మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గితే ఏమవుతుంది..?

ABN , First Publish Date - 2022-04-14T17:06:24+05:30 IST

ఈస్ట్రోజన్ మోతాదు తగ్గడం మూలంగా కనిపిస్తున్న లక్షణాలను మహిళలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.

మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గితే ఏమవుతుంది..?

ఆంధ్రజ్యోతి(14-04-2022)

ఈస్ట్రోజన్ మోతాదు తగ్గడం మూలంగా కనిపిస్తున్న లక్షణాలను మహిళలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ హార్మోన్ హెచ్చుతగ్గులకు లోనైతే భావోద్వేగాల మీద నియంత్రణ కోల్పోతారు. మరెన్నో లక్షణాలు వేధిస్తాయి. కాబట్టి వాటి మీద ఓ కన్నేసి ఉంచాలి. 


నెలసరి మాయం: నెలసరి రాలేదంటే ఈస్ట్రోజన్  హార్మోన్‌నే అనుమానించాలి. ఈ హార్మోన్ తగ్గితే, అతి తక్కువ నెలసరి స్రావం కనిపించడం లేదా పూర్తిగా కనిపించకుండాపోవడం జరుగుతుంది. 


మూడ్ స్వింగ్స్: ఈస్ట్రోజన్ తగ్గితే, నిస్సత్తువకు లోనవుతారు. ఒత్తిడి, తెలియని ఆందోళనలు వేధిస్తాయి. 


డిప్రెషన్: ఈ హ్యాపినెస్ హార్మోన్ లోపిస్తే, అకారణంగా ఏడుపు రావడం, దు:ఖంలో కూరుకుపోవడం లాంటివీ ఉంటాయి.  


నిద్రలేమి: ఆ హార్మోన్ తగ్గితే కంటి నిండా నిద్ర కరువవుతుంది. నిస్సత్తువ, బడలికలు వేధిస్తాయి. 


కళ్లు పొడిబారడం: ఈస్ట్రోజన్ తగ్గిత, శరీరం ఉత్పత్తి చేసే కన్నీళ్ల పరిమాణం కూడా తగ్గుతుంది. అలాగే కళ్లలోని తేమ కూడా.


పొడి చర్మం: చర్మపు తేమను నిలిపి ఉంచే ఈస్ట్రోజన్  హార్మోన్ తగ్గితే, చర్మం పొడిబారుతుంది. సహజసిద్ధ ఆమ్లాల తయారీ తగ్గి, చర్మం నిర్జీవంగా తయారవుతుంది.


తలనొప్పి: తరచుగా తలనొప్పులు వేధిస్తాయి. మైగ్రెయిన్ సమస్య పెరుగుతుంది.


వేడి ఆవిర్లు, చమటలు: రాత్రుళ్లు హఠాత్తుగా చమటలు పట్టడం, శరీరం నుంచి వేడి ఆవిర్లు వెలువడడం లాంటి లక్షణాలు వేధిస్తాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడులోని హైపోథలామస్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఆధారంగా పని చేస్తుంది. ఈ హార్మోన్ తగ్గితే, హైపోథలామస్ పనితీరు కూడా తగ్గుతుంది. 


అధిక బరువు: శరీరం బరువు పెరుగుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. 


Updated Date - 2022-04-14T17:06:24+05:30 IST