అనాది జీవితం

ABN , First Publish Date - 2022-08-09T05:28:08+05:30 IST

మానవాళి ప్రాచీన మూలాలు ఆదివాసుల్లో ఉన్నాయి. ప్రకృతిలో భాగమైనందు వల్ల ఆదివాసీ తెగల సంస్కృతుల్లో అపారమైన వైవిధ్యం ఇప్పటికీ కనిపిస్తుంది.

అనాది జీవితం
ఆటలాడుతున్న గిరిజనులు

ఆదివాసీ సంస్కృతిలో మానవ మూలాలు
వైవిధ్యభరితమైన సంప్రదాయాలు
అర్ధ సంచార జీవితంలో నల్లమల చెంచులు
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం


మానవాళి ప్రాచీన మూలాలు ఆదివాసుల్లో ఉన్నాయి. ప్రకృతిలో భాగమైనందు వల్ల ఆదివాసీ తెగల సంస్కృతుల్లో అపారమైన వైవిధ్యం ఇప్పటికీ కనిపిస్తుంది. ఆదివాసీ జీవితంలో మానవులు నడచి వచ్చిన దారులు కనిపిస్తాయి. నల్లమలలోని చెంచులు ద్రావిడ తెగకు చెందినవారు. చెంచుల చరిత్ర, సంస్కృతి, సమకాలీన వ్యవహారాలపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. 17వ శతాబ్దంలోనే ఫెరిస్టా అనే చరిత్రకారుడు చెంచుల జీవితంపై చాలా విషయాలు నమోదు చేశారు. 1943లో హెమండార్ఫ్‌ రాసిన పుస్తకం చెంచుల గురించిన ప్రామాణిక రచన. చెంచులు నల్లమలలో మాత్రమే ఉంటారు. దేశంలో వెనుకబడిన ఆదివాసీ తెగల్లో చెంచు తెగ ఒకటి. ప్రభుత్వాలు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థను నిర్వహిస్తున్నప్పటికీ చెంచుల జీవన ప్రమాణాల్లో అర్థవంతమైన మార్పులు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా నల్లమల చెంచుల జీవనంపై కథనం.

ఆత్మకూరు, ఆగస్టు 8: నల్లమల రెండు తెలుగు రాష్ర్టాల్లో విస్తరించి ఉంది. చెంచుల ఆవాసాలను గూడేలని అంటారు. మరీ కొన్ని ఇండ్లు ఉంటే పెంటలు అంటారు. దోమలపెంట, సున్నిపెంట, చదరం పెంట మొదలైన పేర్లు అలా వచ్చినవే. సామాజిక పరిణామం లో చెంచులు అర్ధ సంచార దశలోనే ఆగిపోయారు. అటవీ ఫల సేకర ణ మీద జీవిస్తున్నారు. ఇటీవల కొన్ని గూడేలలో వ్యవసాయం చేస్తు న్నారు. అంత మాత్రాన చెంచులకు వ్యవసాయంలో నైపుణ్యం రాలేదు. వాళ్లను రైతులుగా భావించలేం. చాలా పెంటల్లో ఇంకా అటవీ ఫలసాయ సేకరణ, వేటస్థాయిలోనే చెంచులు జీవిస్తున్నారు. చెంచుల మాతృభాష తెలుగే అయినప్పటికీ తమదైన యాస, మాండలికం మిళితమై ఉన్నా యి. పెంటల్లో నేటికి అనారోగ్యం, పోషకాహారలోపం, ఆర్థిక వెనుక బాటుతనం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

చెంచుల్లో రెండు తెగలు

చెంచుల్లో అడవి చెంచులు, ఊరచెంచులు అనే రెండు ఉపతెగలు ఉన్నాయి. నల్లమల అడవుల్లో కృష్ణానదికి ఇరువైపుల ఉండే కొండ, లోయ ప్రాంతాల్లో నివసించే చెంచులను అడవిచెంచులు లేదా కొండచెంచులు అని పిలుస్తారు. ఊర చెంచులు అనేవారు గ్రామాల్లో తిరుగుతూ.. భిక్షాటన చేస్తారు. వీరినే కృష్ణ చెంచులు లేక చెంచుదాసరులు అంటారు. వీరు ఓ ప్రత్యేకమైన వేషధారణతో గంట(లోహపు పలక) వాయిస్తూ.. గ్రామస్థులు ఇచ్చిన బట్టలు, పెట్టిన భోజనంతో జీవిస్తూ ఉంటారు. ఆధునిక కాలంలో అడవిచెంచులు, ఊర చెంచులలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పూర్తిగా అడవుల్లో నివసించేవారి పరిస్థితి ఇప్పటికీ దయనీయంగానే వుంది. అయితే అడవి చెంచులు మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తారు. బక్కపలచగా, పొట్టిగా, చెదిరిన ఉంగరాల జట్టు, అమాయకపు ముఖం, సప్పిడి ముక్కు, నలుపు లేక రాగిరంగు చర్మంతో ప్రస్పుటమైన ఆకారంలో చెంచులు వుంటారు. ఆహార సేకరణ దశలో ఉన్నందు వల్ల వీరి కుటుంబాలు చిన్నవిగా వుంటాయి. భార్య, భర్త, చిన్నపిల్లలు, సాయంగా కుక్కతో సంచరిస్తుంటారు.

చెంచుల్లో ఆడపిల్లకు వోలి ఇచ్చే ఆచారం ఉంది. పెండ్లిలో ఆర్బాటాలు కూడా కనిపించవు. ఉన్నంతలో ఆడుతూ పాడుతూ సంతోషకంగా గడుపుతారు. ఇంటిపేరు, గోత్రం పరిగణలోకి తీసుకుని వివాహాలు చేసుకుంటారు. చెంచులకు 26 గోత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. అర్తి(అరటి), నిమ్మల(నిమ్మచెట్టు), కుడుముల (వంటకం), పులచెర్ల (పెద్దపులి), ఉడతల (ఉడత), తోకల(తోక), మేకల (మేక), ఉత్తలూరి లాంటి ఇంటిపేర్లు ఉన్నాయి. అలాగే చెంచుల ఆచారాలు, సంప్రదాయాలు వారి ఆదిమ సంస్కృతికి చిహ్నంగా వుంటాయి. వారు ప్రకృతి దగ్గరగా జీవించడం వల్ల పెళ్లి, చావు వంటివి దానికి తగినట్లు ఉంటాయి. బంకచెట్లు, చింతచెట్లు తదితర ఫలసాయాన్ని ఇచ్చే చెట్లన్నీ సామాజిక ఆస్తి కింద అనుభవిస్తారు. చెంచుల్లో కుల పంచాయతీ బలంగా వుంటుంది. తెగ ఆచారాలు పాటించని వారికి జరిమానాలు విధించడం, కొన్నిసార్లు వెలి వెయ్యడం వంటి తీర్పులు ఇస్తుంటారు.

నల్లమలలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చెంచుల మూలాలు

చెంచుల మతాచారాలు చాలా సరళంగా ఉంటాయి. తమ తెగ దైవాలైన మైసమ్మ, యాదమ్మ, గురవయ్యలను వారు పూజించేవారు. జాతలను కూడా నిర్వహించేవారు. అయితే నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, అహోబిలం దేవాలయాల స్థలపురాణాల్లో చెంచుల గురించి ఎన్నో వివరాలు ఉన్నాయి. చెంచు మల్లన్నే మొట్టమొదటి దేవుడని అంటారు. మల్లన్న అనే పేరే సంస్కృతీకరించబడి మల్లికార్జునుడు అయిందంటారు. శ్రీశైలంలో ఉన్న వృద్ధ మల్లికార్జునుడే చెంచు మల్లన్న అని కొందరి నమ్మకం. తొలుత చెంచులే శ్రీశైలంలో పూజారులుగా ఉండేవారు. అయితే కాలక్రమంలో మల్లికార్జునుడి ఆలయంలో శైవపూజారులు, భ్రమరాంబ దేవాలయంలో వైష్ణవ పూజారులు వచ్చి చెంచులను బయటికి పంపారనే కథనం వుంది. ఆ తర్వాత శ్రీశైలంలో జరిగే ఉత్సవాల్లో రథాన్ని లాగడం, దివిటీలు మోయ్యడం, శివుడి పూజలో ఉపయోగించే మారేడు ఆకులను తీసుకురావడం వంటి పనులకు చెంచులను ఉపయోగించేవారు. శ్రీశైలం ఆలయ ప్రాకారంపై చెంచులు వేటాడుతున్నట్లు ఉన్న శిల్పాలు చూస్తే శ్రీశైలంతో చెంచులకు వున్న అనుబంధం తెలుస్తుంది. నేటికి శ్రీశైలంలో చెంచు సంప్రదాయాలతో సంక్రాంతి పర్వదినం రోజున మల్లన్నకు కళ్యాణోత్సవానికి నిర్వహిస్తారు. శ్రీశైలంకు రోడ్డు లేని రోజుల్లో అడవిమార్గంలో వచ్చే భక్తులకు చెంచులే సాయం చేసేవారని బ్రిటీష్‌ రికార్డుల్లో ఉంది. అహోబిలం క్షేత్ర చరిత్రలో కూడా చెంచుల ప్రస్తావన వుంది. హిరణ్యకశిపుని సంహారం తర్వాత ఉగ్రనరసింహుడిని లక్ష్మీదేవి చెంచిత రూపంలో వచ్చి శాంతింపజేసిందని అంటారు.  అహోబిలంలో కూడా అర్చకులుగా చెంచులే వ్యవహరించేవారని అంటారు. చెంచు జాతి గురించి పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్రలో ప్రస్తావన ఉంది.

ఆనవాయితీగా ఆదివాసీ దినోత్సవం

ప్రపంచ వ్యాప్తంగా ఆదిమ జాతులు అంతరించి పోకుండా కాపాడటానికి ఐక్యరాజ్యసమితి 1994లో ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ప్రకటించింది. ఇందులో భాగంగా 1997లో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు, హక్కులను ప్రసాదించేందుకు ప్రపంచదేశాల ప్రతినిధులతో తీర్మానానికి ఆహ్వానించింది. సుమారు 143 ఐరాస సభ్యదేశాలు ఈ ఓటింగ్‌లో పాల్గొనగా 125 దేశాల ప్రతినిధులు తీర్మానాన్ని ఆమోదించారు. మరో 14 మంది తటస్థ వైఖరి తెలపగా నాలుగు దేశాలు వ్యతిరేకించాయి. అప్పటి నుంచి గిరిజనుల హక్కులు, వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-08-09T05:28:08+05:30 IST