న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ట్విటర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చురకలు వేశారు. దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన సదస్సులో మోదీ ప్రసంగిస్తుండగా టెలిప్రాంప్టర్ సక్రమంగా పని చేయని నేపథ్యంలో గాంధీ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ఇన్ని అబద్ధాలను టెలిప్రాంప్టర్ సైతం భరించలేకపోయిందని ఎద్దేవా చేశారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం దావోస్ ఎజెండా సదస్సును ఐదు రోజులపాటు నిర్వహిస్తోంది. సోమవారం నుంచి ఈ సదస్సు జరుగుతోంది. తొలి రోజు సమావేశంలో వర్చువల్ విధానంలో మోదీ మాట్లాడారు. మోదీ ప్రసంగం మధ్యలో టెలిప్రాంప్టర్ సరిగా పని చేయలేదు. దీంతో ఆయన అర్థాంతరంగా తన ప్రసంగాన్ని నిలిపేయవలసి వచ్చింది. ఈ సంఘటన ట్విటర్లో నెంబర్ 1లో ట్రెండ్ అవుతోంది.
ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ, తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల గురించి వివరించారు. గత కాలం నుంచి వర్తించే పన్ను విధానం వల్ల ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు సంస్కరణలను చేపట్టినట్లు తెలిపారు. సంపదను నగదుగా మార్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరుగుతున్న కృషిని వివరించారు.
ఇవి కూడా చదవండి