దిగా, చింతపండు చట్నీ - నాలుగు టీస్పూన్‌లు, నల్లమిరియాలు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, పెరుగు - నాలుగు టీస్పూన్లు, టార్ట్‌లు - పది.


తయారీ

  1. యాపిల్‌, కీర, టొమాటో, ఉల్లిపాయలను ముక్కలుగా  కట్‌ చేయాలి.
  2. వాటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. మొలకెత్తిన గింజలు వేయాలి.
  3. తరువాత పెరుగు, చట్నీ, మిరియాలు, తగినంత ఉప్పు వేసి కలపాలి.
  4. ఒక  వెడల్పాటి ప్లేట్‌ తీసుకొని అందులో టార్ట్‌లు పెట్టుకోవాలి. అందులో చాట్‌ మిక్చర్‌ వేయాలి.
  5. కారప్పూస, దానిమ్మ గింజలతో గార్నిష్‌ చేసి అందించాలి.

Updated Date - 2020-06-13T05:30:00+05:30 IST