దశాబ్దాలుగా కలే!

ABN , First Publish Date - 2022-08-07T04:38:15+05:30 IST

నర్సింగ్‌ కాలేజీ కోసం జిల్లా వాసులకు ఎదురుచూపులు తప్పడం లేదు. దశాబ్ద కాలం నాటి కిందట అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్వతీపురంలో నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది. స్వల్ప వ్యవధి కోర్సులతో పాటు బీఎస్సీ నర్సింగ్‌

దశాబ్దాలుగా కలే!
పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రి

కార్యరూపం దాల్చని నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు

విద్యార్థులకు తప్పని ఎదురుచూపులు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు

(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి)

నర్సింగ్‌ కాలేజీ కోసం జిల్లా వాసులకు ఎదురుచూపులు తప్పడం లేదు. దశాబ్ద కాలం నాటి కిందట అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్వతీపురంలో నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది. స్వల్ప వ్యవధి కోర్సులతో పాటు బీఎస్సీ నర్సింగ్‌ వంటివి అందుబాటులో తేనున్నట్టు అప్పటి పాలకులు చెప్పుకొచ్చారు. కానీ దశాబ్ద కాలం దాటుతున్నా ఇది కార్యరూపం దాల్చలేదు. పునర్విభజనతో పార్వతీపురం మన్యం జిల్లా కొత్తగా ఏర్పాటైంది. కానీ నర్సింగ్‌ కాలేజీ విషయంలో ఎటువంటి కదలిక లేదు. దీంతో జిల్లా వాసులకు నిరాశ తప్పడం లేదు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను కలుపుతూ జిల్లాను ఏర్పాటుచేశారు. 15 మండలాలు, 2 పురపాలక సంఘాలు, ఒక నగర పంచాయతీతో జిల్లా రూపుదిద్దుకుంది. వెనుకబాటును దృష్టిలో పెట్టుకొని జిల్లాను ఏర్పాటుచేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ దిశగా ఎటువంటి కార్యాచరణ లేదు. 

అభ్యర్థులకు వ్యయప్రయాసలు

జిల్లాలో వేలాది మంది విద్యార్థులు నర్సింగ్‌ విద్య కోసం సుదూర ప్రాంతాలు వెళుతున్నారు. ప్రైవేటు కాలేజీలను ఆశ్రయిస్తున్నారు. అధిక ఫీజులు ఇచ్చి కోర్సులు పూర్తిచేస్తున్నారు. ఐటీడీఏ పరిధిలో గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి శిక్షణనిస్తున్నారు. ఇటువంటి వారిని ఎంపిక చేసి ఇతర ప్రాంతాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. అదే స్థానికంగా నర్సింగ్‌ కాలేజీ ఉంటే ఇక్కడే కోర్సులు అందుబాటులోకి వచ్చేవి. అభ్యర్థులకు వ్యయప్రయాసలు తప్పేవి. కానీ పాలకులు ఆ దిశగా ఆలోచించకపోవడం విమర్శలకు తావిస్తోంది. శిక్షణలో భాగంగా అప్రంటీస్‌లో వైద్యసేవలందించాల్సి ఉంటుంది. పార్వతీపురం కేంద్రంగా జిల్లా కేంద్రాసుపతి, సాలూరు, చినమేరంగి, భద్రగిరి, కురుపాం కేంద్రాలుగా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు (సీహెచ్‌సీ) ఉన్నాయి. వీటి పరిధిలో రోగులకు సేవలందించేందుకు నర్సింగ్‌ విద్యార్ధినులు ఎంతో ఉపయోగపడతారు. వారి చదువులో భాగంగా ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించడం ఒక విభాగంగా చెప్పవచ్చు. సిబ్బంది కొరతతో ఉన్న ఆస్పత్రులకు ఇదో మంచి అవకాశం. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలిక లేదు. త్వరలో జిల్లా కేంద్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకానున్న నేపథ్యంలో నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు ఆవశ్యకతపై దృష్టిపెట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.



Updated Date - 2022-08-07T04:38:15+05:30 IST