Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 05 Nov 2021 18:13:07 IST

‘ఎటర్నల్స్’ మూవీ రివ్యూ

twitter-iconwatsapp-iconfb-icon

చిత్రం పేరు: ‘ఎటర్నల్స్’

విడుదల తేదీ: 05 నవంబర్, 2021

తారాగణం: గెమ్మచాన్, రిచర్డ్ మాడెన్, ఏంజెలీనా జోలీ, సల్మా హాయక్, హరీష్ పటేల్, లియా మెక్‌హగ్, కుమాయిల్ నంజియాని తదితరులు 

సంగీతం: రామిన్ జావాడి

సినిమాటోగ్రఫీ: బెన్ డెవిస్

బ్యానర్: మార్వెల్ స్టూడియోస్

నిర్మాతలు: కెవిన్ ఫీజ్, నేట్ మూర్ 

దర్శకత్వం: క్లోయీ జా


మానవాతీత శక్తులు కలిగిన పాత్రలుగా సృష్టించబడిన సూపర్ హీరోస్‌కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘అవెంజర్స్’ సిరీస్‌తో సూపర్ హీరోలపై విశ్వవ్యాప్తంగా ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన మార్వెల్ స్టూడియోస్ సంస్థ.. ‘అవెంజర్స్: ఎండ్ ‌గేమ్’తో ఆ సిరీస్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. కానీ అవెంజర్స్ పాత్రలు మాత్రం జనాల్లో అలానే ఉండిపోయాయి. థానోస్, స్ఫైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, హల్క్ అంటూ పిల్లలు సైతం ఇంకా మాట్లాడుకుంటున్నారంటే సూపర్ హీరోల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ‘అవెంజర్స్’‌కి ముగింపునిచ్చినా.. సూపర్ హీరోస్‌కి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని మార్వెల్ సంస్థ.. ఇప్పుడు కొత్త సూపర్ హీరోలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు రెడీ అయింది. ఆ కొత్త సూపర్ హీరోసే ‘ఎటర్నల్స్’. ఈసారి సూపర్ హీరోస్‌గా అంతా కొత్తవారినే ఎంపిక చేసుకోవడం, ఏంజెలినా జోలీ వంటి నటి ఇందులో యాడ్ అవడం.. అలాగే విడుదలైన ట్రైలర్.. ఇలా ప్రతీది ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. మరి ఇలాంటి అంచనాల నడుమ దీపావళి స్పెషల్‌గా నేడు(నవంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఎటువంటి మ్యాజిక్‌ని క్రియేట్ చేసిందో తెలుసుకుందాం.


కథ:

క్రీ.పూ 5000 కాలంలో సెరిస్టియన్ ఆర్షెమ్.. ఒలింపియా గ్రహం నుండి సూపర్ పవర్స్‌ ఉన్న 10 మంది ఎటర్నల్స్‌ని భూమిపైకి పంపిస్తాడు. భూమికి, భూమిపై ఉన్న జీవరాశులను ఇబ్బంది పెట్టే డెవియంట్స్‌ని ఎదుర్కోవడంతో పాటు, మానవుల నాగరికతకు తోడ్పాటుని అందించేందుకు ఎటర్నల్స్ సృష్టించబడతారు. అయితే డెవియంట్స్‌‌ని విజయవంతంగా ఎదుర్కొని తమ పని పూర్తి చేసిన ఎటర్నల్స్‌.. ఆర్షెమ్ నుండి పిలుపు రాకపోవడంతో తలో దిక్కుకి వెళ్లిపోతారు. ప్రస్తుత సమయానికి వస్తే.. మరింత శక్తిని తమలో నింపుకుని ఎటర్నల్స్‌ని అంతం చేసేందుకు డెవియంట్స్ మళ్లీ వస్తాయి. అసలు ఆ డెవియంట్స్‌ని పుట్టించింది ఎవరు? అంతర్గత కలహాలతో ఉన్న ఎటర్నల్స్.. డెవియంట్స్ శక్తి ముందు నిలబడగలిగారా? వాటి ద్వారా ఏర్పడిన ఎమర్జెన్సీని ఎటర్నల్స్ ఎలా ఎదుర్కొన్నారు? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు విజువల్ వండర్‌‌తో కూడిన సమాధానమే ‘ఎటర్నల్స్’ చిత్రం.

విశ్లేషణ:

గెమ్మచాన్, రిచర్డ్ మాడెన్, ఏంజెలీనా జోలీ, సల్మా హాయక్, లియా మెక్‌హగ్, కుమాయిల్ నంజియాని వంటి వారు ఈ చిత్రంలో నటించారు. ఎవరు ఎలా చేశారు అని చెప్పడానికి.. ఇది సూపర్ హీరోస్ సినిమా. అతీత శక్తులున్న ఎటర్నల్స్‌గా చేసిన ప్రతి ఒక్కరూ వారి పాత్రల పరిధిమేర నటించారు. సెర్సీ‌గా చేసిన గెమ్మ చాన్‌‌కు ఈ పార్ట్‌లో ఎక్కువ స్కోప్ లభించింది. ఐకారిస్, థెనా పాత్రలకు కూడా ఈ పార్ట్‌లో మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. థెనాగా నటించిన ఏంజెలీనా జోలీ విరోచిత పోరాటాలు థ్రిల్ కలిగిస్తాయి. గిల్‌గమేష్, కింగో పాత్రలు సూపర్ పవర్స్‌తో పోరాటం చేయడమే కాకుండా.. థియేటర్లలో ఉన్న ప్రేక్షకులని నవ్విస్తాయి. స్ప్రైట్‌, ఫాస్టోస్, డ్రూయిగ్, అజాక్ ఇందులో ఎటర్నల్స్‌గా కనిపించే పాత్రలు. ఈ పేర్లు ఇప్పుడు కొత్తగా ఉన్నా.. ముందు ముందు వినిపించే సూపర్ హీరోస్ వీరే. ప్రథమ భాగం కావడంతో.. పాత్రలను, పేర్లను గుర్తుంచుకోవడం ప్రేక్షకులకి కాస్త కష్టమే. ఈ పాత్రలని పరిచయం చేసేందుకే సినిమాలో టైమ్ ఎక్కువ తీసుకున్నారనిపించింది. విజువల్‌గా వండర్‌ అని అనిపించినా.. కథ నడిచే తీరు అంత ఆసక్తికరంగా అనిపించలేదు. ఉన్న 10 మంది ఎటర్నల్స్‌కి 10 రకాల శక్తులు ఉన్నప్పటికీ.. ‘అవెంజర్స్’లో చూసినవే తప్ప.. కొత్తగా ఏం చేసినట్లు అనిపించలేదు. బహుశా కథ నడిచిన తీరు దీనికి కారణం అని చెప్పవచ్చు. 10 రకాల శక్తులున్న ఎటర్నల్స్‌తో ఇంకొన్ని మ్యాజిక్స్ చేసే అవకాశం ఉన్నా.. కేవలం వారు డెవియంట్స్ కోసమే అనేలా.. వాటితో చేసే యాక్షన్ పార్ట్‌కే ఇంపార్టెన్స్ ఇవ్వడం చూస్తుంటే.. దర్శకురాలు సూపర్ హీరోస్‌ని సరిగా వినియోగించుకోలేదనిస్తుంది. రాబోయే సీక్వెల్స్‌లో అలాంటివేమైనా ప్లాన్ చేశారేమో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ పరంగా మాత్రం ఈ ‘ఎటర్నల్స్’ మెస్మరైజ్ చేస్తారు. ఫైనల్‌గా, ‘అవెంజర్స్’ని పక్కన పెట్టి.. కొత్త సూపర్ హీరోలు ఎలా ఉంటారో? అని చూడడానికి వెళితే మాత్రం ‘ఎటర్నల్స్’ డిజప్పాయింట్ చేయరు.

ట్యాగ్‌లైన్: విజువల్ ఫీస్ట్.. అంతే!

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement