వట్టిపోయిన ఎత్తిపోతల..!

ABN , First Publish Date - 2022-08-18T06:21:00+05:30 IST

వట్టిపోయిన ఎత్తిపోతల..!

వట్టిపోయిన ఎత్తిపోతల..!
మున్నలూరు సాగునీటి ఎత్తిపోతల పథకం తీరిది..

కంచికచర్ల మండలంలో బీడుగా మారుతున్న వందల ఎకరాలు

అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యం వల్లే..

చెంతనే కృష్ణానది ఉన్నా చుక్కనీరు లేక అవస్థలు

చందాల వసూళ్లలో వైషమ్యాలే కారణం

రైతులను ముంచేస్తున్న రాజకీయాలు


చెంతనే కృష్ణానది ఉన్నా చుక్కనీరందని పంట పొలాలు వారివి. వరితో పచ్చగా కళకళలాడే మాగాణి భూములున్నా.. బంజరుగా మార్చు కోవాల్సిన దుస్థితి వారిది.. అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యానికి బలై సాగునీటి ఎత్తిపోతలకు నీరు అందించుకోలేని దైన్యస్థితి వారిది.. సాగునీరు లేక, నారుమళ్లు పోయక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నా పట్టని రాష్ట్ర ప్రభుత్వం, పట్టించుకోని ఐడీసీ అధికారుల కారణంగా వందల ఎకరాల భూములు బీడుగా మారి బోసిపోతున్నాయి.


కంచికచర్ల : 1960లో అప్పటి ఇంజనీర్‌, కేంద్ర మాజీమంత్రి డాక్టర్‌ కేఎల్‌ రావు చొరవతో కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామంలో కృష్ణానది ఒడ్డున సాగునీటి ఎత్తిపోతల పథకం ఏర్పాటైంది. ఈ ఆయకట్టు పరిధిలో మున్నలూరు, మోగులూరు, కునికినపాడు గ్రామాలకు చెందిన భూములు ఉన్నాయి. అధికారిక ఆయకట్టు వెయ్యి ఎకరాలకు పైగా ఉంది. అయితే, 700 ఎకరాల వరకే సాగవుతోంది. కొన్నేళ్లు ఎలాంటి ఢోకా లేకుండా మాగాణి భూములకు సాగునీరు అందింది. కాలగమనంలో ఎత్తిపోతల పథకం వద్ద ఇసుక మేటలు వేయటంతో సమీపంలో నీటి ప్రవాహం లేకుండాపోయింది. ఎకరాకు వెయ్యి నుంచి 1,500 మంది వరకు రైతులు చందాలు వేసుకుని నీటి ప్రవాహం వరకు ఇసుకలో కాల్వ తీయించి ఎత్తిపోతల వద్దకు నీళ్లు తెప్పించారు. నాట్లు వేయించి ఇతర గ్రామాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

అధికార పార్టీ ఏకపక్ష ధోరణి

ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఎక్కువ కావటంతో నిర్వహణ కూడా టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉండేది. అయితే, ప్రస్తుతం గ్రామంలో టీడీపీదే పట్టయినా, వైసీపీ అధికారంలో ఉండటంతో వారి పెత్తనమే సాగుతోంది. ఎత్తిపోతల నిర్వహణ కోసం గత ఏడాది వసూలైన చందాల సొమ్ముకు లెక్కలు చెప్పేందుకు వైసీపీ నేతలు నిరాకరించారు. దీంతో ఈ ఏడాది సొమ్ము చెల్లించేందుకు టీడీపీ సానుభూతిపరులైన రైతులు ముందుకు రాలేదు. కొంతమంది టీడీపీ సానుభూతి పరులైన రైతులు గత ఏడాది సొమ్ము చెల్లించలేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, కమిటీలో తమకు కూడా ఓ సభ్యత్వం ఉండాలని, జాయింట్‌ కమిటీ నిర్వహణ ఉండాలని టీడీపీ వారు పట్టుబడుతున్నారు. ఇందుకు వైసీపీ నేతలు అంగీకరించట్లేదు. దీంతో పథకం మూలనపడింది. చెంతనే కృష్ణానది వరదతో నిండుగా ప్రవహిస్తున్నప్పటికీ పథకం నుంచి ఇప్పటి వరకూ సాగునీరు విడుదల చేయలేదు. రైతులు వరి నారుమళ్లు కూడా పోయలేదు. దీనికితోడు కాల్వలు కూడా బాగు చేయించలేదు. దీంతో మాగాణి బీడుగా మారుతోంది. 

కునికినపాడు ఎత్తిపోతల కూడా ఇంతే..

ఇదే మండలంలో కృష్ణానది ఒడ్డున ఉన్న కునికినపాడు ఎత్తిపోతల పథకం కూడా మూలనపడింది. అధికారిక ఆయకట్టు 300 ఎకరాలు కాగా, 200 ఎకరాలకు పైగా సాగవుతోంది. గత ఏడాది నిర్వహణకు సంబంధించి వైసీపీ నేతలకు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనికితోడు ఈ పథకం మోటారు కాలిపోయిందంటున్నారు. కాల్వలు సరిగ్గా లేక, ఎక్కడికెక్కడ పూడిక వేశాయి.  

రైతుల ఆవేదన

ఈ రెండు పథకాల నుంచి సాగునీరు విడుదల కాకపోవటంతో రైతుల ఆవేదనకు అంతు లేకుండాపోయింది. ఇప్పటివరకు బోర్లు కింద తప్ప ఆయకట్టులో వరి నారుమళ్లు కూడా పోయలేదు. అయినప్పటికీ ఐడీసీ అధికారులు పట్టించుకోవట్లేదు. చర్యలు తీసుకుంటే అధికార పార్టీ నేతల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఐడీసీ అధికారులు పథకాల వైపు కన్నెత్తి చూడటంలేదు.




Updated Date - 2022-08-18T06:21:00+05:30 IST