టిడ్కో.. ఎప్పటికో?

ABN , First Publish Date - 2022-08-01T05:52:43+05:30 IST

జిల్లాలో టిడ్కో లబ్ధిదారుల సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియని దుస్థితి. ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణాలు మాత్రం ముందుకు సాగడం లేదు.

టిడ్కో.. ఎప్పటికో?
పార్వతీపురం టౌన్‌: అడ్డాపుశీల వద్ద అర్ధాంతరంగా నిలిచిన టిడ్కో గృహ నిర్మాణ సముదాయం

   ఏళ్లు గడుస్తున్నా.. పూర్తికాని  ఇళ్ల నిర్మాణాలు

  సాలూరులో కొనసా...గుతున్న పనులు

  పార్వతీపురంలో పరిస్థితి మరింత దయనీయం

   గృహాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

   రివర్స్‌ టెండరింగ్‌తో కొందరికి మొండిచేయి 

 సర్కారు తీరుపై విమర్శల వెల్లువ 

(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి/పార్వతీపురం టౌన్‌/సాలూరు)

జిల్లాలో టిడ్కో లబ్ధిదారుల సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియని దుస్థితి.  ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణాలు మాత్రం ముందుకు సాగడం లేదు. కొన్నిచోట్ల పునాదుల స్థాయి కూడా దాటలేదు. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందన్న ఆశతో ఉన్న లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. మరోవైపు రివర్స్‌ టెండరింగ్‌లో ఇళ్లు, డబ్బులు కోల్పోయిన లబ్ధిదారులకు ఇంతవరకూ న్యాయం జరగలేదు. మొత్తంగా సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఇళ్లపై ఇలానే వ్యవహరిస్తారా? అంటూ జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. 

ఇదీ పరిస్థితి.. 

పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి సొంతింటి కల నెరవేర్చాలని గత టీడీపీ ప్రభుత్వం భావించింది.  ఈ మేరకు  జిల్లాలో పార్వతీపురం, సాలూరు మునిసిపాలిటీల్లో టిడ్కో ద్వారా గృహ సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది.  పార్వతీపురం పట్టణంలోని పేదలకు మండలంలోని అడ్డాపుశీల గ్రామం వద్ద టిడ్కో ఇళ్లు నిర్మించాలని సంకల్పించారు.  పట్టణంలోని సుమారు 1488 లబ్ధిదారులతో సుమారు రూ.2.34  కోట్ల  మేర అధికారులు బ్యాంకు డీడీల రూపంలో కట్టించారు.  గృహనిర్మాణ సముదాయాలకు సంబంధించి  892 మంది రూ. 500, 49 మంది రూ.12,500, 238 మంది రూ. 25వేలు, 309 మంది  రూ50 వేల  చొప్పున  డీడీలు తీసి మున్సిపల్‌ కార్యాలయంలో అందజేశారు. అయితే  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మారింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో నిర్మాణాలకు బ్రేక్‌ పడింది. ఇప్పటివరకూ ఒక ఇంటిని కూడా నిర్మించలేదు. అన్నీ పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. రూ.500లు కట్టిన వారికి  మినహా మిగిలిన లబ్ధిదారు లకు  మొండి చేయి చూపారు.  1488 మంది లబ్ధిదారుల్లో 768 మందికి మాత్రమే టిడ్కో ద్వారా గృహ నిర్మాణాలు చేపడతామని, మిగతా వారికి జగనన్న కాలనీల్లో కేటాయిస్తామని గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.  పట్టణానికి సుమారు 5 నుంచి 8 కిలో మీటర్ల దూరంలో  ఉన్న కొండల్లో, తోటల్లో  స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించుకోమంటే ఎలా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.  2019లో అప్పులు చేసి డీడీలు చెల్లించామని,  ప్రస్తుతం వడ్డీలు కట్టలేకపోతున్నామని వారు వాపోతున్నారు. ఇళ్లు రద్దు చేసిన తమకు డీడీల రూపంలో చెల్లించిన మొత్తాన్ని తిరిగి అందించాలని వారు కోరుతున్నారు.   

  సాలూరు పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న చంద్రంపేట సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టారు. అప్పట్లో 1444 మంది లబ్ధిదారులు డీడీలు రూపంలో చెల్లించారు. ఇళ్ల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని బట్టి 1152 మంది రూ.500,  192 మంది లబ్ధిదారుల్లో కొంత మంది రూ.25 వేలు, మరికొంతమంది రూ.37,500 చొప్పున డీడీలు అందజేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులను సంఖ్యను కుదించారు. కేవలం 1248 మందికే టిడ్కో ఇళ్లు ఇస్తామని, మిగతావారికి జగనన్న కాలనీల్లో స్థలాలు ఇస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా ఇప్పటివరకూ 300 చదరపు అడుగులకు సంబంధించి 1152 టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. 365 చదరపు అడుగలకు సంబంధించి 96 ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. టిడ్కో ఇళ్ల కోసం డీడీల రూపంలో రూ.25 వేలు నుంచి రూ.37,500 రూపంలో చెల్లించిన లబ్ధిదారులతో పాటు  కొత్తగా దరఖాస్తు చేసుక్ను 930 మంది కోసం  ఇళ్ల స్థల సేకరణ చేస్తున్నామని మునిసిపల్‌ అధికారులు చెబుతున్నారు.  ఇదిలా ఉండగా  డిసెంబరులోపు టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ అది ఎంతవరకు అమలవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసే నాటికి రహదారులు, కాలువలు, తదితర పనులు ఎప్పటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తారో? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 

 న్యాయం చేస్తాం 

టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇళ్లను నిర్మించి అర్హులందరికీ  ఇచ్చేందుకు ప్రభుత్వం సముఖంగా ఉంది. దీనిపై లబ్ధిదారులు  ఆందోళన చెందనవసరం లేదు. 

   -   జి.ఆనంద్‌కుమార్‌, కమిషనర్‌, పార్వతీపురం మునిసిపాలిటీ  

  ఖాతాల్లో జమచేస్తాం 

 రివర్స్‌ టెండరింగ్‌ విధానం వల్ల టిడ్కో ఇళ్లు కోల్పోయిన లబ్ధిదారులకు రూ. 56 లక్షల 80 వేలు  చెల్లించాల్సి ఉంది. డబ్బులు వచ్చిన వెంటనే ప్రతిఒక్కరి ఖాతాల్లో జమ చేస్తాం. రూ.500 డీడీ రూపంలో చెల్లించిన వారికి సైతం ఒక్క రూపాయం మాత్రం ప్రభుత్వ ఖాతాలో ఉంచి, మిగతా రూ.499 చెల్లిస్తాం. కొత్తగా 930 మంది ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వారి కోసం స్థల సేకరణ చేస్తున్నాం. 

హనుమంతు శంకరరావు, కమిషనర్‌, సాలూరు మునిసిపాలిటీ  



Updated Date - 2022-08-01T05:52:43+05:30 IST