నీటిపై సీమకు చట్టబద్ధ హక్కు కల్పించాలి

ABN , First Publish Date - 2022-05-19T05:57:11+05:30 IST

రాయలసీమకు తాగు, సాగునీరుకు సంబంధించి చట్టబద్ధ హక్కులుకల్పించాలని సాగునీటి సాధన సమితి నాయకులు డిమాండ్‌ చేశారు.

నీటిపై సీమకు చట్టబద్ధ హక్కు కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న దశరథరామిరెడ్డి

- బొజ్జా దశరథరామిరెడ్డి

హిందూపురం టౌన, మే 18: రాయలసీమకు తాగు, సాగునీరుకు సంబంధించి చట్టబద్ధ హక్కులుకల్పించాలని సాగునీటి సాధన సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం రాత్రి హిందూపురం పట్టణంలోని ఇందిరాపార్క్‌ పెన్షనర్ల భవనంలో రాయలసీమ నీటి వనరులు, సిద్ధేశ్వరం అలుగు నిర్మాణ ఆవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్ట్‌లపై రాయలసీమ ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. వాటి సాధనకై కార్యాచరణచేపట్టాలని ఇందుకు సీమ ప్రజలు సహకరించాలన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి మన నీటి హక్కుల కోసం రైతుల భాగస్వామ్యంతో అనేక ఉద్యమాలు చేసిందన్నారు. ఈ ఉద్యమాల్లో 2016 మే 31న వేలాది మంది ప్రజలతో సిద్దేశ్వర, అలుగు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సీమ ప్రజల హృదయస్పందన సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి పాలక ప్రతిపక్షాలు ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. సిద్దేశ్వర అలుగు కోసం ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడ జాతీయ రహదారిలో వంతెన నిర్మిస్తున్నారన్నారు. ఆ వంతెనతోపాటు అలుగు కూడా నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశామన్నారు. ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. 1951లో సిద్దేశ్వర ప్రాజెక్ట్‌ నిర్మాణం జరిగి ఉంటే సీమ ప్రాంతం సామాజిక, ఆర్థిక, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉండేదన్నారు. సీమ నాయకులు రాజకీయాలకు అతీతంగా గళం విప్పాలన్నారు. సిద్దేశ్వర అలుగు సాధన కోసం ఈనెల 31న జరిగే సిద్దేశ్వరం జలదీక్షకు వేలాది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్‌ శ్రీనివాసులు, గంగిరెడ్డి, ఉమర్‌ఫారూక్‌, చిదంబర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి జమీల్‌, అమాన, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T05:57:11+05:30 IST