Abn logo
Jul 30 2021 @ 18:18PM

ఈటల రాజేందర్‌కు స్వల్ప అస్వస్థత

కరీంనగర్: మాజీమంత్రి ఈటల రాజేందర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. బీపీ పడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని వైద్యులు తెలిపారు. దీంతో ప్రజాదీవెన పాదయాత్రకు ఈటల విరామం ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం రెండు గ్రామాల్లో ఈటల సతీమణి జమున పాదయాత్ర చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈటల పాదయాత్ర శుక్రవారానికి 12వ రోజుకు చేరింది. ఈ రోజు పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాల్లో ఆయన పర్యటించారు. పాదయాత్రలోనే కొండపాక వద్ద ఆయన అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా కాళ్లకు పొక్కులు, జ్వరం రావడంతో పాదయాత్రలో ఇబ్బంది పడుతున్నారు. వారం రోజుల నుంచి మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ నెల 19న హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం నుంచి రాజేందర్ ప్రజా దీవెన యాత్రను ప్రారంభించారు. నియోజకవర్గంలో 23 రోజులపాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో.. 270 కిలోమీటర్ల దూరం ఈటల పాదయాత్ర చేయాలని రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 222 కిలో మీటర్లు వరకు పాదయాత్ర సాగింది.