Abn logo
Jul 8 2020 @ 06:17AM

పేరొకటి..ఊరొకటి!

నేతలకు నచ్చిన చోట సచివాలయాల ఏర్పాటు

మంజూరు ఒక చోట.. నిర్వహణ మరో చోట

సాంకేతిక కారణాలతోనూ ఇతర చోట్ల నుంచి పాలన

కొండశిఖర సచివాలయాలకు వెళ్లని సిబ్బంది


ప్రజల ముంగిటకే పాలన అంటూ ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది.  కొన్ని పంచాయతీల్లో నిబంధనలకు దూరంగా సచివాలయాలను ఏర్పాటు చేశారు. నేతలకు నచ్చిన చోట ఏర్పాటు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. మంజూరు ఒకచోట...  భవన నిర్మాణం మరో చోట చేపట్టారు. సాంకేతిక కారణాలు చూపి కూడా కొన్ని పంచాయతీల్లో నచ్చిన ప్రదేశాల్లో సచివాలయాలను ప్రారంభించారు. దీనివల్ల వివిధ పనుల కోసం వెళ్లే ప్రజలకు దూరాభారం అవుతోంది. ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడుతోంది. 


(విజయనగరం- ఆంధ్రజ్యోతి): ప్రజలకు సమీపంలో ఉండాల్సిన సచివాలయాలను కొన్ని గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేశారు. మంజూరైన గ్రామంలో కాకుండా వేరే చోట నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని చోట్ల సాంకేతిక కారణాలు, నెట్‌ సిగ్నల్స్‌ అందుబాటులో లేవని చెబుతూ తమకు ఇష్టం వచ్చిన చోట నిర్వహిస్తున్నారు. జిల్లాలో 920 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒకటి లేదా రెండు పంచాయతీలను అనుసంధానిస్తూ 664 సచివాలయాలను ఏర్పాటు చేశారు. గుర్తింపు ఉన్న లేదా పెద్ద పంచాయతీగా ఉన్న గ్రామాల పేరున సచివాలయాలు మంజూరయ్యాయి. ప్రధానంగా మండల ప్రాదేశిక నియోజకవర్గంగా గుర్తించిన గ్రామాల్లో సచివాలయాలను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల రాజకీయ కారణాల రీత్యా పేరు ఒక చోట... నిర్వహణ మరో చోటగా ఉంటోంది. ఇదంతా తెలిసినా అధికారులు ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు. 


గరుగుబిల్లి మండలం కొత్తూరు, సివ్వాం పంచాయతీలకు కలిపి కొత్తూరు గ్రామ సచివాలయం మంజూరు చేశారు. కొద్ది నెలల పాటు పంచాయతీ కార్యాలయంలోనే పాలన సాగింది. తరువాత మార్పు చేశారు. ఇదే సచివాలయ పరిధిలోని శివ్వాం గ్రామానికి పరిపాలనను మార్చారు. దీనికి కారణం కొత్తూరు గ్రామం తెలుగు దేశం పార్టీకి కంచుకోటగా ఉండటమేనని సమాచారం. ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు చెబుతూ  పార్టీ కారణాలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. కలెక్టరేట్‌ స్పందనలో సైతం వినతులు అందించారు. ఇటువంటి పరిస్థితులు అనేక గ్రామాల్లో ఉన్నాయి. 


ఇంకొన్ని చోట్ల సాంకేతిక కారణాలు చూపిస్తున్నారు. కురుపాం మండలం పూసకొండలో నిర్వహించాల్సిన సచివాలయాన్ని పొడ్డిశ గ్రామంలో నిర్వహిస్తున్నారు. 


కొమరాడ మండలం కొంతేసు గిరిజన గ్రామంలో నిర్వహించాల్సిన సచివాలయాన్ని మండల కేంద్ర సమీపంలో నిర్వహిస్తున్నారు. 


పూడేసు, పెదశాఖ సచివాలయాలను ప్రధాన రోడ్డులో ఉన్న కూనేరు సచివాలయంలో నిర్వహిస్తున్నారు. 


నయ గ్రామ సచివాలయాన్ని చినకేర్జలలో ఏర్పాటు చేశారు. ఇలా ఒక చోట మంజూరైతే మరో చోట సచివాలయాలను ప్రారంభించారు. 


 మైదాన ప్రాంతాల్లోనే విధులు

ఏజెన్సీ ప్రాంతాల్లోని సచివాలయాల విషయానికి వస్తే నెట్‌ సిగ్నల్స్‌ ఉండటం లేదని చెబుతూ మైదాన ప్రాంతాల్లో  సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నెట్‌ కనెక్షన్‌ లేనట్లయితే ప్రత్యామ్నాయంగా డిజిటల్‌ అసిస్టెంట్‌ను మాత్రమే మరో చోటుకు మార్చే వీలుంది. మిగిలిన ఉద్యోగులు గ్రామ సచివాలయాలకు వెళ్లి అక్కడి సమస్యలు, చేయాల్సిన విధులను పూర్తి చేసి డేటా ఎంట్రీ అవసరం ఏర్పడినప్పుడు నెట్‌ సిగ్నల్స్‌ ఉన్న చోట ఏర్పాటు చేసిన డిజిటల్‌ అసిస్టెంట్‌కు అప్పగించవచ్చునన్న వాదన ఉంది.


అలా కాకుండా మొత్తం సిబ్బంది మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సచివాలయ కేంద్రాల్లోనే కూర్చుంటున్నారు. వారానికి ఒకసారి కూడా సచివాలయం ఉండే గ్రామాలకు వెళ్లడం లేదు. ఏదైనా సమాచారం కావాలంటే వలంటీర్ల ద్వారా తెలుసుకుంటూ మైదాన ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఈ పరిస్థితి సబ్‌ప్లాన్‌లోని కొండశిఖర పంచాయతీలన్నింటా కనిపిస్తోంది. ఈ సమస్యలక పరిష్కారం చూపి ప్రజలకు దగ్గరలో సచివాలయ సిబ్బంది ఉండేలా చూడాలని గిరిజన గ్రామాల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement