కోర్టు చెప్పినా కదలరు

ABN , First Publish Date - 2022-07-06T05:30:00+05:30 IST

మొదట బతుకుతెరువు కోసం శ్రీశైలం వచ్చారు

కోర్టు చెప్పినా కదలరు
లలితాంబిక కాంప్లెక్స్‌

  1.  ఎటూ తేలని లలితాంబిక కాంప్లెక్స్‌  కేటాయింపు వ్యవహారం
  2. వేలం వేయాలనే కోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్న వ్యాపారులు
  3. లక్కీ డీప్‌ కావాలని ఒకసారి.. వద్దని మరోసారి
  4. అంతా ఎమ్మెల్యే అండతోనే 

నంద్యాల, ఆంధ్రజ్యోతి:


 మొదట బతుకుతెరువు కోసం శ్రీశైలం వచ్చారు. ఆలయ  ప్రధాన వీధిలో  చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్నారు.   దేవస్థానమే వాళ్లకు కొంత స్థలం కేటాయించింది. ఆ తర్వాత  నెమ్మదిగా ప్రధాన రహదారి మొత్తాన్నీ ఆక్రమించేశారు. పర్వదినాల్లో ఇబ్బందవుతోందని    దుకాణాలను ఖాళీ చేయించడానికి సిద్ధరామప్ప కాంప్లెక్స్‌ను దేవస్థానం నిర్మించింది. వ్యాపారులు అక్కడికి వెళ్లలేదు. ఆ తర్వాత ప్రధాన వీధి వ్యాపారుల కోసమే లలితాంబిక కాంప్లెక్స్‌ను నిర్మించింది. వాళ్లు అక్కడికీ వెళ్లలేదు. చివరికి వ్యవహారం కోర్టుకెళ్లింది.    అయినా వ్యాపారులు ఇక్కడి నుంచి కదలం అని  మొండికేస్తున్నారు. అధికార పార్టీ నాయకుడి అండ ఉండటంతో కోర్టు తీర్పును సహితం దుకాణదారులు లెక్క చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. 

 

శ్రీశైలం దేవస్థానంలో శివరాత్రి, ఉగాది పర్వదినాల్లో  ప్రభోత్సవం, రథోత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు ప్రధాన వీధుల్లో భారీ జన సందోహం మధ్య జరుగుతాయి. అయితే ఈ ప్రధాన వీధుల్లోని దుకాణాల వల్ల ఉత్సవాలకు ఇబ్బందిగా ఉంది.  దీంతో శ్రీశైలం దేవస్థానం మాస్టర్‌ ప్లాన ఒకటి తయారు చేసింది. దీని ప్రకారం ప్రధాన వీధిలో ఉండే దుకాణాలను తొలగించాలి. ఈమేరకు అప్పటి ఈవో భరత గుప్తా వ్యాపారులతో పలుమార్లు చర్చలు జరిపారు. దుకాణదారులు ప్రధాన వీధులను ఖాళీ చేస్తే ప్రత్యామ్నాయంగా వేరేచోట దుకాణాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీనికి వ్యాపారులు కూడా సమ్మతించారు.   2013లో ప్రధాన వీధిలోని వ్యాపారుల కోసం నంది మండపం వద్ద సుమారు రూ.30 కోట్లతో సిద్ధరామప్ప కాంప్లెక్సును నిర్మించారు. ఇందులో జీ ప్లస్‌ 2 ఫ్లోర్లలో దాదాపు 252 దుకాణాలు ఉన్న కాంప్లెక్సును  2016లో పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత వ్యాపారులు సిద్ధరామప్ప కాంప్లెక్సులోకి తరలివెళ్లమని చెప్పడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

ఫ లలితాంబిక కాంప్లెక్స్‌..

సిద్ధరామప్ప కాంప్లెక్స్‌ ప్రధాన వీధికి దూరంగా ఉందని వ్యాపారులు ప్రధాన వీఽధిలో ఉన్న దుకాణాల నుంచి కదలడానికి సిద్ధం కాలేదు.  పైగా రెండు అంతస్తులు ఉండటం వల్ల కింద దుకాణాల్లోనే  వ్యాపారం జరుగుతుందని, పై అంతస్తుల్లో జరగదని  అన్నారు. దీంతో ఆలయానికి సమీపంలో మరో దుకాణ సముదాయాలను కట్టించాలని దేవస్థానం భావించింది. సుమారు 100 మంది వ్యాపారులు 11 ఏళ్ల లీజుకు, నెలకు రూ.3 వేల చొప్పున అగ్రిమెంటు కుదుర్చుకుని సిద్ధరామప్ప కాంప్లెక్స్‌లో  చేరిపోయారు.  ప్రధాన వీధి వ్యాపారుల కోసం   ఆలయానికి దగ్గరలో ఉన్న లలితా బజార్‌ను   తీసివేసి అక్కడ  203 దుకాణాలతో   లలితాంబిక కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఆ తర్వాత లక్కీడీప్‌ ద్వారా దుకాణాలను కేటాయించాలని దేవస్థానం నిర్ణయించింది.

 వరుస కోర్టు కేసులు..

లలితాంబిక కాంప్లెక్స్‌లోని దుకాణాలను లక్కీడీప్‌ ద్వారా కాకుండా బహిరంగ వేలం వేస్తే దేవస్థానానికి ఎక్కువ ఆదాయం వస్తుందని కాశయ్య అనే వ్యక్తి దేవస్థానం నిర్ణయాన్ని సవాలు చేస్తూ హై కోర్టును ఆశ్రయించాడు. బహిరంగ వేలం వేయాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో దేవస్థానం దుకాణాలను వేలం వేసింది. వేలంలో 134 మంది పాల్గొని 42 మంది దుకాణాలను సొంతం చేసుకున్నారు. అయితే ఈ బహిరంగ వేలాన్ని సవాలు చేస్తూ ప్రధాన వీధి వ్యాపారులు హైకోర్టుకెక్కారు. తమ కోసం కట్టిన దుకాణాలను లక్కీడీప్‌ ద్వారా కేటాయించాలని పిటీషన దాఖలు చేశారు. ఇలా దుకాణాల కేటాయింపులకు సంబంధించి కోర్టులో మొత్తం 5 కేసులో నమోదయ్యాయి. ఈ  పిటీషన్లను హైకోర్టు పరిశీలించి 2021 అక్టోబరులో తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం మొదటి ప్రాధాన్యం కింద ప్రధాన వీధి వ్యాపారులకు లక్కీడీప్‌ ద్వారా దుకాణాలు కేటాయించాలని, అలాగే బహిరంగ వేలంలో పాల్గొని 42 దుకాణాలు దక్కించుకున్న వారికి, చెంచులకు 30 దుకాణాల కేటాయించాలని పేర్కొంది. దీంతో దేవస్థాన అంతర్గత కమిటీ, వ్యాపారులతో సమావేశం నిర్వహించింది. దుకాణాలను అనుసరించి ఒక అడుగుకు రూ.126 నుంచి రూ.320గా నిర్ణయించింది. దీనిమీద ఏవైనా అభ్యంతరాలుంటే తెలపాలని కోరింది. ఆ చర్చల అనంతరం గత నెల 27న దుకాణాలను బహిరంగ వేలం వేయడానికి కమిటీ నిర్ణయంచుకుంది.

ఫ రూ.55 కోట్లు నష్టం..

హైకోర్టు తీర్పుతో ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న దుకాణాల బహిరంగ వేలం ఒక కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు. అయితే వ్యాపారులు మళ్లీ సమస్యను మొదటికి తీసుకువచ్చారు. లక్కీడీప్‌ ద్వారా తమకు దుకాణాలు ఏ మూలకు వస్తాయో తెలియదని, దానివల్ల తమకు వ్యాపారం జరగకపోతే నష్టపోతామన్న కొత్త వాదనను కమిటీ ముందుకు తీసుకువచ్చారు. పైగా గతంలో నిర్వహించిన వేలంలో పాల్గొన్న వారికి కేటాయించిన దుకాణాలపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.  వీటికితోడు దుకాణాలకు కమిటీ నిర్ణయించిన ధర చాలా ఎక్కువగా ఉందనే వాదనను కూడా లేవనెత్తారు. గతంలో లక్కీడీప్‌ కావాలన్నిదీ వ్యాపారులే, ఇపుడు వద్దంటున్నదీ వారే.  దీంతో పరిస్థితి పూర్తి జటిలంగా మారింది. అయితే  దుకాణాల ధర నిర్ణయించుకునే అధికారం దేవస్థానానికే ఉంటుందని కోర్టు చెప్పింది. దీనిని కూడా వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. తాము చెప్పినట్లుగా దుకాణాల ధర ఉండాలని, అలాగే అగ్రిమెంటు మూడేళ్లకు కాకుండా 11 ఏళ్ల పాటు ఉండాలని, అలా అయితేనే లలితాంబి కాంప్లెక్సుకు వెళ్తామని మొండికేస్తున్నారు. ఇలా ఏళ్లుగా దుకాణాల వేలం వేయకుండా అడ్డుకుంటుండటం వల్ల దాదాపు రూ.55 కోట్ల నష్టం వస్తోందని శ్రీశైల దేవస్థానమే పేర్కొనడం విశేషం.

రాజకీయ అండ..

ఉపాధి లేని వారికి అసరాగా ఉంటుందని ప్రధాన వీధిలో దుకాణాలను అద్దెకిస్తే వచ్చిన వారంతా ఇపుడు ఏకు మేకై కూర్చున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దుకాణదారులకు   రాజకీయ అండతోనే ఇంత బలం వచ్చిందనే పరిశీలన కూడా ఉంది. గత నెల 27న జరగాల్సిన బహిరంగ వేలాన్ని  ప్రధాన వీధిలోని  153 మంది వ్యాపారులు  ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని కలిసి   ఆపాలంటూ కోరారు. ఆయన వెంటనే దేవస్థానం చైర్మన, ఈవో, దేవదాయ శాఖ మంత్రి, కమిషనర్‌తో మాట్లాడి వేలాన్ని నిలిపివేశారు. ఇదే విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ పేజీలో కూడా షేర్‌ చేసుకున్నారు. వ్యాపారులు కోరినట్లు కాంప్లెక్సులు కట్టడం, వారు వద్దనగానే మరో కాంప్లెక్సు కట్టడం, అది పూర్తైన తర్వాత మళ్లీ వద్దనడం వ్యాపారులకు పరిపాటి అయింది. ఇదంతా ప్రధాన వీధిని ఖాళీ చేయడం ఇష్టం లేకనే అని అర్థమవుతుంది. వ్యాపారులకు ఇలా రాజకీయ అండ ఉన్నంత కాలం లలితాంబిక కాంప్లెక్స బహిరంగ వేలం కలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 మరి వారి సంగతేమిటి..

కోర్టు తీర్పు తమకు అనుకూలంగా లేదని ప్రధాన వీధి వ్యాపారులు లలిలాంబిక కాంప్లెక్స్‌లోనికి వెళ్లడానికి వ్యతిరేకిస్తున్నారు. అయితే వీరి మొండితనం మిగతా వారికి శాపంగా మారింది. గతంలో బహిరంగ వేలంలో పాల్గొని దుకాణాలను దక్కించుకున్న 42 మంది పరిస్థితి ఏమిటి?   వ్యాపార రంగంలోకి వచ్చిన కొద్దిమంది  చెంచులకు ఇది ఆటంకంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్ని రకాలుగా నష్టం ఉన్నప్పటికీ  ఎమ్మెల్యే వ్యాపారులకు మద్దతు ఇవ్వడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-07-06T05:30:00+05:30 IST