మొదలైన పశ్చిమ రాయలసీమ టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి

ABN , First Publish Date - 2022-08-11T05:22:12+05:30 IST

పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి ఆశావహులు భారీగానే దిగనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

మొదలైన పశ్చిమ రాయలసీమ టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి

పెద్దల సభకు వెళ్లేందుకు ఆశావహుల తహతహ

నేరుగా టీచర్లు, సంఘాల నేతల ఇళ్ల వద్దకు..

ఏడాది ముందు నుంచే కార్యక్షేత్రంలోకి..

వైసీపీ నుంచి ద్విముుఖ పోరు 

లక్‌ టెస్ట్‌ కోసం బరిలోకి ఓ కార్పొరేటర్‌

నేను సైతం అంటూ మరో డాక్టర్‌ బాబు

ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు?

కాసులిచ్చే వారికి ఎరవేస్తున్న కొన్ని సంఘాలు 


అనంతపురం విద్య, ఆగస్టు 10: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి ఆశావహులు భారీగానే దిగనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఏడాది ముందు నుంచే ఆశావహులు రంగంలోకి దిగి ప్రచారం ముమ్మరం చేశారు. ఇటీవల కాలంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులను వేర్వేరుగా ఇళ్ల వద్ద కలుస్తూ ప్రసన్నం చేసుకోవడానికి ఆశావహ అభ్యర్థులు తెగ ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఓ కార్పొరేటర్‌ కూడా భారీగా ట్రై చేస్తున్నారు.  ఇప్పటికే వైఎ్‌సఆర్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ నాయకుడు ఎమ్మెల్సీ జపం చేస్తుంటే...తాజాగా మరో కార్పొరేటర్‌ రంగంలోకి దిగాడు. దీంతో ఆ యూనియన్‌లో రెండు వర్గాలు చెరో నాయకుడి వెంట నడుస్తున్నాయి. ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకులతోపాటు ఇటీవల మరో డాక్టర్‌ బాబు సైతం నేనూ సై అంటూ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన ఫారిన్‌ రిటర్న్‌ కావ డంతో, కాసులు బాగానే ఉండటంతో కొన్ని బలమైన సంఘాలు ఆయనను ప్రమోట్‌ చేస్తున్నట్లు సమాచారం. ఆయన కూడా ఓటుకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు సమర్పించుకుంటాడంటూ ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎన్నికలకు మరో ఆరు నెలలే ఉండటంతో వేడి రాజుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ మండలి ఎన్నికలు ట్రయల్స్‌గా మారనున్నాయి. గత ఏడాది రాజకీయ పార్టీలు టీచర్స్‌ ఎమ్మెల్సీకి అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ దఫా వైసీపీ నుంచి కూడా అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది.  


ఉపాధ్యాయుల్లో ఎన్నికల వేడి

పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. 2017లో ఎన్నికలు నిర్వహించారు. వచ్చే ఏడాది అంటే 2023 మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఏడాది కిందట నుంచే ఉపాధ్యాయుల్లో ఎన్నికల సెగ రేగింది. కొందరు ఆశావహ అభ్యర్థులు ఏడాది నుంచే ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగడుతూ ముందుకు కదులుతున్నారు. కొందరు ఎన్నికల స్టంట్‌ కోసం కొత్తగా అభ్యర్థుల గెటప్‌ వేసుకుంటున్నారు. మరికొందరు తమ సంఘంలో 1000 మంది, మా సంఘంలో 3 వేల మంది టీచర్లు ఉన్నారని కొందరు, అన్నింటి కంటే మాదే పెద్ద సంఘం అంటూ మరికొందరు కొత్తగా నేతల అవతారం ఎత్తి కాసులు కురిపించే వారికి ఎరవేస్తూ...లక్షలు గుంజేందుకు సిద్ధమవుతున్నారు.  


అధికార పార్టీ నుంచే అధికంగా ఆశావహులు

వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2017 ఎన్నికల్లో అనంతపురం, కడప, కర్నూలు నుంచే 10 మంది వరకూ బరిలో నిలిచారు. ఈ దఫా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పార్టీల నుంచి ప్రాతినిథ్యం తక్కువగా ఉండేది. ఈ సారి రెండు ప్రధాన పార్టీల నుంచి కూడా భారీగానే ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. జిల్లా నుంచే ఇద్దరు, ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. వైఎ్‌సఆర్‌ టీఎ్‌ఫలోని రాష్ట్ర నాయకుడు ఒకరు భారీగా ట్రై చేస్తున్నారు. తానే నిజమైన ‘జగనన్న సైనికుడు’ అంటూ ఆయన ఇప్పటికే ఒక వాహ నం తీసుకుని తిరుగుతున్నారు. తనను అభ్యర్థిగా ప్రకటిం చాలంటూ సీఎం సతీమణి వైఎస్‌ భారతి, విజయసాయి రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల ఇలా కనిపించిన పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తనకు సపోర్ట్‌ చేయాలంటూ టీచర్లను కూడగట్టేపనిలో పడ్డారు.  మరొకరు  కూడా ఇటీవల ఎన్నికల రోడ్డెక్కారు. ప్రస్తుతం ఆయన అనంతపురం నగర పాలక సంస్థ పాలకవర్గంలో సభ్యుడు ఆయన. కార్పొరేటర్‌గా గెలిచిన ఆయన  మేయర్‌ రేస్‌లో నిలిచి భంగపడ్డాడు. ఇప్పుడు తన లక్‌ పరీ క్షించుకోడానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నిలిచేందుకు సిద్ధమయ్యాడు. గత కొన్నేళ్లుగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం కారణంగా టీచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, సజ్జలను, బొత్స సత్యనారాయణను కలిసి దరఖాస్తులు ఇచ్చారు. వైఎ్‌సఆర్‌టీఎఫ్‌, ఇతర సంఘాల నాయకులతో వెళ్లి పార్టీ పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తలుపుల ప్రాంతం నుంచి ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న మరో నాయకుడు కూడా బరిలో ఉన్నట్లు సమాచారం. 


డాక్టర్‌ బాబును పట్టుకొచ్చిన సంఘాలు

జిల్లాలోని ఓ బలమైన ఉపాధ్యాయ సంఘంతోపాటు మరో సంఘం నేతలు ఓ డాక్టర్‌ బాబును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తాడిపత్రి ప్రాంతంలో ఆయనకంటూ కొంత పేరుండటంతోపాటు ఫారిన్‌ రిటర్న్‌ అయిన ఆ డాక్టర్‌ను టీచర్స్‌ ఎమ్మెల్సీ బరిలో నిలిచేలా కొన్ని సంఘాల నాయకులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండటంతో ఓ సంఘం భారీగా ఆ డాక్టర్‌ బాబుకు సపోర్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమ సంఘం అవ సరాలకు కూడా రూ. 2 లక్షలు ఇప్పటికే లాగేశారంటూ ఉపాధ్యాయ సంఘాల్లో చర్చ సాగుతోంది.  ఇలా జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్తగా పలువురు ఆశావహులు అనూహ్యంగా తెరపైకి వస్తున్నారు. 


అధికార పార్టీ అభ్యర్థులకు చెమటలే!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచే అభ్యర్థులకు ప్రధానంగా అధికార పార్టీ అభ్యర్థులకు కానీ, వైసీపీ బలపర్చిన అభ్యర్థులకు కానీ ముచ్చెమటలు తప్పవంటూ ఉపాధ్యా యుల నుంచి సంఘాల నేతల నుంచి హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు అనేక కారణాలూ ఉన్నాయి. గత రెండేళ్లుగా ప్రభుత్వం ఉపాధ్యాయ, విద్యారంగ వ్యతిరేక విధానాలను ఎక్కువ తీసుకుంటోందన్న విమర్శలు మూటగట్టుకుంది.  టీచర్లే టార్గెట్‌గా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ గురువులు గుర్రుగా ఉన్నారు. దీంతో అధికార ముద్ర ఉన్న అభ్యర్థులుగా ఎవరు బరిలో నిలిచినా వారికి సర్కారుపై ఉన్న వ్యతిరేకత ఘాటు తప్పదన్న వాదనలు మెజార్టీ టీచర్ల నుంచి సంఘాల నేతల నుంచి వినిపిస్తున్నాయి. వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థులకు భంగపాటేనంటూ జోస్యం చెబుతున్నారు.


Updated Date - 2022-08-11T05:22:12+05:30 IST