Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 19 Aug 2022 06:42:31 IST

పాతికేళ్లయినా.. పరిశ్రమ ఊసేదీ...?

twitter-iconwatsapp-iconfb-icon
పాతికేళ్లయినా.. పరిశ్రమ ఊసేదీ...?పాత గొల్లపల్లె గ్రామంలో ఇళ్ల మధ్య కంపచెట్లు పెరిగిన దృశ్యం

పాలకుల మాటలు... నీటి మూటలేనా   

ఏళ్లు గడుస్తున్నా ఎదురుచూపులే    

ఏసీసీ భూ నిర్వాసితుల ఆవేదన


ఒకటి కాదు.. రెండు కాదు.. పాతికేళ్లయినా అసోసియేట్‌ సిమెంటు కార్పొరేషన్‌ (ఏసీసీ) లిమిటెడ్‌ ఏర్పాటు కాలేదు. సిమెంటు పరిశ్రమ ఏర్పాటు చేస్తారు, తమ జీవితాలు బాగుపడతాయని ఏసీసీకి భూములిచ్చిన రైతులు ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. పాలకులు మారారే కానీ ఫ్యాక్టరీ మాత్రం సాకారం కాలేదు. 


మైలవరం, ఆగస్టు 18: మైలవరం మండల పరిధిలోని గొల్లపల్లె, వద్దిరాల పరిసర ప్రాంతాల్లో సిమెంటు పరిశ్రమ నిర్మాణానికి పాతికేళ్ల క్రితం ఏసీసీ ముందుకు వచ్చింది. వద్దిరాల, గొల్లపల్లె, జీ.ఉప్పలపాడు, చిన్నవెంతుర్ల, బెస్తవేముల, బి.జంగాపల్లె, రేగడిపల్లె, కల్లుట్ల గ్రామాల్లోని భూముల్లో నాణ్యత గల సిమెంటు రాయి ఉన్నట్లు తేలింది. దీంతో సిమెంటు పరిశ్రమ నిర్మిస్తామని వేల ఎకరాల పంట పొలాలను రైతుల నుంచి కొనుగోలు చేశారు. 1996వ సంవత్సరంలో ఎకరా రూ.50 వేలతో 800ల ఎకరాలు కొన్నారు. 2006-07 సంవత్సరంలో ఎకరా రూ.1.25లక్షల చొప్పున 1200ల ఎకరాలు, 2008-09 సంవత్సరంలో ఎకరా రూ.4లక్షలతో 700ల ఎకరాలకు పైగా భూములను ఏసీసీ కొనుగోలు చేసింది. 


ఏసీసీ భూ బాధితుల సంఘం

రైతులు సైతం తమ ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ వస్తుంది.. పిల్లలకు ఉద్యోగాలు వచ్చి బాగుపడతారని భూములను ఏసీసీకి అమ్ముకున్నారు. రైతుల నుంచి భూములైతే కొన్నారు కానీ సిమెంటు పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. దీంతో అక్కడి పంట పొలాలు బీళ్లుగా మారాయి. వీటిల్లో కంపచెట్లు ఏపుగా పెరిగి అడవి పందులకు నివాస స్థలాలుగా మారి సమీప పొలాల రైతులకు తీవ్ర ఇబ్బంది కలిగించాయి. ఈ నేపథ్యంలో 2010లో ఏసీసీ భూ బాధితుల సంఘం ఏర్పాటైంది. పరిశ్రమ నిర్మించేంత వరకు బీడువారిన తమ పంట పొలాలను తామే సాగు చేసుకుంటామంటూ 2010 జూన్‌ నెలలో ప్రకటించారు.


పందుల బెడదతో..

1996, 2006-7లో ఏసీసీకి రైతులు భూములు ఇవ్వ డంతో అవన్నీ బీళ్లుగా మారాయి. దీంతో ఇక్కడ అడవి పందుల బెడద పెరిగిపోయింది. పరిహారం తీసుకున్న రైతులు ఎప్పటికైనా ఏసీసీ పరిశ్రమ వస్తుంది, ఊరు ఖాళీ చేయాల్సి వస్తుందని భావించారు. గొల్లపల్లె, జి.ఉప్పలపాడు వాసులు కిలోమీటర్‌ దూరంలోని కొండపైన ఇళ్లు కట్టుకున్నారు. దీంతో ఈ రెండు గ్రామాల్లో కంపచెట్లు పెరిగిపోయి ఇళ్లు పాడుబడ్డాయి తప్ప పరిశ్రమ మాత్రం ఏర్పాటు కాలేదు.


ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆరేళ్లయినా..

2016 సెప్టెంబరు 9వ తేది ఏసీసీ యాజమాన్యం ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు ఏర్పాటు చేశారు. అయితే రైతులు తమ డిమాండ్‌లను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఎట్టకేలకు అప్పటి కలెక్టర్‌ ఆధ్వర్యంలో సెప్టెంబరు 16వ తేదిన గొల్లపల్లె సమీపంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. రైతులు తమ డిమాండ్‌లను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎకరా యాభైవేలు, లక్షా ఇరవైఐదు వేలతో భూములను విక్రయించిన రైతులకు అదనపు పరిహారం చెల్లించాలని, విద్యార్హతతో నిమిత్తం లేకుండా భూములు కోల్పోయిన రైతులకు ఇంటికి ఒక ఉద్యోగం, శాశ్వత ఉపాధి, ఫ్యాక్టరీ నిర్మాణపనుల్లో ప్రాధాన్యత కల్పించడం, పరిశ్రమలో బ్లాస్టింగ్‌ జరుగుతున్నప్పుడు సమీప గ్రామాల ఇళ్లకు ప్రమాదం సంభవిస్తే అప్పటి ధరల ప్రకారం ఆ ఇంటిని కొనడం లేదా నష్ట పరిహారం చెల్లించాలని రైతులు వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు న్యాయం చేస్తామని చెప్పి దాదాపు ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదు. 


ప్రభుత్వం కొలువుదీరి మూడేళ్లయినా..

అప్పట్లో వైసీపీ నేత ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆ గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే ఏసీసీ భూ బాధిత రైతులకు న్యాయం చేస్తామని, పరిశ్రమ నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి మూడేళ్లు దాటినా పరిశ్రమ ఊసే లేదు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఏసీసీ పరిశ్రమ నిర్మించేందుకు చొరవ చూపాలని బాధిత రైతులు కోరుతున్నారు.


ఎమ్మెల్యే పరిశ్రమ నిర్మాణానికి కృషి చేయాలి

- మహమ్మద్‌, రైతు, చిన్నవెంతుర్ల గ్రామం

రెండు దశాబ్దాలకు పైగా పరిశ్రమ వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఏసీసీ యాజమాన్యం పరిశ్రమ ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 2016లో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించి తొందరలోనే పరిశ్రమ నిర్మిస్తామని ఏసీసీ యాజమాన్యం, పెద్దలు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి కదలికా లేదు. 2019 ఎన్నికల ముందు గొల్లపల్లిలో ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏసీసీ భూబాధిత రైతులకు న్యాయం చేస్తామని, పరిశ్రమ నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. ఆ మేరకు ఎమ్మెల్యే పరిశ్రమ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి.


ఉద్యోగం, ఉపాధి కోసం ఎదురుచూస్తున్నాను..

- గంగరాజు, రైతు, వద్దిరాల గ్రామం

ఏసీసీ భూ బాధిత రైతులకు యాజమాన్యం 26 సంవత్సరాలుగా ఎదురు చూపులనే మిగిల్చింది. చుట్టూ పక్కల గ్రామాల రైతులు పరిశ్రమ నిర్మిస్తారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఎదురుచూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వమైనా ఏసీసీ పరిశ్రమ నిర్మిస్తుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు. మూడేళ్లయినా ఆ ఊసే లేదు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.