ఆయనకు ‘ఎమ్మెల్యే పదవి’ కొత్తకాదు..ఆ పార్టీ ఎలా ఉపయోగించుకోనుంది..?

ABN , First Publish Date - 2021-11-13T17:43:55+05:30 IST

హుజురాబాద్‌ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌ ప్రమాణ స్వీకారం చేయడంతో అసెంబ్లీలో ఆయన నిర్వహించే పాత్ర ఏంటనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిని రెకిత్తిస్తోంది. శాసన సభ్యత్వం అనేది ఆయనకు కొత్తకాదు. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా,

ఆయనకు ‘ఎమ్మెల్యే పదవి’ కొత్తకాదు..ఆ పార్టీ ఎలా ఉపయోగించుకోనుంది..?

ఎమ్మెల్యే పదవి ఆయనకు కొత్త కాదు. ప్రత్యేక పరిస్థితుల్లో గెలిచిన ఆయన్ని ఇటు శాసనసభలో, అటు ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ  ఎలా ఉపయోగించుకోనుంది? పార్టీలో ఆయన పాత్రపై కొత్త చర్చకు బలం చేకూర్చుతున్న అంశాలేంటి? అనే విషయాలు  ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


సీనియర్‌ ఎమ్మెల్యే ఈటలను బీజేపీ ఎలా ఉపయోగించుకోనుంది?   

హుజురాబాద్‌ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌ ప్రమాణ స్వీకారం చేయడంతో అసెంబ్లీలో ఆయన నిర్వహించే పాత్ర ఏంటనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిని రెకిత్తిస్తోంది. శాసన సభ్యత్వం అనేది ఆయనకు కొత్తకాదు. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా, మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఉమ్మడి ఏపీలో రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌ రెడ్డి మాటల తూటాలకు తట్టుకుని నిలబడ్డ గట్టి పిండం ఈటల అని తెలంగాణ సమాజంలో ఆయనకు పేరుంది. తన రాజకీయ అనుభవంలో అటు అధికారపార్టీ నేతగా, ఇటు ప్రతిపక్షశాసనసభపార్టీ నేతగా అసెంబ్లీలో తన వాయిస్‌ వినిపించారు. పుట్టి పెరిగిన పార్టీ టీఆర్‌ఎస్‌కు దూరమైన ఈటలను తన కొత్త పార్టీ బీజేపీ ఎలా ఉపయోగించుకోనుందనే చర్చ రాజకీయవర్గాల్లో, ముఖ్యంగా కమలందళంలో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.


ఈటల బీజేఎల్పీ నేత అవుతారా? 

2018 సాధారణ ఎన్నికల్లో ఒకే ఒక శాసనసభ్యుడిని గెలిపించుకోగలిగిన బీజేపీ ఉప ఎన్నికల్లో సత్తా చాటుతూ బలం పెంచుకుంటోంది. రెండుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన గోషామహల్‌ శాసనసభ్యుడు రాజాసింగ్‌ ప్రస్తుతం ఆ పార్టీ శాసనసభాపక్షనేతగా వ్యవహరిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు బీజేపీ తరఫున గెలిచిన సమయంలో ఆయనకు బీజేఎల్పీ నేతగా అవకాశం వస్తుందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ గెలుపొందడంతో బీజేఎల్పీ నేతగా ఆయన్ను నియమిస్తారా అనే చర్చ కాషాయపార్టీలో వినిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.


మంత్రిగా పనిచేసిన ఈటలకు మాస్‌ లీడర్‌గా పేరు 

ఉప ఎన్నికల్లో అధికారపార్టీ సిట్టింగ్‌ సీట్లను గెలుస్తూవస్తున్న బీజేపీ రాబోయేది తమ ప్రభుత్వమే అనే ధీమాలో ఉంది. టీఆర్‌ఎస్‌ బలాలు, బలహీనతలు తెలిసిన నేతలుగా రఘునందన్‌రావుకు, ఈటల రాజేందర్‌కు పేరుంది. అడ్వొకేట్‌గా, మాటకారిగా పేరున్న రఘునందన్‌రావు తన లాజిక్‌ పాయింట్లతో అధికారపార్టీని తెలివిగా ఇరుకునపెడుతుంటారని బీజేపీ భావిస్తోంది. ఈటల రాజేందర్‌కు ఇప్పుడున్న బీజేపీ శాసనసభ్యుల్లో మిగతావారికంటే రాజకీయ అనుభవం అపారం. ప్రతిపక్షపాత్ర ఆయనకు కొత్తకాదు. మంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రభుత్వంలో ఉండే లొసుగులేంటో ఆయనకు బాగా తెలుసు. మాస్‌ లీడర్‌గా ఆయనకు పేరు. బీసీ నేతగా ప్రొజెక్ట్‌ అయిన నాయకుడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేరుగా ఢీకొట్టి అసెంబ్లీలో అడుగుపెట్టిన నేతగా ఈటలకు ఉన్న ఇమేజ్‌ను మరింత పెంచేందుకు బీజేపీ ఆయన్ని ఎలా గౌరవించి సేవలను ఉపయోగించుకుంటుందనే చర్చ విస్తృతమవుతోంది.


కేసీఆర్‌ ఎత్తులను ఈటల చిత్తు చేస్తారనే టాక్‌ 

అసెంబ్లీలో సీనియర్‌ అయిన ఈటల ఏడుసార్లు శాసనసభ్యుడిగా గెలిచారు.  అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి కేసీఆర్ ఎత్తుల‌కు పైఎత్తులు వేసిన ఈటల‌ బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. టీఆర్ఎస్ వైఫ‌ల్యాల‌ను శాసనసభలో ఎండ‌గ‌ట్టాలంటే అనుభవంతో‌ పాటు.. ఉద్యమకారుడు  అయిన ఈటల శాసనసభాపక్షనేత అయితే బాగుంటుదనే చర్చ ఓ వర్గంలో బలంగా వినిపిస్తోంది. తను మంత్రివర్గం నుంచి బహిష్కరించిన ఈటలను అసెంబ్లీలో చూడరాదని కేసీఆర్‌ భావించారు.  చరిత్రలో ఎన్నడు లేనంత ఖర్చుతో జరిగిన ఎన్నికల్లో అధికారపార్టీకి ఎదురునిలిచి గెలిచిన ఈటలతోనే కేసీఆర్‌ను సభలో ఇరుకున పెట్టాలంటే ఆయనకు ఎల్పీ పోస్ట్‌ ఇస్తేనే బాగుటుందనే చర్చ పార్టీలో జరుగుతున్నట్లు బయటకు వస్తున్న సమాచారం. 


వ్యూహానికి తగ్గట్లు నేతలను ఉపయోగించుకోవడంలో బీజేపీ నెం.1 

ఈటల ఇప్పుడున్నది జాతీయపార్టీలో. పరిస్థితులకు తగ్గట్లు పార్టీలో పదవులు అడ్జస్ట్‌ చేయడంలో బీజేపీ ముందుంటుంది. కొత్త, పాత అనే తేడా లేకుండా పార్టీలోనూ, సభల్లోనూ తన పరిధిపెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వం ఎత్తులను గమనిస్తున్న విశ్లేషకులు ఎవరికి ఎలాంటి పదవులిచ్చి తన బలం పెంచుకుంటుందనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముందని అంటున్నారు.

Updated Date - 2021-11-13T17:43:55+05:30 IST