Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఖండాలు దాటినా.. అమ్మభాషకు దగ్గరగా..

twitter-iconwatsapp-iconfb-icon
ఖండాలు దాటినా.. అమ్మభాషకు దగ్గరగా..

మన సంస్కృతిపై నిజమైన అభిమానం ఉంటే చాలు, అమెరికా వెళ్లినా అచ్చ తెలుగు బిడ్డలా బతుకొచ్చు అంటున్నారు ధనుంజయ్‌ తోటపల్లి. పలు వేదికల ద్వారా అమెరికాలో తెలుగు వెలుగులు పంచుతున్నారాయన. ఖండాంతరాలు దాటినా.. తెలుగుకు దగ్గరగా జీవనం సాగిస్తున్న ధనుంజయ్‌ విశేషాలివీ..

నేను పుట్టింది ఒంగోలులో. మా నాన్నగారు రక్షణశాఖలో పని చేసేవారు. ఆయనకు తరచూ బదిలీలు అయ్యేవి. దీంతో నా విద్యాభ్యాసం ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు ఇలా పలు చోట్ల సాగింది. చిన్నప్పటి నుంచి విభిన్న సంస్కృతుల మధ్య పెరగడంతో నాకు మన సంప్రదాయాలపై అవగాహన ఏర్పడింది. కొన్నాళ్లు మేం అస్సాంలో కూడా ఉన్నాం. అప్పుడు మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీగారి బావమరిది ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లం. మేమున్న ప్రాంతంలో మత కలహాలు జరిగేవి. ఆ ఇంటి యజమాని మాకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మంచితనమే అసలైన మతమని ఆయనను చూశాకే తెలిసింది. కొన్నాళ్లకు మా నాన్నగారు హైదరాబాద్‌ వచ్చారు. నా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ హైదరాబాద్‌లోనే సాగింది. తర్వాత గుంటూరులో డిగ్రీ, విశాఖలోని ఎయులో ఎంబిఎ చదివాను.

 

హైదరాబాద్‌లో ఉద్యోగం..

ఎంబిఏ అయిపోయాక హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరాను. అప్పుడప్పుడే సాఫ్ట్‌వేర్‌ రంగం ఎదుగుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. 1991లో నలుగురం స్నేహితులం కలసి స్ట్రాబస్‌ అనే కంపెనీ స్థాపించాం. ఇండియాలోని పలు కంపెనీలకు ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అందించేవాళ్లం. మా కంపెనీ తరఫున ఇండియాలో 160 మందికి, అమెరికాలో 200 మందికి ఉపాధి కల్పించాం.

 

బిజినెస్‌ ద్వారా నేను మూడు విషయాలు నేర్చుకున్నాను. మొదటిది.. కృషికి షార్ట్‌కట్స్‌ ఉండవు. మనసుపెట్టి శ్రమిస్తే ఫలితం తప్పక లభిస్తుంది. రెండోది.. జీవితంలో రిస్క్‌ తీసుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలం. మూడోది.. మనల్ని విమర్శించేవాళ్లను ఎప్పుడూ మనతో పాటే ఉంచుకోవాలి. మంచి విమర్శలు అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఈ మూడు సూత్రాలను నేను ఫాలో అయ్యాను. ఇప్పటి యువతకు ఇవే ఫాలో అవ్వమని చెబుతుంటాను.

 

మనబడి.. మన తెలుగు

మా అబ్బాయి ఆరోగ్య దృష్ట్యా 2000 సంవత్సరంలో మేం అమెరికా వచ్చాం. దేశం మారినా మనలోని భారతీయత మారదు కదా..! ఇక్కడకు వ చ్చాక కూడా తెలుగుపై, మన క ళలపై మక్కువ తగ్గలేదు. సిలికానాంధ్ర కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవాడిని. ఇక్కడ తెలుగు పిల్లలకు తెలుగు భాష నేర్పించడం కోసం మనబడి ఏర్పడింది. తెలుగులో ఆటలు, క్విజ్‌ ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. వీటిలో నేను పాల్గొనేవాడిని. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని మనబడికి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మనబడి ద్వారా.. పిల్లలకు తెలుగు నేర్పించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో మంది చిన్నారులు తెలుగు భాషతో పాటు మన సంస్కృతిని ఎంతో ఇష్టంగా నేర్చుకుంటున్నారు.

 

బలరాముడిగా అలరిస్తా..

నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) జూలైలో నిర్వహించనున్న సాంస్కృతిక వేడుక పనులను పర్యవేక్షిస్తున్నాను. దాదాపు ఐదు వందల మంది ఆర్టిస్టులతో 26 గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు చేయబోతున్నాం. నేను నా స్నేహితులతో కలసి మాయాబజార్‌ నాటకం కూడా వేస్తున్నాను. అందులో బలరాముడి పాత్ర పోషిస్తున్నాను. నాట్స్‌ ద్వారా కళల రంగానికి మరింత దగ్గరయ్యాను. కథలు కూడా రాస్తుంటాను. ‘ఇది నీ జీవితం’ పేరుతో ఓ పుస్తకం కూడా రాస్తున్నా. త్వరలోనే ప్రచురితం అవుతుంది.

 

సినిమాలపై ప్రేమతో..

నాకు సినిమాలంటే పిచ్చి. 2003లో ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ లాస్‌ఏంజెల్స్‌ (ఐఎఫ్ఎఫ్ఎల్‌ఎ) స్థాపించాను. ఏటా ఏప్రిల్‌లో ఆరు రోజుల పాటు ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తాం. ఆరు రోజులు హాలీవుడ్‌లోని ఆర్క్‌లైట్‌ థియేటర్‌లో సినిమాలు ప్రదర్శిస్తాం. ఇందుకోసం ఏటా 40 సినిమాలు ఎంపిక చేస్తాం. ఇవి ఇండియన్‌ సినిమాలు కానీ, ఇండియన్స్‌ తీసిన సినిమాలు గానీ అయి ఉండాలి. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా, యూరోప్‌, జర్మనీ ఇలా పలు దేశాల నుంచి మూడువందలకు పైగా సినిమాలు వస్తాయి. వీటిలో బెస్ట్‌ 40 ఎంపిక చేసి ప్రదర్శిస్తాం. ఈ వేడుకకు భారత్‌కు చెందిన నటీనటులతో పాటు దర్శకులను కూడా ఆహ్వానిస్తుంటాం. మా జీవితంలో ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఒక భాగమైపోయింది.

 

తెలుగుకు దగ్గరగా..

నా భార్య అనిత ఇండియాలో ఉన్నప్పుడు ఆంధ్రబ్యాంక్‌లో ఉద్యోగం చేసేది. ప్రస్తుతం సిమీ వాలీ స్కూల్లఓ స్పెషల్‌ ఎడ్యుకేటర్‌గా పని చేస్తోంది. మా అబ్బాయి వైభవ్‌. తను వీల్‌ చేర్‌ బాస్కెట్‌ బాల్‌ ఆటగాడు. సోషల్‌ నెట్‌వర్కింగ్‌నూ బాగా ఎంజాయ్‌ చేస్తాడు. మాది చిన్న కుటుంబం. అందరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. మన తెలుగుకు దగ్గరగా ఉంటున్నాం. 

 

ఏటా రెండు సంబరాలు..

మేముండే ప్రదేశాన్ని ట్రై వాలీ అంటారు. ఇక్కడ ఉండే తెలుగు వారి కోసం ఓ సంఘం ఉంటే బాగుండనిపించింది. నేను, మరికొందరు కలసి ట్రై వాలీ తెలుగు సంఘాన్ని ఏర్పాటు చేశాం. 2003లో ఆన్‌లైన్‌లో మొదలైన ఈ తెలుగు సంఘం.. ఇక్కడి ప్రతి తెలుగు గడపకి పరిచయమైంది. దసరా, దీపావళి, వినాయకచవితి.. మన పండుగల్లో.. ఏటా ఏవైనా రెండు పండుగలను సంఘం తరఫున సెలబ్రేట్‌ చేసుకుంటాం. ఆ పండుగలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంంటాం. ఈ సందర్భంగా పిల్లలు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ కార్యక్రమాల ద్వారా ఇక్కడి పిల్లలకు తెలుగుదనంపై అవగాహన పెరుగుతుంది.Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

విదేశీ విన్నర్Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.