కష్టపడైనా భరణం కట్టాల్సిందే

ABN , First Publish Date - 2022-10-07T09:00:45+05:30 IST

ఆదాయం లేకపోతే, కష్టపడి పని చేసైనా భార్యా బిడ్డలకు భరణం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

కష్టపడైనా భరణం కట్టాల్సిందే

ఆదాయం లేదని ఎగవేయడానికి వీల్లేదు

భరణం.. భర్తకు కోర్టు వేసే శిక్ష కాదు

అది భార్య పట్ల భర్త పవిత్ర బాధ్యత

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాధితురాలి 12 ఏళ్ల పోరుకు న్యాయం


న్యూఢిల్లీ, అక్టోబరు 6 : ఆదాయం లేకపోతే,  కష్టపడి పని చేసైనా భార్యా బిడ్డలకు భరణం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. వ్యాపారాలు దెబ్బతిని, సంపాదన లేని కారణంగా తన మాజీ భార్య, పిల్లలకు భరణం చెల్లించలేనన్న భర్త వాదనను న్యాయమూర్తులు జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ బేలా.ఎమ్‌.త్రివేణీలతో కూడిన బెంచ్‌ కొట్టివేసింది. ప్రతి నెలా భార్యకు రూ. 10 వేలు, బాబుకు రూ.6 వేలు చొప్పున చెల్లించాలని ఆదేశించింది. ‘‘భరణం భర్తకు విధించిన శిక్షగా భావించరాదు. భర్తకి దూరమైన మహిళ దారిద్య్రం, అస్తవ్యస్త పరిస్థితుల్లో చిక్కుబడకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు. భరణం ద్వారా ఆహారం, దుస్తులు, గూడు దొరికి.. ఆమెకు, పిల్లలకు త్వరగా స్వాంతన దొరకాలనేది ముఖ్య ఉద్దేశం’’ అని వివరించింది. ఈ కేసులో భర్త శారీరకంగా దృఢంగానే ఉన్నాడని, అతడికి ఆదాయం కూడా బాగానే ఉందని, భార్యాబిడ్డను పోషించగల స్థితిలోనే ఉన్నాడని బాధితురాలు తెలిపిన వివరాలను బట్టి తెలుస్తోందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, కేవలం నిర్లక్ష్యం కారణంగానే అతడు భరణం చెల్లించడం లేదని నిర్ధారణకు వచ్చామని తెలిపారు.  తనకు భరణం ఇప్పించాలని గత 12 ఏళ్లుగా బాధితురాలు న్యాయపోరాటం చేస్తున్నారు. 

Updated Date - 2022-10-07T09:00:45+05:30 IST