నిధులున్నా..అభివృద్ధి సున్నా!

ABN , First Publish Date - 2022-07-07T09:21:21+05:30 IST

నిధులున్నా..అభివృద్ధి సున్నా!

నిధులున్నా..అభివృద్ధి సున్నా!

అంగన్‌వాడీ, పాఠశాల భవనాల నిర్మాణాలకు మోక్షమెప్పుడు?

గతేడాదే నాబార్డు నిధుల మంజూరు

పనులు ప్రారంభించలేదని లేఖలు

అయినప్పటికీ పట్టించుకోని సర్కార్‌

పనులకు కాంట్రాక్టర్లు విముఖత 

బిల్లులు వస్తాయోరావోననే బెంగ

మురిగిపోయే ప్రమాదంలో 600 కోట్లు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

చేతిలో నిధులు ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలు సహా పాఠశాలల నిర్మాణాలకు మొగ్గు చూపడం లేదు. కేంద్ర ప్రభుత్వం సహా నాబార్డు నుంచి నిధులు వచ్చినా అభివృద్ధి పనులు చేపట్టడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిపోయింది. నవరత్నాలు తప్ప ఇతర అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కనీసం దృష్టి పెట్టడం లేదు. దీంతో అంగన్‌వాడీ, పాఠశాలల భవనాల నిర్మాణాలు ఎక్కడిగొంగళి అక్కడే అన్నచందంగా మారిపోయాయి. నాబార్డు ఆర్‌ఐడీఎఫ్‌-26 కింద అంగన్‌వాడీల భవనాల నిర్మాణాల కోసం రూ.101.98 కోట్లు, నాడు-నేడు కింద పాఠశాలల భవనాల అభివృద్ధి కోసం రూ.554.25 కోట్లు మంజూరు చేసి ఏడాది దాటిపోయింది. అయినప్పటికీ ప్రభుత్వం పనులు చేపట్టలేదు. దీంతో నాబార్డు జనరల్‌ మేనేజర్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖ రాశారు. నాబార్డు ఆర్‌ఐడీఎఫ్‌ నిబంధనల ప్రకారం మంజూరైన 12 నెలల్లోపు పనులు ప్రారంభించకపోతే ప్రాజెక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు. అయినా సర్కారు స్పందించకపోవడం గమనార్హం. ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం చుట్టూ చక్కర్లు కొడుతున్న సర్కార్‌.. నాబార్డు ఇచ్చిన రుణాల్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. అప్పులు పుట్టకపోవడంతో  బ్యాంకుల చుట్టు ప్రదక్షణలు చేయడమే కాకుండా చివరకు ప్రభుత్వ ఆస్తులు, రాజధాని భూములు అమ్మకానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇలాంటి తరుణంలో నాబార్డు ఇచ్చిన రుణాలను ఉపయోగించడంలో అలసత్వం ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. 


ఏడాది దాటినా స్పందనేదీ?

రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లోని 469 మండలాల్లో ఉన్న 1,714 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాల కోసం నాబార్డు ఆర్‌ఐడీఎఫ్‌-26 కింద రూ.101.98 కోట్ల మేరకు రుణాన్ని మంజూరుచేసింది. గత ఏడాది ఏప్రిల్‌ 1న ఈ నిధులు మంజూరయ్యాయి. అయితే, దానికి సంబంధించిన మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కూడా ప్రభుత్వం తీసుకోలేదు. ఈ ప్రాజెక్టు మంజూరైన 12 నెలలలోపు పనులు ప్రారంభించకపోతే మురిగిపోతాయని ఆర్‌ఐడీఎఫ్‌ నిబంధనలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ.. కొంత మేరకు సమయం ఇస్తూ.. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని నాబార్డు చైర్మన్‌ సీఎ్‌సకు లేఖ రాశారు. అదే విధంగా నాడు-నేడు పాఠశాలలకు సంబంధించి 663 మండలాల్లో 9,379 పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ఇప్పటికే 20 శాతం నిధులను మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద మంజూరు చేసినా పనులు ప్రారంభించకపోవడంతో వెంటనే పనులు చేపట్టాలని సూచించారు. 


పనులు చేపట్టకపోతే రద్దు

నాబార్డు ఆర్‌ఐడీఎఫ్‌ ద్వారా రాష్ట్రంలోని అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు, పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టకపోతే ప్రాజెక్టులను రద్దు చేస్తామని నాబార్డు ఇప్పటికే హెచ్చరించింది. నిధులు లేక ఇబ్బందులు పడుతున్న సర్కారు.. ఈ నిధులను ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదనేది ప్రధాన ప్రశ్నగా మారింది. పైగా పాఠశాలల్లో ఇప్పటికే నాడు-నేడు పనులకు సంబంధించి ఒక విడత పనులు చేపట్టారు. రెండో విడత కూడా పనులు మంజూరుచేశారు. గతంలో హెడ్మాస్టర్లు ద్వారా ఈ పనులు నిర్వహించారు. అయితే, కాంట్రాక్టర్లు చవిచూసిన అనుభవాలనే హెడ్మాస్టర్లు చవిచూశారు. సకాలంలో బిల్లులు అందక నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆ పనులు చేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. దీంతో ఈ పనుల నిర్వహణ ప్రభుత్వానికి భారమైంది. 


కాంట్రాక్టర్ల మౌనం

గ్రామాల్లో గతంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఈ పనులు చేపట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు బిల్లులివ్వకుండా నిలిపేయడంతో కోర్టుల్లో కేసులు వేసి బిల్లులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టులకు వెళ్లిన కాంట్రాక్టర్లు చేపట్టిన పనులపై విజిలెన్స్‌ విచారణ చేపట్టి వేధిస్తుండటంతో వైసీపీ ప్రభుత్వంలో పనులు చేపట్టకూడదని కాంట్రాక్టర్లు నిర్ణయించుకున్నారు. ఈ ప్రభుత్వంలో సచివాలయ, అంగన్‌వాడీ భవనాల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులివ్వకపోవడంతో కాం ట్రాక్టర్లు అంగన్‌వాడీ, నాడు-నేడు  పనులు చేపట్టేందుకు ముందు కు రావడం లేదు. దీంతో గ్రామాల్లో ప్రారంభించిన సచివాలయ భవనాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌సెంటర్లు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయి టెండర్లు పిలిచినా ఎవ్వరూ ముందుకు రావడం లేదని ఇంజనీర్లు చెబుతుండడం గమనార్హం.

Updated Date - 2022-07-07T09:21:21+05:30 IST