నిత్య సమరం

ABN , First Publish Date - 2021-05-04T04:50:44+05:30 IST

జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలు నింగినంటుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న రేట్లు పేద, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటికే అనేక కుటుంబాలు ఉపాధి లేక ఆర్థికంగా చితికి పోయాయి. పప్పులు ఉడకనంటుండగా, నూనె ధరలు సలసల కాగుతున్నాయి. మార్కెట్‌లో మండిపోతున్న ధరలను చూసి ప్రజలు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు.

నిత్య సమరం

కాగుతున్న వంట నూనెలు.. అదే బాటలో పప్పులు

పస్తులుంటున్న పేదలు.. రోజు వారీ కూలీలు

కోలుకోలేని పరిస్థితిలో పేద, మధ్య తరగతి కుటుంబాలు

పచ్చిపులుసు, పచ్చడి మెతుకులే.. దిక్కంటున్న జనం

ధరల నియంత్రణలో జిల్లా అధికార యంత్రాంగం విఫలం

ఆదిలాబాద్‌టౌన్‌, మే 3: జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలు నింగినంటుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న రేట్లు పేద, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటికే అనేక కుటుంబాలు ఉపాధి లేక ఆర్థికంగా చితికి పోయాయి. పప్పులు ఉడకనంటుండగా, నూనె ధరలు సలసల కాగుతున్నాయి. మార్కెట్‌లో మండిపోతున్న ధరలను చూసి ప్రజలు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యుడి జీవనం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇక రోజు వారి కూలీలైతే కరోనా రెండవ దశా ప్రభావంతో ఉపాధి లేక అటు పెరిగిన ధరలతో పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది సగానికి పైగా ధరలు పెరిగాయి. నలుగురు కుటుంబ సభ్యులకు నెలకు సరిపడా సరుకులు కావాలంటే 15 రోజుల పాటు పని చేసిన డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని వాపోతున్నారు. అయితే ధరల నియంత్రణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.

నింగినంటుతున్న నూనె ధరలు..

అసలే ఉపాధి లేక దిగాలు చెందుతున్న ప్రజలకు పెరిగిన నిత్యావసరాల ధరలతో ములిగె నక్కపై తాటికాయ పడ్డట్లుగా ధరల పెరుగుదల ఉంది. మార్కెట్‌లో గత నెల వరకు అదుపులోనే ఉన్న నూనె ధరలు ఒక్కసారిగా లీటరు నూనె ప్యాకెట్‌ ధర రూ.180 నుంచి రూ.200లకు చేరింది. అదే బాటలో బియ్యం, పప్పు ధరలు కూడా పయనిస్తుండడంతో పేద ప్రజలు ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఏమి కొనాలన్నా ధరలు మండిపోవడంతో చేసేదేమి లేక పస్తులుంటున్నారు. పచ్చిపులుసు, పచ్చడి మెతుకులే దిక్కని వాపోతున్నారు.

భారమవుతున్న బతుకులు..

పెరుగుతున్న ధరలలో పేదోడి బతుకు భారంగా మారింది. చక్కెర, ఉప్పు, చింత పండు మొదలు ప్రతి వస్తువుపై కనీసం రూ.30 వరకు ధరలు పెరిగాయి. ఆయిల్‌ ధరలు 3 నెలలుగా భారీగా పెరిగి పోయాయి. కరోనా వైరస్‌ ప్రభావం మరింత తీవ్రం కావడంతో రెండు నెలలుగా ప్రతి నెలా రూ.20 నుంచి రూ.30 వరకు పెరుగుతూనే ఉంది.

ధరల నియంత్రణలో విఫలం..

నెలంతా కష్టపడి పనిచేస్తే వచ్చిన నగదు అధిక శాతం నిత్యావసర వస్తువులకే ఖర్చవుతోంది. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలతో పాటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. పేద, మధ్య తరగతి వారిపై భారం పడుతుందని ఆలోచించే నాథుడే కరువయ్యాడని మండిపడుతున్నారు.

Updated Date - 2021-05-04T04:50:44+05:30 IST