Pak Terrorists Vs India : పాకిస్థాన్ కుదేలవుతున్నా భారత్‌పై విషం చిమ్ముతున్న ఉగ్రవాద సంస్థలు

ABN , First Publish Date - 2022-09-18T23:27:31+05:30 IST

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నా, వరదలు అతలాకుతలం చేస్తున్నా

Pak Terrorists Vs India : పాకిస్థాన్ కుదేలవుతున్నా భారత్‌పై విషం చిమ్ముతున్న ఉగ్రవాద సంస్థలు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నా, వరదలు అతలాకుతలం చేస్తున్నా ఉగ్రవాద సంస్థలు భారత దేశంపై విషం కుమ్మరించడం మానడం లేదు. శారీరక దారుఢ్యం, చురుగ్గా కదలడం వంటివాటిలో శిక్షణ కోసం జిమ్‌లలో చేరాలని యువతకు పిలుపునిస్తున్నాయి. ఇలా చేరినవారిని తరచూ నియంత్రణ రేఖ వద్దకు తీసుకెళ్ళి, భారత దేశంతో సరిహద్దు ప్రాంతాలను పరిచయం చేస్తున్నాయి. వీరిని భవిష్యత్తులో భారత దేశంలోకి అక్రమంగా పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 


తెహరీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్ (TTP)పై కఠినంగా వ్యవహరిస్తామని, కైబర్ పష్తూన్‌క్వా, బలూచిస్థాన్‌లలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను కొనసాగిస్తామని పాకిస్థాన్ హెచ్చరిస్తోంది. అయితే పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ (JeM), లష్కరే తొయిబా (LeT) మాత్రం భారత దేశంలోకి ఉగ్రవాదులను పంపించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. 


జిమ్‌లలో ఉగ్రవాద శిక్షణ

జేఈఎం ఉగ్రవాద సంస్థ యువతను చేర్చుకుంటోంది. కరాచీ, గుజ్రన్వాలా, సియాల్‌కోట్, పెషావర్, ముజఫరాబాద్, కోట్లి, నరోవల్, షకర్‌గఢ్ తదితర చోట్ల ఈ ఉగ్రవాద సంస్థకు జిమ్‌లు ఉన్నాయి. వీటిలో చేరాలని యువతకు పిలుపునిస్తోంది. ఇలా చేరిన యువతకు కఠోర శిక్షణనిస్తోంది. వీరిని తరచూ సరిహద్దు ప్రాంతాలకు తీసుకెళ్ళి, పరిచయం చేస్తోంది. అవసరమైనపుడు చాకచక్యంగా భారత దేశంలో చొరబడటానికి వీలుగా శిక్షణనిస్తోంది. ఆగస్టు 5 నుంచి 11 వరకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో కొందరు యువతకు శిక్షణ ఇచ్చింది. ఏడు రోజులపాటు జరిగిన ఈ శిక్షణ శిబిరానికి దౌరా తర్బియా అని పేరు పెట్టింది. బాగ్ జిల్లాలోని గంగా చోటీ వద్ద ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. 


భారత దేశంతోపాటు పాశ్చాత్య దేశాలపై విషం చిమ్మడంలో లష్కరే తొయిబా కూడా చురుగ్గానే వ్యవహరిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థ నేతలు తరచూ శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొనే యువతను రెచ్చగొడుతున్నారు. స్వీయ రక్షణ కోసం శిక్షణ ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారు. వీరు వరదలను కూడా తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. వరద బాధితులను ఆదుకుంటామంటూ విరాళాలను సేకరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సాయపడుతూ, తమ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు. ఉగ్రవాదానికి పనికొచ్చేవారిని గుర్తించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.


ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో ఆగస్టులో పట్టు సాధించినట్లే కనిపిస్తోంది. ఉగ్రవాద సంబంధిత మరణాల సంఖ్య దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, మొత్తం మీద భద్రత పరిస్థితులు క్షీణించాయి. ఇతర ఉగ్రవాద సంస్థలు బలపడుతున్నప్పటికీ, ఈ ఉగ్రవాద సంస్థలో కొంత వరకు నైరాశ్యం కనిపిస్తోంది. టీటీపీతో చర్చలు ఎటూ తేలడం లేదు. 


ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే సంక్షోభంలో ఉంది. టీటీపీతో ఘర్షణ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం, టీటీపీ మధ్య రాజీ కుదరడం లేదు. గత నెలలో కూడా ఇరు వర్గాలు కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డాయి. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. 


ప్రజలపై పెను భారం

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF), మిత్ర దేశాలు సాయపడుతున్నప్పటికీ పాకిస్థాన్‌లో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. 1.17 బిలియన్ డాలర్లను విడుదల చేసేందుకు, 2023 జూన్ వరకు ఎక్స్‌టర్నల్ ఫండ్ ఫెసిలిటీని పొడిగించేందుకు ఐఎంఎఫ్ బోర్డు ఆగస్టు 29న ఆమోదం తెలిపింది. అంతటితో ఆగకుండా సుమారు 950 మిలియన్ డాలర్ల స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ సహాయాన్ని పెంచింది. మొత్తం మీద సహాయ ప్యాకేజీ విలువ 6.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఐఎంఎఫ్ సహాయపడినప్పటికీ, పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దయనీయంగానే కొనసాగుతోంది. ఆగస్టు 24నాటికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు 7.7 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. 

 

వరదల ప్రభావం

వరదల వల్ల టెక్స్‌టైల్ ఎగుమతులు దెబ్బతిన్నాయి. కాబట్టి రాబోయే కొద్ది నెలలపాటు విదేశీ మారక ద్రవ్యం రావడం కష్టమే. బహుపాక్షిక, ద్వైపాక్షిక మిత్ర దేశాలు 500 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించినప్పటికీ, పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. వరదల వల్ల 10 బిలియన్ డాలర్ల మేరకు నష్టం జరిగిందని పాకిస్థాన్ ప్రభుత్వం చెప్తోంది. 


ఇమ్రాన్ ఖాన్‌పై కేసులు

పాకిస్థాన్ తెహరీక్-ఈ-ఇన్సాఫ్ (PTI) చైర్మన్, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నియాజీపై అనేక కేసులు నమోదయ్యాయి. పోలీసు ఉన్నతాధికారులను, మహిళా అదనపు సెషన్స్ జడ్జిని బెదిరించారంటూ యాంటీ టెర్రరిజం యాక్ట్ ప్రకారం కేసులను ప్రభుత్వం నమోదు చేసింది. మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా ఇమ్రాన్‌తోపాటు ఆయన నేతృత్వంలోని పార్టీ నేతలపై కేసులు దాఖలు చేసింది. దీంతో ఇమ్రాన్ ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతివ్వడంపై పునరాలోచించుకోవాలని సైన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. 


Updated Date - 2022-09-18T23:27:31+05:30 IST