కాగితాల్లోనే ఇథనాల్‌ ప్లాంట్‌

ABN , First Publish Date - 2021-02-25T06:31:25+05:30 IST

పెట్రోల్‌లో ఇథనాల్‌ శాతాన్ని పెంచి, తద్వారా ధర తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇథనాల్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నది.

కాగితాల్లోనే ఇథనాల్‌ ప్లాంట్‌

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో యూనిట్‌ ఏర్పాటుకు 2020 జనవరిలో ఉత్తర్వులు జారీ

తొలివిడతగా రూ.26 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటన

13 నెలలైనా ఒక్క రూపాయి కూడా విడుదల చేయని  రాష్ట్ర ప్రభుత్వం

నాడు హడావిడి చేసి... ఇప్పుడు నోరుమెదపని ప్రజాప్రతినిధులు

ప్రకటనలకే పరిమితమైన షుగర్‌ ఫ్యాక్టరీల స్వయంసమృద్ధి 


చోడవరం, ఫిబ్రవరి 24:  పెట్రోల్‌లో ఇథనాల్‌ శాతాన్ని పెంచి, తద్వారా ధర తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇథనాల్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నది. ఇథనాల్‌ ప్లాంట్లను ఏర్పాటుచేసే వారికి ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని ప్రకటించింది. కానీ రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడంలేదు. దీంతో చక్కెర ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అయ్యే మొలాసిస్‌ను డిస్టలరీస్‌కు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నది. 

మొలాసిస్‌ ఆధారంగా ఇథనాల్‌ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటైతే, షుగర్‌ ఫ్యాక్టరీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని, తద్వారా ఆర్థిక స్వావలంబన సాధించి, నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పని వుండదని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా ఇథనాల్‌ తయారీపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. షుగర్‌ ఫ్యాక్టరీలు మొలాసిస్‌ను ఉపయోగించుకుని ఇథనాల్‌ ఉత్పత్తి ప్లాంట్‌ల ఏర్పాటుకు ముందుకువస్తే ఉద్దీపన పథకం కింద వడ్డీ లేని రుణాలు ఇస్తామంటూ హామీ ఇచ్చింది. ఇథనాల్‌ ప్లాంట్‌ కలిగిన షుగర్‌ ఫ్యాక్టరీలకు కేంద్రం ఇచ్చే అదనపు రాయితీలు కూడా వర్తింపజేస్తామని స్పష్టం చేసింది.  


గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో ఇథనాల్‌ ప్లాంట్‌

జిల్లాలో సహకార రంగంలో నడుస్తున్న ఏటికొప్పాక, తాండవ, గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలలో ఉత్పత్తి అయ్యే మొలాసిస్‌ను వినియోగించుకుని ఇథనాల్‌ తయారుచేసేలా రెండేళ్ల క్రితమే అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, గత ఏడాది జనవరిలో గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో 30 కిలోలీటర్ల రోజువారీ ఉత్పత్తి సామర్థ్యంతో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అంతేకాక తొలివిడతగా రూ.26 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇటు ఫ్యాక్టరీ వర్గాలు, అటు చెరకు రైతులు ఎంతో సంతోషించారు. జిల్లాలోని మూడు షుగర్‌ ఫ్యాక్టరీలతోపాటు పక్క జిల్లాల్లో వున్న భీమసింగి, సంకిలి షుగర్‌ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అయ్యే మొలాసిస్‌ను కూడా ఈ ప్లాంట్‌లో వినియోగించుకోవాలన్నది ప్రణాళిక. ఈ ప్లాంట్‌ పట్టాలెక్కితే మొలాసిస్‌ పూర్తిగా వినియోగంలోకి వచ్చి, షుగర్‌ ఫ్యాక్టరీలకు ఆర్థికంగా మరింత భరోసా వుంటుందని అంతా భావించారు. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో గోవాడ ఫ్యాక్టరీ అధికారులు ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు.


రెండు రకాల స్పిరిట్ల ఉత్పత్తి కూడా...

మొలాసిస్‌ నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి చేసే సమయంలోనే రెండు రకాల స్పిరిట్లు కూడా ఉప ఉత్పత్తులుగా తయారవుతాయి. ఒక రకం స్పిరిట్‌ను మద్యం తయారీకి వినియోగిస్తారు. మరో రకం స్పిరిట్‌ను ఔషధాల ఉత్పతిలో వాడతారు. చివరగా మడ్డిలాంటి పదార్థం మిగులుతుంది. దీనిని పంటకు ఎరువుగా వినియోగించవచ్చు. ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేస్తే బహుళ ప్రయోజనాలు వున్నాయని షుగర్స్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ప్రకటనలకే పరిమితం!

గోవాడలో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు తొలివిడత రూ.26 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి ఏడాది దాటింది. కానీ ఇంతవరకు ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభం కాలేదు. కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. గోవాడలో ఇథనాల్‌ ప్లాంట్‌ వచ్చేస్తోందంటూ నాడు హడావిడి చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు...ఇప్పుడు దానిపై పెదవి విప్పడం లేదు. ఇథనాల్‌ ప్లాంట్‌కు నిధుల కేటాయింపు కాగితాలకే పరిమితమైందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సహకార చక్కెర కర్మాగారాలు స్వయంసమృద్ధి సాధించేలా అభివృద్ధి చేస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఉత్తుత్తివేనా? అని రైతులు, షుగర్స్‌ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

Updated Date - 2021-02-25T06:31:25+05:30 IST