పండ్లను మాగబెట్టేందుకు ఇథెఫాన్‌ వినియోగించొచ్చు

ABN , First Publish Date - 2022-01-23T08:47:37+05:30 IST

మామిడి, బొప్పాయి వంటి పండ్లను మాగబెట్టేందుకు(పండించేందుకు) ఈథెఫోన్‌ సాచెట్స్‌ వినియోగం సబబేనని తెలంగాణ హైకోర్టు తాజాగా తేల్చిచెప్పింది.

పండ్లను మాగబెట్టేందుకు ఇథెఫాన్‌ వినియోగించొచ్చు

  • కార్బైడ్‌ నిరోధానికి అది ప్రత్యామ్నాయం: తెలంగాణ హైకోర్టు
  • ఇథెఫాన్‌, ఎన్‌-రైప్‌ వాడకాన్ని నిషేధించాలన్న విజ్ఞప్తి కొట్టివేత
  • నిషేధిత కార్బైడ్‌ నిరోధానికి అది ప్రత్యామ్నాయం
  • తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ

హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): మామిడి, బొప్పాయి వంటి పండ్లను మాగబెట్టేందుకు(పండించేందుకు) ఈథెఫోన్‌ సాచెట్స్‌ వినియోగం సబబేనని తెలంగాణ హైకోర్టు తాజాగా తేల్చిచెప్పింది. క్రిమిసంహారక మందుల్లో వినియోగించే ఈథెఫోన్‌ను వినియోగించి ఫలాలను పండించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి హానికలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ సికింద్రాబాద్‌ యాప్రాల్‌కు చెందిన నలిన్‌ వెంకట్‌ కిశోర్‌కుమార్‌, ఏపీ ట్రాన్స్‌కో విశ్రాంత ఉద్యోగి ఎల్‌. రమేశ్‌బాబు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈథెఫోన్‌ వంటి పురుగుమందును సాచెట్స్‌ రూపంలో కాయలను పండించేందుకు బహిరంగ మార్కెట్‌లో విక్రయించడం హానికరమని, సాచెట్స్‌ నుంచి ఈథెఫోన్‌ లీక్‌ అయితే అనేక రోగాలకు కారణమవుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కళ్యాణ్‌ చక్రవర్తి కోర్టుకు తెలిపారు. సాచెట్స్‌ వినియోగానికి ఫుడ్‌ స్టేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) ఇచ్చిన అనుమతిని కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. క్రిమిసంహారక మందుల చట్టంలో సైతం ఈథెఫోన్‌ను పురుగుమందుగా పేర్కొన్నట్లు గుర్తుచేశారు. మరోవైపు.. ఈథెఫోన్‌ దిగుమతిదారు రవీందర్‌కుమార్‌ నాగ్‌పాల్‌ తరఫున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో పండ్లను మాగబెట్టేందుకు కార్బైడ్‌ను వినియోగించే వారని.. ఇది అత్యంత ప్రమాదకరమని తేలడంతో ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ దానిని నిషేధించిందని తెలిపారు. 


2016లో ఇథలీన్‌ గ్యాస్‌ ద్వారా కాయలను పండించేందుకు ఈథెఫోన్‌ వాడకానికి అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. ఈథెఫోన్‌ సాచెట్స్‌లో కేవలం ముడి ఈథెఫోన్‌ మాత్రమే ఉండదని.. మెగ్నీషియం, సిలికాన్‌ వంటి ఇతర మూలకాలు సైతం ఉంటాయని.. 40 నుంచి 60 మైక్రాన్‌ల మందం కలిగిన మూడుపొరల సెల్యూలోజ్‌ మెంబ్రేన్‌ పేపర్‌తో దీన్ని ప్యాకింగ్‌ చేస్తారని ఆయన వివరించారు. ఇథిలీన్‌ గ్యాస్‌ ఉత్పత్తికి ఈథెఫోన్‌ వాడడాన్ని 20వ సైంటిఫిక్‌ ప్యానెల్‌ సదస్సులో నిపుణుల కమిటీ ఽసమర్థించిందని తెలిపారు. ఇక.. దేశవ్యాప్తంగా కార్బైడ్‌ అక్రమ వినియోగాన్ని నిరోధించేందుకే ఈథెఫోన్‌ను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ తెలిపింది. ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దేశవ్యాప్తంగా పండ్లను మాగబెట్టేందుకు అన్ని ప్రాంతాల్లో ఇథలీన్‌ గ్యాస్‌ ఛాంబర్లు అందుబాటులో లేవని.. అవి లేని చోట ఈథెఫోన్‌ సాచెట్స్‌ వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈథెఫోన్‌ పురుగుమందుగా గుర్తింపు పొందిదని.. అయితే ఈథెఫోన్‌ ఉత్పత్తి చేసే ఇథలీన్‌ గ్యాస్‌ను పంటల ఎదుగుదలకు గ్రోత్‌ హార్మోన్‌గా వినియోగిస్తారని తెలిపారు. అన్నిరకాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కార్బైడ్‌ వినియోగాన్ని నిరోధించేందుకు శాస్ర్తీయ అధ్యయనం తర్వాతే ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ రెగ్యులేషన్స్‌ జారీచేందని అభిప్రాయపడింది. గత ఏడాది జూలైలో ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ 20వ సైంటిఫిక్‌ ప్యానెల్‌ ఈథెఫోన్‌ వినియోగాన్ని ధ్రువీకరించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈథెఫోన్‌ వినియోగం సబబేనని తెలిపింది. ఇదిలా ఉండగా.. పండ్లను మాగబెట్టేందుకు మరో ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న ఎన్‌-రై్‌పనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను కొట్టేయాలని మరో రెండు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వాటిని కూడా కోర్టు తోసిపుచ్చింది. ఎన్‌-రైప్‌ వినియోగాన్ని తప్పనిసరి అని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొనలేదని.. అందువలన ప్రభుత్వ ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. 

Updated Date - 2022-01-23T08:47:37+05:30 IST