వృత్తి ధర్మం

ABN , First Publish Date - 2020-09-11T05:30:00+05:30 IST

మనం చేసే మంచికి గానీ, చెడుకు గానీ అన్నిటికీ మూలం మన మనసు... మన ఆలోచన! చెడ్డ మనసుతో మనం కావాలని... తెలిసి చేసిన పనుల ఫలితాలు చివరకు దుఃఖాన్నే తెస్తాయి...

వృత్తి ధర్మం

మనం చేసే మంచికి గానీ, చెడుకు గానీ అన్నిటికీ మూలం మన మనసు... మన ఆలోచన! చెడ్డ మనసుతో మనం కావాలని... తెలిసి చేసిన పనుల ఫలితాలు చివరకు దుఃఖాన్నే తెస్తాయి.


నైతికత లేని విజ్ఞానం కన్నా నైతికత పాటించినప్పుడు అజ్ఞానమైనా మేలే! నైతికతను మరచిపోయిన విజ్ఞానం వల్ల విధ్వంసం మరింత పెరిగిపోతుంది. మోసం, దోపిడీ, అరాచకాలు పెచ్చరిల్లిపోతాయి. ‘నైతికత’ అంటే మనను మానవులుగా గుర్తుంచుకోవడం. మానవీయతను మనలో మనమే పెంపొందించుకోవడం. బుద్ధుడు మహిమలను నమ్మలేదు. నమ్మాలని చెప్పలేదు. మానవత్వాన్నే నమ్మాడు. మనుషులను మానవత కలిగినవారిగా మలచడానికే జీవితాంతం శ్రమించాడు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో కరోనా వైరస్‌ కన్నా ప్రమాదకారులై, ధనమే ప్రధానంగా వ్యవహరిస్తున్న కొన్ని వైద్యశాలల గురించి వింటున్నాం. ఇప్పుడే కాదు, బుద్ధుని కాలంలో కూడా ఇలాంటి వైద్యులు ఉండేవారు. వారిలో చక్షుపాలుడు ఒకడు.


చక్షుపాలుడు పేరెన్నికగన్న నేత్ర వైద్యుడు. త్వరగా తగ్గిపోవాల్సిన రోగాన్ని కావాలనే నెమ్మదిగా తగ్గించి, ఎక్కువ సొమ్ము రాబట్టేవాడు. అతని దగ్గరకు ఒక మహిళ కంటి వైద్యం కోసం వచ్చింది. ఆమె అడవిలో పుల్లలు ఏరుకుంటూ ఉండగా, ఒక ఎండు కర్ర పుల్ల ఆమె కంటికి తగిలింది. కన్ను ఎర్రబడి నీరు కారడంతో ఆమె చక్షుపాలుని దగ్గరకు వచ్చింది. 

చక్షుపాలుడు ఆమె కంటిని పరీక్షించాడు. కర్ర పుల్ల రెప్పకు తగిలింది. కన్ను కొద్దిగా అదిరింది. మామూలుగానే నయం అయిపోతుంది. కానీ బేరం మొదలుపెట్టి ఎక్కువ సొమ్ము అడిగాడు.

‘‘అయ్యా! నేను కూలి చేసుకొని బతుకుతాను. నా కంటికి వైద్యం చేయండి. ఒక నెల పాటు మీ ఇంట్లో పని చేసి పెడతాను’’ అని వేడుకుందామె.

అతనికి ఎలాగూ దాసులు కావాలి. కాబట్టి వైద్యం మొదలుపెట్టాడు. రెండు కళ్ళకూ లేపనాలు పూశాడు. పసర్లు పిండాడు. ఆమె అలా మూడు వారాలు వైద్యం చేయించుకుంటూ, వైద్యుడి ఇంట్లో పనులు చేస్తూ గడిపింది. రానురానూ చూపు మెరుగుపడవలసింది పోయి, రెండు కళ్ళ చూపూ మందగించింది. కొద్ది రోజుల్లోనే చూపు పోయింది. ఆ విషయం వైద్యునికి చెప్పి మొత్తుకుంది. ‘‘కంటి చూపు వస్తుంది. కానీ చాలా ఖర్చు అవుతుంది’’ అన్నాడు చక్షుపాలుడు.

‘‘అయ్యా! నాకు కంటి చూపు తెప్పించండి. నేనూ, నా కుమారుడూ జీవితాంతం మీ ఇంట్లో దాసులుగా పడి ఉంటాం’’ అంది.

చక్షుపాలుడు సంతోషించి, మళ్ళీ కొన్ని లేపనాలను ఆమె కంట్లో వేశాడు. ఆమెకు చూపు మెల్లగా వచ్చేసింది. వైద్యుడి మోసం గ్రహించిన ఆమె ‘ఇంకా సరిగ్గా కనిపించడం లేదు’ అంటూ కొంతకాలం నెట్టుకొచ్చింది. ఈ విషయం వైద్యుడు గమనించాడు. ‘తాను చేస్తే లౌక్యం, ఎదుటి వాడు చేస్తే మోసం ’అనుకున్నాడు. వెంటనే ఆమెకు శాశ్వతంగా చూపు పోవడానికి మందులు ప్రయోగించాడు. ఆమె చూపు పోగొట్టాడు. ఈ కథ ఇంకా ఉంది. ఆ చక్షుపాలుడు కూడా చివరకు గుడ్డివాడై పోతాడు. తాను చేసిన పనులకు అప్పుడు చింతిస్తాడు. దుఃఖపడతాడు.

ఇలాంటి విషయాల్లో తెలియక జరిగితే తప్పుగానూ, తెలిసి జరిగితే నేరంగానూ బౌద్ధం పరిగణిస్తుంది. ‘తెలిసి జరగడం’ అంటే ఉద్దేశపూర్వకంగా దుర్బుద్ధితో చేయడం. అలా చేసినవాడు మలిన మనస్కుడు. మనం చేసే మంచికి గానీ, చెడుకు గానీ అన్నిటికీ మూలం మన మనసు... మన ఆలోచన! చెడ్డ మనసుతో మనం కావాలని... తెలిసి చేసిన పనుల ఫలితాలు చివరకు దుఃఖాన్నే తెస్తాయి. ‘బండిని లాగే ఎడ్ల కాలి గిట్టల అడుగుల వెనుకే బండి చక్రాలు వచ్చినట్టు దుఃఖం కూడా వెంబడించే వస్తుంది’ అంటుంది బౌద్ధ ధమ్మపదం.

వైద్యుడైనా, ఉపాధ్యాయుడైనా మరే పని చేసేవారైనా దుర్బుద్ధితో, స్వార్థంతో తమ వృత్తిధర్మాన్ని నెరవేర్చితే అది చివరకు దుఃఖాన్నే ఇస్తుంది. 

- బొర్రా గోవర్ధన్‌



 


Updated Date - 2020-09-11T05:30:00+05:30 IST