ఇథోఫాన్‌ వినియోగంపై వైఖరేమిటి?

ABN , First Publish Date - 2020-07-11T09:01:42+05:30 IST

పండ్లను కృత్రిమంగా పండించేందుకు అవసరమైన ‘ఇథిలిన్‌ గ్యాస్‌’ను విడుదల చేసే ‘ఇథోఫాన్‌ పౌడర్‌ ’ వినియోగంపై ఫుడ్‌ ..

ఇథోఫాన్‌ వినియోగంపై  వైఖరేమిటి?

అసిస్టెంట్‌ సోలిసిటర్‌ జనరల్‌ను ప్రశ్నించిన హైకోర్టు 



హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పండ్లను కృత్రిమంగా పండించేందుకు అవసరమైన ‘ఇథిలిన్‌ గ్యాస్‌’ను విడుదల చేసే ‘ఇథోఫాన్‌ పౌడర్‌ ’ వినియోగంపై  ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) వైఖరేమిటని అసిస్టెంట్‌ సోలిసిటర్‌ జనరల్‌  (ఏఎ్‌సజీ) ఎన్‌. రాజేశ్వరరావును  హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై  ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ, ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్లు కౌంటర్లు దాఖలు చేయాలని  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను జూలై 16కి వాయిదా వేసింది.  మామిడి, ఇతర పండ్లను కృత్రిమంగా మగ్గించేందుకు కాల్షియం కార్బైడ్‌ వినియోగంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఉమ్మడి హైకోర్టు 2015లో సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యంలో అమికస్‌ క్యూరీగా సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డిని నియమించిన ధర్మాసనం కాల్షియం కార్బైడ్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ఆదేశించింది. ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ సైతం కాల్షియం కార్బైడ్‌ను నిషేధిస్తూ దాని స్థానంలో ‘ఇథోఫాన్‌’ ను పరిమితంగా వినియోగించుకోవడానికి అనుమతించింది.


ఇథలిన్‌ గ్యాస్‌ను విడుదలచేసే ఇథోఫాన్‌ పౌడర్‌ ప్యాకెట్లను పండ్ల మధ్యలో ఉంచి మగ్గించ వచ్చని 2018లో అనుమతించింది. అయితే.. ఎఫ్‌ఎ్‌సఎస్‌ఏఐ అనుమతించిన ఇథోఫాన్‌ పౌడర్‌ వినియోగిస్తున్న తమపై కేసులు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ  ఇద్దరు వ్యాపారులు వేర్వేరు పిటిషన్ల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. అన్ని పిటిషన్లను జతచేసిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. కాల్షియం కార్బైడ్‌  స్థానంలో ఇథిలిన్‌ గ్యాస్‌ వినియోగించడం క్షేమకరమని గతంలో కోర్టుకు తెలిపిన అమికస్‌ క్యూరీ.. శుక్రవారం విచారణలో మాత్రం ఇథిలిన్‌ను క్రిమిసంహారకంగా వినియోగిస్తారని, దీనిని ఆహార పదార్థాలపై వాడరాదని వివరించారు. వ్యాపారుల తరుపున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ... ఇథోఫాన్‌ వినియోగం హానికరం కాదని దేశంలోని పలు ల్యాబరేటరీ పరీక్షల్లో తేలిందన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ విధాన నిర్ణయమేంటో జూలై 16లోగా చెప్పాలని ఆదేశించింది. 

Updated Date - 2020-07-11T09:01:42+05:30 IST