TS News: ఈటలకు దమ్ముంటే చర్చకు రావాలి: కౌశిక్ రెడ్డి

ABN , First Publish Date - 2022-08-05T16:24:37+05:30 IST

హుజూరాబాద్‌ నియోజకవర్గం సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తుతోంది.

TS News: ఈటలకు దమ్ముంటే చర్చకు రావాలి: కౌశిక్ రెడ్డి

కరీంనగర్ (Karimnagar): హుజూరాబాద్‌ నియోజకవర్గం సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తుతోంది. అభివృద్ధిపై చర్చకు రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి (Kaushik Reddy) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etala Rajendar)కు సవాల్‌ విసిరారు. ఈటెలకు దమ్మూ, ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు. ఆయన హుజురాబాద్‌లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. చర్చకు రమ్మంటే అల్లర్లు అని మాట్లాడుతున్నారని కౌశిక్‌ రెడ్డి విమర్శించారు. దీనికి ప్రతిగా బీజేపీ నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి తమ వాదన వినిపించారు. ఈ అంశంపై జెండాలు, ఫ్లెక్సీలు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా ఏర్పాటు చేశారు. 


గురువారం హుజూరాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గొడవకు దిగారు. చర్చకు ఒకరోజు ముందే టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు బలాబలాలు ప్రదర్శించుకుంటూ కర్రలతో ఘర్షణకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున హుజూరాబాద్‌కు తరలివచ్చే అవకాశం ఉంది. అటు టీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ వేల సంఖ్యలో శ్రేణులను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయని చర్చించుకుంటున్నారు. ఈటలకు సవాల్‌ విసిరిన కౌశిక్‌ రెడ్డి వారం రోజుల నుంచే చర్చ జరిగే స్థలానికి పెద్ద ఎత్తున జనాన్ని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని, కనీసం 10 వేల మందిని తరలించాలని ఆయన వివిధ మండలాల నాయకులకు సూచించి అందుకు ఏర్పాట్లు చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  ఆయన హుజూరాబాద్‌లో అభివృద్ధిపై చర్చకు రండి అంటూ ఈటలకు సవాల్‌ విసురుతున్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీని ప్రతిగా బీజేపీ నాయకులు కూడా కౌశిక్‌ రెడ్డిని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మానుకొండలో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు రువ్విన ఉద్యమ ద్రోహి కౌశిక్‌ రెడ్డి అని, ఉద్యమకారులకు, ఉద్యమ ద్రోహులకు మధ్య చర్చనా అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ఈటల పుణ్యంతోనే ఎమ్మెల్సీ పదవి అనుభవిస్తున్న కౌశిక్‌రెడ్డికి ఈటలతో బహిరంగ చర్చకు అర్హత లేదని, ఆయన రాజకీయ అనుభవమంత వయస్సు కూడా కౌశిక్‌ రెడ్డికి లేదని పేర్కొంటూ మీతో చర్చించేందుకు మేము సిద్ధం, మేం సరిపోతాం అంటూ కార్యకర్తలు పలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-08-05T16:24:37+05:30 IST