టీచర్లకు ‘స్పాట్‌’ కష్టాలు! ఒక్కో పేపర్‌కు కేవలం రూ.6.60 పైసలు

ABN , First Publish Date - 2022-05-17T16:53:51+05:30 IST

పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం(స్పాట్‌)లో ఉపాధ్యాయులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో ఆర్థిక పరమైన అంశాలు కొన్నికాగా.. సౌకర్యాల కల్పన అంశాలు మరికొన్ని ఉన్నాయి. స్పాట్‌ మూల్యాంకనానికి వెళ్లిన...

టీచర్లకు ‘స్పాట్‌’ కష్టాలు! ఒక్కో పేపర్‌కు కేవలం రూ.6.60 పైసలు

గతంలో 50కి.. ఇప్పుడు 100 మార్కులకు 

అయినా, ఉపాధ్యాయులకు ఇచ్చేది అంతే

తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని గగ్గోలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం(Evaluation of tenth class examination papers)(స్పాట్‌)లో ఉపాధ్యాయులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో ఆర్థిక పరమైన అంశాలు కొన్నికాగా.. సౌకర్యాల కల్పన అంశాలు మరికొన్ని ఉన్నాయి. స్పాట్‌ మూల్యాంకనానికి వెళ్లిన ఉపాధ్యాయుల(Teachers)కు ఒక్కో పేపర్‌ దిద్దినందుకు రూ.6.60 పైసలు ఇస్తారు. కొన్నేళ్లుగా గౌరవ వేతనం ఇలానే ఉంది. అయితే, ఇప్పుడు దిద్దాల్సిన పేపర్‌ సైజు, సమాధానాలు మాత్రం రెట్టింపు అయ్యాయి.


గతంలో 50 మార్కులకే ప్రశ్నపత్రం ఉండేది. ఒక్క హిందీ పరీక్షకు తప్ప మిగతా 10 పేపర్లు 50 మార్కులకే ఉండేవి. వాటికే విద్యార్థులు సమాధానాలు రాసేవారు. వాటిని ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసేవారు. 50 మార్కులకే కాబట్టి తొందరగా మూల్యాంకనం పూర్తయ్యేది. కానీ, ఇప్పుడు 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు. ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌  మినహా మిగతా పేపర్లన్నీ వంద మార్కులకే పెట్టారు. అంటే దిద్దాల్సిన సమాధానాలు పెరిగాయి. మార్కులు రెట్టింపు అయ్యాయి. అయినా, ఒక్కో పేపర్‌ దిద్దినందుకు ఇచ్చే మొత్తం మాత్రం రూ.6.60 పైసలుగానే ఉంది. పరీక్షల సంఖ్య కూడా గతంలో 11 పేపర్లు ఉండగా.. ఇప్పుడు ఏడు పేపర్లకు తగ్గించారు. ఒక్కో సబ్జెక్టు 50 మార్కులకు పెట్టడం వల్ల పేపర్‌-1, పేపర్‌-2అని కొన్ని సబ్జెక్టులకు పెట్టేవారు. అయితే, ఇప్పుడు సైన్స్‌కు తప్ప మిగతా సబ్జెక్టులకు ఒకే పేపర్‌గా వంద మార్కులకు నిర్వహిస్తున్నారు. అంటే మూల్యాంకనం చేయాల్సిన పేపర్లు కూడా తగ్గాయి. ఆ మేరకు ప్రభుత్వానికి కూడా చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది. కానీ, వంద మార్కులకు పరీక్ష పెట్టడం వల్ల మూల్యాంకనం చేసేవారిపై మాత్రం భారం పడింది. అక్కడ తగ్గిన మొత్తాన్ని అయినా ఇక్కడ పెంచాలనే డిమాండ్‌ గట్టిగా ఉంది. వాస్తవానికి పరీక్షల కోసం విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులతోనే మూల్యాంకనానికి చెల్లిస్తారు. ఇలా వసూలు చేసిన ఫీజుల నుంచి గతంలో ఒక విద్యార్థికి పరీక్షల నిర్వహణ కోసం కేవలం రూ.5 మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా.. దీన్ని గత ప్రభుత్వ హయాంలో రూ.8కి పెంచారు. పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు, ఇన్విజిలేటర్ల టీఏ, డీఏల కోసం ఈ మొత్తాన్ని పెంచారు. పెరిగిన ధరలు, ఖర్చులతో చూస్తే ఈ మూడేళ్లలో దీన్ని మరింత పెంచాలి. అంతేకాకుండా స్పాట్‌ వాల్యూయేషన్‌కు ఇచ్చే గౌరవ వేతనాలు కూడా పెంచాల్సి ఉంటుంది. 


మినహాయింపు ఇవ్వండి ప్లీజ్‌!

మూల్యాంకనం కోసం కేటాయించిన కేంద్రాల్లో సౌకర్యాల సమస్యలు కూడా ఉన్నాయి. ఒకపక్క ఎండలు మండిపోతున్నా.. కొన్ని కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేవు. మధ్యాహ్న భోజనం చెట్లకింద, అరుగుల మీద తినే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఒక హాల్‌నైనా ఏర్పాటుచేయాలని ఉపాధ్యాయులు డి మాండ్‌ చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో ఏర్పాట్లు బాగానే ఉన్నా.. కొన్ని కేంద్రాల్లో మాత్రం ఇబ్బందులున్నాయి. ఇబ్బందులు, ఉక్కపోతతో పరీక్ష పత్రాలు దిద్దేవారు.. ఒక్కోసారి ఆ చిరాకును ప్రశ్నపత్రంపై చూపిస్తే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మరోవైపు 8 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి స్పాట్‌ మూల్యాంకనం కోసం వచ్చే స్పెషల్‌ అసిస్టెంట్లకు ప్రస్తుతం డీఏ ఇవ్వడం లేదు. వీరు కూడా తమకు డీఏ ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా 58 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు, గర్భిణులు, కేన్సర్‌, టీబీ, గుండె జబ్బులులాంటివి ఉన్నవారికి మూల్యాంకనం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - 2022-05-17T16:53:51+05:30 IST