తయారు చేసినా.. స్టాక్‌ చేసినా లక్ష ఫైన్‌

ABN , First Publish Date - 2022-07-07T08:37:07+05:30 IST

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను తయారు చేసినా, నిల్వ ఉంచినా రూ.లక్ష జరిమానా విధించేలా రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తయారు చేసినా.. స్టాక్‌ చేసినా లక్ష ఫైన్‌

  • సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై రాష్ట్ర సర్కార్‌ రూల్స్‌
  • రవాణా చేస్తూ పట్టుబడితే వాహనం సీజ్‌
  • వాడితే వినియోగదారులకు రూ.500 ఫైన్‌


హైదరాబాద్‌ సిటీ, జూలై 6(ఆంధ్రజ్యోతి): సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను తయారు చేసినా, నిల్వ ఉంచినా రూ.లక్ష జరిమానా విధించేలా రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్‌పై నిషేధం సరిగా అమలయ్యేలా సీఎస్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, మున్సిపాలిటీ రీజనల్‌ డైరెక్టర్‌లతో కమిటీని రూపొందించింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం, జిల్లా  నుంచి గ్రామ స్థాయి వరకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలకు కార్యచరణను రూపొందించింది. జూలై 1 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 


తయారీదారులకు నిబంధనలు

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ తయారు చేస్తూ పట్టుబడితే రూ.లక్ష జరిమానా విధిస్తారు. నిబంఽధనలకు అనుగుణంగా తయారు చేసినా.. క్యారీ బ్యాగులపై రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ వేయకుంటే రూ.50 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి పట్టుబడితే రూ.2 లక్షల జరిమనాతో పాటు లైసెన్స్‌ రద్దు చేస్తారు. పరిశ్రమను సీజ్‌ చేస్తారు. 


హోల్‌సేల్‌ డీలర్లు, స్టాకిస్టులకు రూల్స్‌

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ రవాణా చేసినా, స్టాక్‌ చేసినా, మొదటిసారి పట్టుబడితే రూ.లక్ష జరిమానా, రెండోసారి పట్టుబడితే రూ.2 లక్షల జరిమానాతో పాటు ట్రేడ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తారు. వాహనాలను సీజ్‌ చేస్తారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌(75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న)తో పట్టుడిన వినియోగదారుడికి రూ.500 జరిమానా విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో, చెరువులు, కాల్వలు, నాలాల్లో ప్లాసిక్‌ వస్తువులు పారవేసినా/కాల్చినా రూ.5 వేలు ఫైన్‌. డంపింగ్‌ యార్డుల్లో నిప్పు పెడితే రూ.25 వేల జరిమానా విధిస్తారు. 


నిషేధిత వస్తువులు

ఇయర్‌ బడ్స్‌, ప్లాస్టిక్‌ స్టిక్స్‌, బెలూన్లు, ప్లాస్టిక్‌ జెండాలు, క్యాండీ స్టిక్స్‌, ఐస్‌క్రీం పుల్లలు, డెకొరేషన్‌లో ఉపయోగించే ఽథర్మకోల్‌, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, ప్లాస్టిక్‌ కత్తులు, స్ట్రా, ట్రే, 100 మైక్రాన్లలోపు ఉన్న పీవీసీ, ప్లాస్టిక్‌ బ్యానర్లు, స్టిర్రర్లు.

Updated Date - 2022-07-07T08:37:07+05:30 IST