Advertisement
Advertisement
Abn logo
Advertisement

తప్పు చేసినా... తప్పించేస్తారా..?

ఏడాది క్రితం టీచర్ల బదిలీలు

జిల్లావ్యాప్తంగా 1040 మంది స్పౌజ్‌.. 

141 మంది ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో దరఖాస్తు..

నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి

11 మందిపైనే వేటు..

మిగతా వారి సంగతేంటి?

కొందరికి ప్రజాప్రతినిధుల సిఫార్సులు

సంఘాల నేతల ఒత్తిళ్లతో మరికొందరికి ఉపశమనమా..?

విచారణ చేయలేక డీఈఓ వదిలేశారా?

అనంతపురం విద్య, డిసెంబరు 2: బదిలీల్లో వందల మంది టీచర్లు దొడ్డదారిలో లబ్ధిపొందారు. అక్రమాలు వెలుగుచూశాయి. విచారణ కూడా మొదలైంది. ఇంతలోనే 11 మందిపై నామమాత్రపు చర్యలు చేపట్టారు. మిగతా వారిని వదిలేశారు. ఆ తర్వాత ఆ ఊసేలేదు. కొందరేమో ప్రజాప్రతినిధుల ఆశీస్సులు.. మరికొందరేమో సంఘాల నేతల ఒత్తిళ్లతో తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు ఆ శాఖలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. 11 మందిపైనే చర్యలు తీసుకుని, మిగతా వారిని ఎందుకు వదిలేసినట్లు? ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? విచారణను ఎందుకు అటకెక్కించినట్లు? తప్పు చేసినా.. తప్పించేస్తారా..? తదితర ప్రశ్నలకు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ)నే సమాధానం చెప్పాలి. సరిగ్గా ఏడాది కిందట టీచర్ల బదిలీలు చేపట్టారు. 1040 మంది స్పౌజ్‌, మరో 141 మంది ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో బదిలీలకు దరఖాస్తు చేశారు. అడ్డగోలుగా స్పౌజ్‌ ఆప్షన్లు ఇచ్చుకుని, లబ్ధిపొందిన వారు వందల్లో ఉన్నారు. 11 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నారు. మిగిలిన వారు.. రాజకీయ నేతలు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకుని తిరుగుతుంటే... డీఈఓ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏడాదికిపైగా చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.


లెక్కలు దాచేస్తూ... అక్రమాలు కప్పేస్తూ..

గతేడాది ఉపాధ్యాయుల బదిలీల్లో భారీగానే స్పౌజ్‌, ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో టీచర్ల నుంచి దరఖాస్తులు వచ్చాయి. స్పౌజ్‌లో గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయలు 21 మంది, ప్రైమరీ ప్రధానోపాధ్యాయులు 15 మంది, స్కూల్‌ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్‌) 103 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో ఇంగ్లీష్‌ 43 మంది, హిందీ 28 మంది, తెలుగు 31 మంది, ఉర్దూ ఒకరు ఉన్నారు. స్కూల్‌ అసిస్టెంట్లు (నాన్‌ లాంగ్వేజె్‌స)లో 259 మంది దరఖాస్తు చేయగా.. బయాలజీ 48, మ్యాథమేటిక్స్‌ 64, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు 5, ఫిజికల్‌ సైన్స్‌ 69, సోషల్‌ స్టడీస్‌ 73 మంది ఉన్నారు. సెకెండరీ గ్రేడ్‌ టీచర్లు 642 మంది కలిపి మొత్తం 1040 మంది బదిలీల్లో స్పౌజ్‌ కేటగిరీ కింద దరఖాస్తు చేశారు. ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో మరో 141 మంది దరఖాస్తు చేశారు. బదిలీల్లో చాలామంది దొడ్దిదారిలో బదిలీలు పొందారు. స్పౌజ్‌, ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో బదిలీ అయిన టీచర్ల వివరాలు కూడా ఇవ్వకుండా విద్యాశాఖాధికారులు లెక్కలు దాచేస్తున్నారు. అక్రమాలు కప్పేస్తున్నారు.


దొడ్డిదారిలో పెద్దఎత్తున లబ్ధి

బదిలీల్లో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపించాయి. స్పౌజ్‌ కేటగిరీలో అడ్డగోలుగా ఆప్షన్లు ఇచ్చుకున్నారు. భార్యాభర్తలు ఉద్యోగులైనా భర్త లేదా భార్య స్పౌజ్‌ వాడుకున్నా... మళ్లీ భార్యలు, భర్తలు బదిలీల సందర్భంగా స్పౌజ్‌ ద్వారా అక్రమంగా లబ్ధిపొందారు. ఇలాంటి వారు జిల్లాలో చాలామందే ఉన్నారు. ఓ ఇద్దరు టీచర్‌ దంపతుల్లో ఒకరు అడ్డదారిలో లబ్ధిపొందారు. ఓ మహిళా టీచర్‌ కూడేరు మండలంలోని ఓ స్కూల్‌కు బదిలీపై వచ్చారు. ఇలా చెప్పుకుంటూ వెళితే... వందల్లో అక్రమార్కులున్నారు. 100 మందికిపైగానే దొడ్డిదారిలో బదిలీల్లో లబ్ధి పొంది 20 శాతం, 14 శాతం, 12.5 హెచ్‌ఆర్‌ఏ స్థానాలకు వచ్చారు.


అక్రమార్కుల కొమ్ము కాస్తున్నారా..?

బదిలీల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్రమార్కుల కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్పౌజ్‌ నిబంధనలు అతిక్రమించిన 13 మందిపై ఇటీవల చర్యలు తీసుకున్నారు. వారిలో కూడా 11 మంది టీచర్లపై ఇంక్రిమెంట్‌ కట్‌ చేయడంతోపాటు రెండేళ్లు ఉద్యోగోన్నతులకు అనర్హులుగా గుర్తిస్తూ... చర్యలు తీసుకున్నారు. ఇవి కూడా కంటి తుడుపుగానే ఉన్నాయన్న అభిప్రాయం విద్యాశాఖ, ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధుల సిపార్సులున్న వారిని వదిలి, సామాన్యులపై మాత్రమే డీఈఓ వేటు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బదిలీ సందర్భంగా స్పౌజ్‌ దుర్వినియోగానికి ప్రయత్నించడంతో భార్య, భర్తను సస్పెండ్‌ చేశారు. వారిపై ఉన్న సస్పెన్షన్‌నెల తిరిగేలోపే ఎత్తేశారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలా చాలామందికి పెద్దల ఆశీస్సులు, అండదండలు ఉండటంతో వారిపై చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. త్వరలో 2021 ఏడాదికి సంబంధించి బదిలీలు చేపడతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది బదిలీల్లో అక్రమాలకు తెరలేపిన వారిపై మరి జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్‌ ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి.

Advertisement
Advertisement