కాలుష్య నియంత్రణకు ఈ-వాహనాలు

ABN , First Publish Date - 2022-07-07T06:42:53+05:30 IST

నగరంలో కాలుష్య నియంత్రణపై జీవీఎంసీ దృష్టిసారించింది. ఇప్పటికే ప్రతి సోమవారం ప్రధాన కార్యాలయాన్ని ఫ్రీ వెహికల్‌ జోన్‌గా ప్రకటించింది.

కాలుష్య నియంత్రణకు ఈ-వాహనాలు

జీవీఎంసీ నిర్ణయం

15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1.8 కోట్లు కేటాయింపు

కొనుగోలు బాధ్యత నెడ్‌క్యాప్‌కు అప్పగింత


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో కాలుష్య నియంత్రణపై జీవీఎంసీ దృష్టిసారించింది. ఇప్పటికే ప్రతి సోమవారం ప్రధాన కార్యాలయాన్ని ఫ్రీ వెహికల్‌ జోన్‌గా ప్రకటించింది. తాజాగా రూ.1.8 కోట్లతో ఈ-బైక్‌లు, ఈ-రిక్షాలు, సోలార్‌ రూఫ్‌టాప్‌లు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. వీటి కొనుగోలు బాధ్యతను నెడ్‌క్యాప్‌కు అప్పగించింది.

వాహన కాలుష్యం నివారణ చర్యల్లో భాగంగా ప్రతి సోమవారం జీవీఎంసీ కార్యాలయాన్ని ఫ్రీ-వెహికల్‌ జోన్‌గా అధికారులు ప్రకటించారు. సోమవారం జీవీఎంసీ అఽధికారులు, సిబ్బంది వ్యక్తిగత వాహనాలపై కాకుండా ప్రజా రవాణా వాహనాలపైనే విధులకు హాజరవ్వాలని మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, కమిషనర్‌ లక్ష్మీషా ఆదేశించిన విషయం తెలిసిందే. జీవీఎంసీకి చెందిన 415 వాహనాలను సోమవారం బయటకు తీయకుండా ఆపేయడంతో 1,400 లీటర్ల డీజిల్‌ ఆదా అయినట్టయింది. అయితే మేయర్‌, కమిషనర్‌ మినహా మిగిలిన అధికారులంతా సోమవారం తమ సొంత కార్లలో విధులకు హాజరవ్వడం ఆశ్చర్యం కలిగించింది. వారంతా తమ వాహనాలను జీవీఎంసీ కార్యాలయం గేటు బయట నిలిపి...లోపలకు నడుచుకుంటూ వెళ్లారు. ఇదిలావుండగా నగరంలో ప్రజలు కూడా వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గిస్తే కాలుష్య సమస్య మరింతగా తగ్గుతుందని భావించిన జీవీఎంసీ అధికారులు ఈ-వాహనాలను సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.1.8 కోట్లను వెచ్చించాలని నిర్ణయించారు. 32 ఈ-రిక్షాలు, 41 ఈ-బైక్‌లతోపాటు ప్రభుత్వ భవనాల పైకప్పులపై 1,700 చదరపు మీటర్లు వరకూ సోలార్‌ ప్యానళ్లను అమర్చాలని ప్రతిపాదనలు తయారుచేశారు. వీటి కొనుగోలు బాధ్యతను స్వీకరించాలని నెడ్‌క్యాప్‌కు విజ్ఞప్తి చేశారు. కొత్తగా సమకూర్చుకునే ఈ-బైక్‌లను పర్యాటకులు, సందర్శకులు ఎక్కువగా వుండే బీచ్‌రోడ్డు, కైలాసగిరి వంటి ప్రాంతాల్లో అందుబాటులో వుంచాలని జీవీఎంసీ అధికారులు యోచిస్తున్నారు. వాహనాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి వినియోగంపై నిర్ణయం తీసుకుంటామని జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-07-07T06:42:53+05:30 IST