భారతీయులకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు: యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు

ABN , First Publish Date - 2020-08-15T01:19:51+05:30 IST

భారతదేశ 74వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు శనివారం జరగనున్నాయి

భారతీయులకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు: యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు

బ్రస్సెల్స్: భారతదేశ 74వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు శనివారం జరగనున్నాయి. ప్రతి ఏడాది ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేవి. అయితే కొవిడ్-19 నేపథ్యంలో ఈ సారి స్వాతంత్ర్య వేడుకలు ఎటువంటి ఆర్భాటాలు లేకుండానే జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతీయపతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమంలోనూ తక్కువ సంఖ్యలోనే అతిథులు హాజరుకానున్నారు. ఇదే సందర్భంలో ప్రపంచదేశాలు భారత్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాయి. తాజాగా యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు ప్రధాని మోదీకి, భారతీయులకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి నా హృదయపూర్వక అభినందనలు. ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతున్న వేళ మీ నాయకత్వంలో భారతదేశం రాణించడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఎంతో ఒత్తిడిని తట్టుకుని  సంకల్పంతో భారతదేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించారు. ఇతర దేశాల నాయకులు మిమ్మల్ని ప్రేరణగా తీసుకోవాలని కోరుకుంటున్నాం’ అని యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు థియెరీ మరియాని ప్రధానికి మెసేజ్ పంపారు. ఇక మరో పార్లమెంట్ సభ్యుడు, పోలాండ్ రాజకీయవేత్త రిచార్డ్ హెన్రీ జార్నెకి కూడా మోదీకి అభినందలు తెలిపారు. అంతేకాకుండా ఆరేళ్ల కాలంలో మోదీ భారతదేశానికి కొత్త దిశను చూపించారని.. కశ్మీర్ వ్యాలీలో శాంతిని నెలకొల్పారని, కొవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. వీరితో పాటు మరికొంత మంది పార్లమెంట్ సభ్యులు కూడా భారతీయులకు స్వాతంత్ర్యదినోత్వవ శుభాకాంక్షలను తెలిపారు.

Updated Date - 2020-08-15T01:19:51+05:30 IST