ఈ వయసులోనూ... ఆశావాదినే

ABN , First Publish Date - 2022-08-03T05:30:00+05:30 IST

తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రియనేస్తం తొంభై ఏళ్ల తుమ్మల కృష్ణాబాయి. స్నేహమనే పదానికి ఆమె ఒక పర్యాయపదం. విప్లవరచయితల సంఘం ప్రస్థానంలోనూ కృష్ణాబాయిది సుదీర్ఘమైన ప్రయాణం.

ఈ వయసులోనూ... ఆశావాదినే

తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రియనేస్తం తొంభై ఏళ్ల తుమ్మల కృష్ణాబాయి. స్నేహమనే పదానికి ఆమె ఒక పర్యాయపదం. విప్లవరచయితల సంఘం ప్రస్థానంలోనూ కృష్ణాబాయిది సుదీర్ఘమైన ప్రయాణం. మహాకవి శ్రీశ్రీ, ప్రజాకవి కాళోజీ, రావిశాస్త్రి తదితర సాహితీ దిగ్గజాలతో తనకున్న ఆత్మీయానుబంధం తాలూకూ జ్ఞాపకాలను, కలం స్నేహాలను, ప్రజా ఉద్యమ స్మృతులను కృష్ణాబాయి ‘నవ్య’తో పంచుకున్నారు. 



‘‘మానవ జీవితం సాటి మనుషుల సావాసం మినహా మరొకటి కాదు’’ అన్న రావిశాస్త్రి మాటలంటే నాకిష్టం. స్నేహమనే చెట్టుకి పూచే పువ్వులే మానవ సంబంధాలు. అలా చూస్తే, నా జీవితమంతా స్నేహ పరిమళాల సుగంధమే. గోరాశాస్త్రి ‘తెలుగు స్వతంత్ర’లో నిర్వహించిన ‘స్నేహలత’ శీర్షిక ద్వారా పరిచయమైన హేమ అనే అమ్మాయి తర్వాత కాలంలో నాకు ప్రాణ మిత్రురాలైంది. ఆపై మా బిడ్డలను తన బిడ్డలుగా పెంచేంత ఆప్తులమయ్యాం. పత్రికల్లో వచ్చే కథో, వ్యాసమో నచ్చితే... ఆ రచయితకు ఉత్తరం రాయడం నాకు అలవాటు. అలాగే సినిమా సమీక్షలూ రాస్తుండేదాన్ని. ‘బంగారు పాప’ తీసిన చేత్తో ‘రాజమకుటం’ తీయడమేంటని ప్రముఖ దర్శకుడు బీఎన్‌ రెడ్డిని విమర్శిస్తూ ఉత్తరం రాశాను. ‘నాకూ మీ వంటి స్నేహితులుంటే అంతకన్నా మంచి సినిమా తీసేవాడినేమో’ అని ఆయన బదులిచ్చారు. అక్కడితో బీఎన్‌ రెడ్డి నాకు బాబాయి అయ్యారు. ఆ దంపతులు నాలో వాళ్ల కూతుర్ని చూసుకునేవారు. బండి గోపాలరెడి ్డ(బంగోరె) ద్వారా ప్రజాకవి కాళోజీ, ‘సంక్రాంతి ముచ్చట్లు’ ద్వారా గొర్రెపాటి వెంకటసుబ్బయ్య పరిచయమయ్యారు.


కాళోజీని చిన్నాన్న, వెంకటసుబ్బయ్యను నాన్న అని పిలిచేదాన్ని. ఎమర్జెన్సీ సమయంలో నా భర్త తుమ్మల వేణుగోపాలరావు జైల్లో ఉన్నప్పుడు వాళ్లిద్దరూ నాకు అండగా వైజాగ్‌లోని మా ఇంట్లో కొన్నాళ్లు ఉన్నారు. మహాకవి శ్రీశ్రీ విశాఖ వచ్చినప్పుడల్లా మా ఇంటికి రాకుండా వెళ్లరు. ‘అనంతం’లో ఆయన రాసిన కొన్ని అభ్యంతరకర విషయాలను విభేదిస్తూ, ‘అవి మాకు అవసరమా’ అని ఉత్తరం ద్వారా నిలదీశాను. దానిమీద ఆయన స్పందిస్తూ, ‘నేను మిక్కిలిగా గౌరవించే కృష్ణాబాయిగారు కూడా తప్పుకదా అన్నారు’ అని మరొక లేఖలో ప్రస్తావించారు. ఇలా ఒకరా, ఇద్దరా... సంజీవ్‌దేవ్‌ నన్ను ‘సోదరీ’ అని సంబోధిస్తూ ఉత్తరాలు రాసేవారు. ఆ లేఖల్లో ఆయన ప్రత్యేకంగా గీసిన బొమ్మలంటే మా పిల్లలకు చాలా ఇష్టం. కాజీపేటలో పరిచయమైన చలసాని ప్రసాద్‌ కుటుంబం, మేమూ ఒకే ఇంట్లో సుమారు నలభై ఏళ్లు కలిసున్నాం. ఇలా మావన్నీ భావజాల సారూప్యత పునాదిగా నిర్మితమైన స్నేహాలు.! కనుకే అవి కలకాలం పదిలమయ్యాయి. 


సైకిల్‌తొక్కడం ఒక సాహసం...

మా సొంతూరు కృష్ణాజిల్లా ఘంటసాల పాలెం. మా నాన్న వేమూరి వెంకయ్య కాంగ్రెస్‌ వాది. మా అమ్మ లక్ష్మీకాంతమ్మ కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరురాలు. ఎన్నికల నాడు ఇద్దరూ కలిసి ఒకే ఎడ్లబండిమీద వెళ్లి చేరొక పార్టీకి ఓటేసొచ్చేవాళ్లు. మా బాబాయి (అమ్మ చెల్లి భర్త) రామినేని పిచ్చియ్య ద్వారా నాకు చిన్నతనంలోనే కమ్యూనిస్టు పార్టీ పరిచయమైంది. విజయవాడలోని ప్రజాశక్తినగర్‌లో బాబాయి ఇంట ఉంటూ, బిషప్‌ అజరయ్య స్కూల్లో రెండవ ఫారం (ఏడవ తరగతి) చేరాను. అక్కడే రైతు సంఘం నాయకుడైన మా బాబాయితో పాటు చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, కంఠమనేని చలపతిరావు తదితరులంతా ఉండేవారు. ఇదంతా 1945ల నాటి సంగతి... ఆడపిల్ల సైకిల్‌ తొక్కుకుంటూ స్కూలుకెళ్లడం... ఆ రోజుల్లో అదొక పెద్ద సాహసం.


అలా ఒకరోజు సైకిల్‌మీద స్కూలుకి వెళుతున్న నన్ను సీతారామ భక్త సమాజానికి చెందిన కొందరు కుర్రాళ్లు అడ్డగించారు. దాంతో గిర్రున వెనక్కి తిరిగి, పార్టీ ఆఫీసుకెళ్లి జరిగిన సంగతి చెప్పాను. అప్పటికప్పుడు చండ్ర రాజేశ్వరరావు వచ్చి, ఆకతాయిలను బాదడంతో పాటు చెడామడా తిట్టారు కూడా. అది మొదలు, మరెప్పుడూ వాళ్లు మా జోలికి రాలేదు. నేనూ విద్యార్థి సంఘంలో ఉంటూ కొన్ని కార్యక్రమాల్లో ‘మా కొద్దీ తెల్లదొరతనం..’ వంటి దేశభక్తి గీతాలు పాడేదాన్ని. కమ్యూనిస్టు పార్టీ ప్రభావంతో ప్రగతిశీల భావాలు విరాజిల్లిన విజయవాడ... తర్వాత కాలంలో ముఠాలకు, రౌడీయిజానికి నెలవు కావడం బాధాకరం.

 

స్కూలు గోడమీద వెకిలిరాతలు...

ఘంటసాలలో హైస్కూలు ప్రారంభం కావడంతో తొమ్మిదో తరగతికి నేను మా సొంతూరికెళ్లాను. పదోతరగతిలో ఉండగా మా మేనత్త కొడుకు తుమ్మల వేణుగోపాలరావుతో నాకు పెళ్లి అయింది. అప్పుడు ఆయన కాకినాడ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీఈ చదువుతున్నారు. ప్రజాశక్తినగర్‌ ప్రభావంతో అబ్బాయిలు, అమ్మాయిలనే తేడా లేకుండా నేను అందరితో కలివిడిగా మెలిగేదాన్ని. అలా ఒకసారి నేను స్నేహంగా ఉండే అబ్బాయి పేరు, నా పేరు కలిపి దురుద్దేశాన్ని ఆపాదిస్తూ, స్కూలు గోడ మీద కొందరు ఆకతాయిలు రాశారు. ఆ సమయంలో మా ప్రధానోపాధ్యాయుడు రంగాచారి సపోర్టుగా నిలిచారు. ఇలా జరిగిందని, వేణుకి ఉత్తరం రాస్తే, ‘బాధపడకు. స్త్రీ, పురుషుల మధ్య స్నేహాన్ని అర్థం చేసుకునే స్థాయికి మన సమాజం ఎదగలేదు’ అని నన్ను ఓదార్చారు. 



రావిశాస్త్రి ఔన్నత్యం...

విశాఖ రచయితల సంఘం, ఆ తర్వాత విరసం ద్వారా మా కుటుంబానికి రావిశాస్త్రి అత్యంత ఆత్మీయులయ్యారు. ఆయన రాసిన కథలు, నవలలను పత్రికలకు పంపేముందు, వేణుకి చదివి వినిపించేవారు. ఓ సందర్భంలో రావిశాస్త్రి వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తూ, రంగనాయకమ్మ వ్యాసం రాసింది. తర్వాత ఆమెకు కుటుంబ సమస్య ఎదురైనప్పుడు రావిశాస్త్రి మద్దతుగా నిలిచారు. ఆయన మాట సహాయం వల్లే రంగనాయకమ్మ పదినెలలు వైజాగ్‌లోని మా ఇంట్లో ఉన్నారు. అదీ రావిశాస్త్రి ఔన్నత్యం. 


విరసంతో నేను...

వేణు ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్లినప్పుడు, అంటే, 1960లలో... పిల్లలతో పాటు నేను కాజీపేటలో కొన్నాళ్లున్నాను. అక్కడే సెయింట్‌ గాబ్రియల్‌ స్కూల్లో కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి టీచర్లుగా పనిచేసేవాళ్లు. ఆ పక్కనే బాలికల పాఠశాలలో ద్రోణవల్లి  అనసూయమ్మ ఉపాధ్యాయురాలు. మా ఇద్దరమ్మాయిలు నళిని, పద్మినీ అక్కడే చదివేవాళ్లు. అప్పుడు ఆ వ్యక్తుల పరిచయం నా సామాజిక బాధ్యతను గుర్తుచేసింది. నాలోనూ రాజకీయ దృక్పథం పట్ల స్పష్టమైన వైఖరి ఏర్పడింది. శ్రీకాకుళ నగ్జల్బరీ పోరాటం... తదితర ఘటనలు విప్లవోద్యమం పట్ల ప్రేమను, ప్రేరణను కలిగించాయి.


అదే సమయంలో అమెరికాలో నా భర్త ‘ఫూల్స్‌గేమ్‌’ పుస్తకం చదివి స్ఫూర్తి పొందారు. ఆ విషయాలను ఇద్దరం ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా చర్చిస్తుండేవాళ్లం. తర్వాత 1970లో విప్లవరచయితల సంఘం మొదటి సభ్యురాలిగా ఖమ్మం ప్రథమ మహాసభలో పాల్గొన్నాను. ఆ వేదిక ద్వారా కేవీఆర్‌, చెరబండరాజు, జ్వాలాముఖి, వరవరరావు తదితరులంతా ఆప్తమిత్రులయ్యారు. విరసం కార్యదర్శిగా 2004 నుంచి 2006 వరకు ఉన్నాను. అరుణతార సంపాదక బాధ్యతలనూ ఏడేళ్లు నిర్వహించాను. 


ఆశావాదిని...

నా భర్త, చిన్నకూతురు దూరమయ్యాక, హైదరాబాద్‌లోని మా పెద్దమ్మాయి డా.నళినీ వద్ద ఉంటున్నాను. కానీ నా మనసంతా విశాఖ మీదే. కాలంతోపాటు మనమూ ప్రయాణించాలి. కనుక ఇప్పుడు ఉత్తరాలకు బదులు, ఫోన్‌ద్వారా యువ రచయితలకు నా అభిప్రాయాలను, అభినందనలను తెలియజేస్తున్నాను. సమాజాన్ని జాగృతం చేసే మంచి రచనలు వస్తున్నాయి. ఒక్క మన దేశంలోనేకాదు, ఇప్పుడు ప్రపంచమంతటా గడ్డు పరిస్థితులే. నియంతృత్వం రాజ్యమేలుతోంది. నన్ను నోరారా ప్రేమగా ‘కృష్ణక్క’ అని పిలిచే వరవరరావు మీద అక్రమ కేసులు పెట్టారు. ప్రొఫెసర్‌ సాయిబాబాను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి, కన్నతల్లిని కడసారి చూసే అవకాశం లేకుండా చేశారు. ఈ నిర్బంధాలను తలుచుకుంటే బాధేస్తుంది. అయినా, ఈ వయసులోనూ నేను ఆశావాదిని. ఇప్పుడు నా వయసు 90ఏళ్లు. అంతమాత్రాన నేనేమీ చేయలేకపోతున్నానని బాధపడుతూ కూర్చోలేను. నా కాలు, చేయి ఆడుతున్నంత కాలం రాజ్యహింసను నిరసిస్తూనే ఉంటాను. ప్రజా సంఘాల సభలు, సాహిత్య సమావేశాల్లో పాల్గొంటాను. ప్రజా ఉద్యమాలకు నావంతు మద్దతు ప్రకటిస్తాను. 




నావల్ల ఆయన జైలుకి...

నా భర్త ఒక ఛాందసవాద కుటుంబంలో పుట్టి, పెరిగాడు. అంటే, మా అత్త వాళ్లు మలయాళ స్వామి భక్తులు. దాంతో మడి, ఆచారాలు పాటించేవాళ్లు. అయినా, వేణు ప్రజాస్వామిక దృక్పథాన్ని అలవర్చుకున్నారు. నేను విరసం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. దాంతో ఎమర్జెన్సీ సమయంలో నాకు బదులుగా, వేణుని పోలీసులు అరెస్టు చేశారు. ‘అదేంటి, భార్యకు రాజకీయ అభిప్రాయాలుండకూడదా. మీకు అభ్యంతరం ఉంటే నన్ను కదా అరెస్టు చేయాల్సింది’ అని పోలీసులతో దెబ్బలాడాను. అయినా, లాభం లేకపోయింది. నావల్ల ఆయన ఐదు నెలలు జైల్లో ఉన్నారు. అయినా, తానెప్పుడూ అలా అనుకోలేదు. పైగా ప్రతి సందర్భంలో నాకు తోడుగా నిలిచారు.



నా క్రాప్‌ కథ

నా చిన్నతనంలో మా ఊరికొక సర్కస్‌ కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ మేనేజర్‌ కూతురు బాబ్‌ ్డహెయిర్‌ స్టైల్‌తో గుర్రంమీద వెళుతుంటే, మా నాన్న చూసి ముచ్చట పడి, నాకూ అలా జుత్తు కత్తిరించారు. పెళ్లి అయ్యాక అదే స్టైల్‌లో నా భర్తే నాకు రెగ్యులర్‌గా క్రాప్‌ చేసేవారు.


కె. వెంకటేశ్‌



Updated Date - 2022-08-03T05:30:00+05:30 IST