విధుల్లో లేకపోయినా నర్సు ఔదార్యం... యాక్సిడెంట్ బాధితుని ప్రాణం నిలిపిన మానవత్వం...

ABN , First Publish Date - 2021-12-05T21:19:57+05:30 IST

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో నర్సుగా

విధుల్లో లేకపోయినా నర్సు ఔదార్యం... యాక్సిడెంట్ బాధితుని ప్రాణం నిలిపిన మానవత్వం...

మన్నార్‌గుడి (తమిళనాడు) : స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో నర్సుగా పని చేస్తున్న వనజ సకాలంలో ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. బైక్‌పై నుంచి పడిపోయిన విద్యార్థి వసంత్‌కు సకాలంలో, స్వచ్ఛందంగా సేవలందించి, అందరి మన్ననలు పొందుతున్నారు. ఆమె తన కుటుంబంతో కలిసి సెలవులను గడిపేందుకు వెళ్తూ, మానవత్వంతో స్పందించడంతో అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. 


ఎం వనజ (39) మన్నార్ గుడి జిల్లా ప్రధాన కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ సంవత్సరం క్రితం కాంట్రాక్టు పద్ధతిలో నర్సుగా చేరారు. ఇటీవలే తిరుచ్చిలోని  తమిళనాడు యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్ ఇనీషియేటివ్‌లో శిక్షణ పొందారు. ఆమె శుక్రవారం వారాంతపు సెలవుల సందర్భంగా తన కుటుంబంతో కలిసి కారులో బయల్దేరారు. మధుక్కూర్ నుంచి మన్నార్ గుడి వెళ్తున్నారు. లెక్కనంపెట్టయ్ వద్ద వసంత్ అనే పాలిటెక్నిక్ విద్యార్థి రోడ్డుపై పడిపోయి ఉండటాన్ని గమనించారు. ఆ విద్యార్థి చుట్టూ ఉన్న జనాన్ని పక్కకు పంపించి, ఆమె 30 సెకండ్ల పాటు కార్డియో పల్మనరీ రిససియేషన్ (సీపీఆర్) చేశారు. అనంతరం ఆయన నెమ్మదిగా స్పృహలోకి వచ్చాడు. మరో రెండు నిమిషాలపాటు అదే విధంగా సేవలందించేసరికి నడవగలిగిన స్థితికి చేరుకున్నాడు. అనంతరం 108 అంబులెన్సు ద్వారా తంజావూరు వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. 


వనజ మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ఇటువంటి సమయాల్లో ఆక్సిజన్ అవసరమవుతుందని, తాను మౌఖికంగా ఊపిరి అందించాలని అనుకున్నానని, కానీ వసంత్ తానే స్వయంగా ఊపిరి తీసుకోగలిగాడని చెప్పారు. 


వనజ పని చేస్తున్న ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ విజయ కుమార్ మాట్లాడుతూ, వసంత్‌కు ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. వనజ సకాలంలో సేవలందించడం వల్ల మేలు జరిగిందన్నారు. 


అత్యంత కీలక సమయంలో వసంత్‌ను కాపాడటానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసినవారు వనజను ప్రశంసిస్తూ, అభినందిస్తున్నారు. ఆమె ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


Updated Date - 2021-12-05T21:19:57+05:30 IST