శిక్షలోనూ.. వివక్షా!

ABN , First Publish Date - 2021-11-30T06:36:12+05:30 IST

ఇద్దరు నాయకులు.. వారు ఒకప్పుడు వేర్వేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌)కు అధ్యక్షులుగా పని చేశారు. ఆ ఇద్దరూ ప్రాతినిథ్యం వహించిన రెండు సొసైటీల్లో అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అఽధికారులు విచారణ చేపట్టి నిజమేనని తేల్చారు. ఒకప్పుడు ఆ ఇద్దరూ తెలుగుదేశంలో ఉన్నవారే. ప్రస్తుతం అందులో ఒకరు అధికార వైసీపీలో ఉండగా, మరొకరు టీడీపీలోనే కొనసాగుతున్నారు. వీరిలో ప్రస్తుతం టీడీపీలో ఉన్న నాయకుడు జైలుకు వెళ్లారు. వైసీపీలో ఉన్న నేత మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పార్టీలో ఉన్న నేతపై ఉన్న కేసును తొక్కిపెడుతున్నారు. ఇక్కడ అరెస్టయిన టీడీపీ నేత పర్చూరు నియోజకవర్గం కారంచేడు సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ అక్కయ్యచౌదరి. మరొకరు అధికార వైసీపీలో ఉన్న అద్దంకి నియోజకవర్గం జాగర్లమూడివారిపాలెం సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు జాగర్లమూడి యల్లమందరావు. ఈ సంఘటన ఇప్పుడు జిల్లాలోని రాజకీయ నేతలతోపాటు, ఇటు రైతుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

శిక్షలోనూ.. వివక్షా!

గతంలో రెండు సహకార సొసైటీల్లో అవినీతి 

మాజీ చైర్మన్‌ అయిన టీడీపీ నేత ఇటీవల అరెస్టు

నిధుల స్వాహాలో ప్రధాన పాత్ర పోషించిన

మరో సంఘం అధ్యక్షుడికి వైసీపీ నేతల అండ

తమ పార్టీలో ఉన్న అతనిపై చర్యలు తీసుకోవద్దని అధికారులపై ఒత్తిడి 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఇద్దరు నాయకులు.. వారు ఒకప్పుడు వేర్వేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌)కు అధ్యక్షులుగా పని చేశారు. ఆ ఇద్దరూ ప్రాతినిథ్యం వహించిన రెండు సొసైటీల్లో అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అఽధికారులు విచారణ చేపట్టి నిజమేనని తేల్చారు. ఒకప్పుడు ఆ ఇద్దరూ తెలుగుదేశంలో ఉన్నవారే. ప్రస్తుతం అందులో ఒకరు అధికార వైసీపీలో ఉండగా, మరొకరు టీడీపీలోనే కొనసాగుతున్నారు. వీరిలో ప్రస్తుతం టీడీపీలో ఉన్న నాయకుడు జైలుకు వెళ్లారు. వైసీపీలో ఉన్న నేత మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పార్టీలో ఉన్న నేతపై ఉన్న కేసును తొక్కిపెడుతున్నారు.  ఇక్కడ అరెస్టయిన టీడీపీ నేత పర్చూరు నియోజకవర్గం కారంచేడు సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ అక్కయ్యచౌదరి. మరొకరు అధికార వైసీపీలో ఉన్న అద్దంకి నియోజకవర్గం జాగర్లమూడివారిపాలెం సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు జాగర్లమూడి యల్లమందరావు. ఈ సంఘటన ఇప్పుడు జిల్లాలోని రాజకీయ నేతలతోపాటు, ఇటు రైతుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

రెండు సొసైటీల్లోనూ గతంలో విచారణలు 

అద్దంకి నియోజకవర్గంలోని జాగర్లమూడివారిపాలెం సొసైటీకి 2013లో అధ్యక్షుడిగా ఎన్నికైన జాగర్లమూడి యల్లమందరావు తొలుత కాంగ్రెస్‌లో ఉన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైకిలెక్కాడు. కారంచేడు సింగిల్‌ విండో అధ్యక్షుడిగా ఉన్న అక్కయ్యచౌదరి 2014 ముందు నుంచి టీడీపీలో ఉన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ కాలంలో ఈ రెండు సొసైటీలలో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. కారంచేడు సొసైటీలో అవినీతి ఆరోపణలపై అప్పట్లో సుధాకరరావు అనే అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌తో విచారణ చేయించారు. జాగర్లమూడివారిపాలెం సొసైటీలో విభిన్న తరహాల్లో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలపై సహకార శాఖ ఉన్నతాధికారులు 51 సెక్షన్‌ కింద విచారణ చేయించారు. ఆరెండు సొసైటీలలో అవినీతి చోటుచేసుకుందన్న విషయాన్ని విచారణ అధికారులు తేల్చారు. అదే సమయంలో అక్కయ్య చౌదరి కారంచేడు సొసైటీ పాలక మండలిలో మెజారిటీ సభ్యుల తీర్మానంతో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆడిటర్‌ ద్వారా మరో విచారణ చేయించారు. ఆ ఆడిటర్‌ కూడా కొన్ని లోపాలను గుర్తించి కిందిస్థాయిలో సహకారశాఖ ఉద్యోగుల పాత్రను లేవనెత్తారు. ఆ ఆడిట్‌ నివేదికకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అక్కయ్య చౌదరి ఫిర్యాదు చేశాడు. జాగర్లమూడివారిపాలెం సొసైటీలో భారీ అవినీతి జరిగినట్లు అధికారుల విచారణలో తేలింది.

ఒక్కోచోట రూ.30లక్షల అవినీతి

రెండు సొసైటీల్లో ఒక్కోచోట రూ.30లక్షల మేర అవినీతి చోటుచేసుకున్నట్లు విచారణాధికారులు తేల్చారు. వివిధ రూపాల్లో నిధులు దారి మళ్లించి స్వాహా చేశారని కారంచేడు సొసైటీ అవినీతిపై అఽధికారులు నివేదికలో పేర్కొన్నారు. అందులో పాలకమండలి చైర్మన్‌, సభ్యులకన్నా అధికారుల పాత్రే ఎక్కువగా ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. పాలక మండలి చేయించిన ఆడిట్‌లో మాత్రం అవినీతిలో పాత్రదారులంతా అధికారులేనని పేర్కొన్నట్లు తెలిసింది. జాగర్లమూడివారిపాలెం సొసైటీలో అధికారుల ప్రమేయం కన్నా సొసైటీ అధ్యక్షుడు,  పాలకమండలి సభ్యుల పాత్ర ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రైతులు బంగారం తాకట్టు పెట్టకుండానే తాకట్టు పెట్టినట్లు రికార్డు సృష్టించి రుణం తీసుకున్నారు. సొసైటీ లాకర్లలో బంగారం లేదు. రికార్డులలో పేర్కొన్న రైతులకు అసలు విషయమే తెలియదు. అలాగే రుణం పొందినట్లు రికార్డులో ఉన్న రైతులు అసలు అప్పు తీసుకోలేదు.  ఇంకోవైపు వడ్డీ మాఫీ డబ్బు చాలా మంది రైతులకు అందలేదు. ఇలా వివిధ రూపాల్లో రూ.30లక్షలకుపైగా నిధులు స్వాహా చేశారని అందుకు అప్పటి చైర్మన్‌ యల్లమందరావు, సభ్యులే బాధ్యులని నివేదిక ఇచ్చారు.  ఏదిఏమైనా రెండు సింగిల్‌ విండోల్లో భారీగా అవినీతి చోటుచేసుకున్నమాట నిజం.

ప్రస్తుత పరిస్థితి ఇదీ.. 

ప్రస్తుతం టీడీపీలో ఉన్న కారంచేడు సొసైటీ అధ్యక్షుడు యార్లగడ్డ అక్కయ్యచౌదరి, అప్పట్లో విచారణ చేపట్టిన ఆడిటర్‌ నాగేశ్వరరావులపై అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నియోజకవర్గ అధికార పార్టీ నేతల ఒత్తిడితో అక్కయ్యచౌదరి, నాగేశ్వరరావును ఈనెల 22న ఆకస్మికంగా అరెస్ట్‌ చేయించారు. వారిపై నాన్‌బెయిల్‌బుల్‌ కేసు నమోదు కావటంతో బెయిల్‌ కూడా రాలేదు.

కదిలిస్తే ఒప్పుకోం వైసీపీ నేతల హెచ్చరిక

సహకారశాఖ అధికారులు మనకెందుకులే అని జాగర్లమూడివారిపాలెం సొసైటీలో అవినీతిని కూడా వెలికితీశారు.  నివేదిక ప్రకారం అయితే యల్లమందరావును కూడా తక్షణం అరెస్ట్‌ చేయాలి. కానీ అఽధికారపార్టీ నాయకులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. యల్లమందరావుకు మద్దతుగా రంగంలోకి దిగారు. సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌ అయిన, వైసీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ వెంకయ్య జోక్యం చేసుకుని యల్లమందరావుకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా సైలెంట్‌ కావాలని సహకారశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. జిల్లా సహకారశాఖ అధికారిని తీవ్రంగా మందలించినట్లు కూడా సమాచారం. దీంతో అక్కయ్యచౌదరిని ఆఘమేఘాల మీద అరెస్టు చేసిన యంత్రాంగం యల్లమందరావు విషయంలో మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. 

Updated Date - 2021-11-30T06:36:12+05:30 IST