శాశ్వతమైన సంపద!

ABN , First Publish Date - 2020-12-04T05:30:00+05:30 IST

సంపదలు ఎన్ని ఉన్నా అవి ‘దైవ కృప’ అనే సంపదతో సమానం కావు. దైవానుగ్రహం ఎవరికి ఉంటుందో వారే సంపన్నులు. ఈ సత్యాన్ని గ్రహించకుండా మరిన్ని సంపదలు కావాలని ఆశించేవారికి చివరికి మిగిలేదేమీ ఉండదని ఒక కథలో ఏసు ప్రభువు స్పష్టం చేశాడు.

శాశ్వతమైన సంపద!

సంపదలు ఎన్ని ఉన్నా అవి ‘దైవ కృప’ అనే సంపదతో సమానం కావు. దైవానుగ్రహం ఎవరికి ఉంటుందో వారే సంపన్నులు. ఈ సత్యాన్ని గ్రహించకుండా మరిన్ని సంపదలు కావాలని ఆశించేవారికి చివరికి మిగిలేదేమీ ఉండదని ఒక కథలో ఏసు ప్రభువు స్పష్టం చేశాడు. 


ఆయన ఒక ఊరిలో ప్రసంగిస్తూ ఉండగా... అక్కడ ఉన్న జనంలో ఒక వ్యక్తి లేచి ‘‘బోధకుడా! నా తండ్రి ఆస్తిలో నాకు వాటాను పంచాలని నా సోదరుడికి చెప్పండి’’ అని అడిగాడు. 


దానికి ఏసు ప్రభువు స్పందిస్తూ ‘‘మీకు న్యాయమూర్తిగానో, మధ్యవర్తిగానో నన్ను ఎవరు నియమించారు?’’ అని ప్రశ్నించాడు. 


ఆ తరువాత ఆయన అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘జాగ్రత్తగా ఉండండి. అత్యాశ ఏరూపంలో ఉన్నా దాని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఆస్తిపాస్తులు శాశ్వతం కావు’’ అంటూ ఒక కథ చెప్పాడు ‘‘ఒక ఊరిలో ఒక డబ్బున్న వ్యక్తి ఉన్నాడు. అతని పొలంలో పంట దిగుబడి బాగా వచ్చింది. ‘‘ఇప్పుడు నేనేం చెయ్యాలి? పండిన ధాన్యమంతా నిల్వ చెయ్యడానికి సరైన చోటు నా దగ్గర లేదు. కాబట్టి నా గిడ్డంగుల్ని కూల్చేస్తాను. వాటి స్థానంలో ఇంకా పెద్దవి కట్టిస్తాను. మిగిలిన ధాన్యమంతా దానిలో నిల్వ చేస్తాను’’ అన్నాడు. అలాగే ‘‘నా దగ్గర ఎన్నో ఏళ్ళకు సరిపడే ఆహార దినుసులు పుష్కలంగా ఉన్నాయి.  కాబట్టి జీవితాన్ని హాయిగా తీసుకుంటాను. తింటాను, తాగుతాను, ఆనందంగా ఉంటాను’’ అనుకున్నాడు.  అప్పుడు దేవుడు ‘‘ఓ మూర్ఖుడా! ఈ రాత్రే నీ ప్రాణాలు పోతాయి. మరి అలాంటప్పుడు ఎవరు అనుభవించడం కోసం ఇదంతా సిద్ధం చేస్తున్నావ్‌?’’ అని నిలదీశాడు. దేవుని దృష్టిలో సంపన్నుడు కావాలి. దాని కోసం ప్రయత్నమేదీ చేయకుండా, ఎన్నాళ్ళు బతుకుతామో తెలియకుండా, రాబోయే సుఖం కోసం సంపద కూడబెట్టుకొనే వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది’’ అని కథను ముగించాడు ఏసు ప్రభువు (లూకా - 12: 13-21). 


దేవుడు చూపిన దారిలో మానవులు నడవాలి. ఆ దారిలో దొరికే సంపదలు అమూల్యమైనవి, నశించనివి.  భౌతిక సుఖాలను అందించే సంపదల కన్నా శాశ్వతమైన దైవకృపకు పాత్రులవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి.

Updated Date - 2020-12-04T05:30:00+05:30 IST