గ్రామస్థాయిలో కరోనా కట్టడికి కమిటీల ఏర్పాటు

ABN , First Publish Date - 2021-04-21T05:26:54+05:30 IST

మండలంలో రెండో విడత కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో మండలస్థాయి, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు ద్వారా కరోనా కట్టడికి అధికారులు కమిటీలు ఏర్పాటు చేశారు.

గ్రామస్థాయిలో కరోనా కట్టడికి కమిటీల ఏర్పాటు
మదీనా మసీదు సర్కిల్‌లో మాట్లాడుతున్న సీఐ

గోరంట్ల, ఏప్రిల్‌ 20 : మండలంలో రెండో విడత కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో మండలస్థాయి, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు ద్వారా కరోనా కట్టడికి అధికారులు కమిటీలు ఏర్పాటు చేశారు. గోరంట్ల తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశానికి తహసీల్దార్‌ రామాంజినరెడ్డి, ఎంపీడీఓ అంజినప్ప, వీఆర్‌ఓలు, గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మండలస్థాయి కమిటీలో ఎంపీడీఓ నోడల్‌ అధికారిగా తహసీల్దార్‌, ఎస్‌ఐ, మెడికల్‌ ఆఫీసర్‌, ఈఓఆర్డీలు సభ్యులుగా ఉంటారన్నారు. గ్రామస్థాయి కమిటీల్లో నోడల్‌ ఆఫీసర్‌గా కార్యదర్శి, సభ్యులుగా వీఆర్‌ఓ మహిళా పోలీస్‌, ఎఎనఎం, డిజిటల్‌ అసిస్టెంట్‌లు ఉంటారన్నారు. గ్రామస్థాయి కమిటీలు ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ భౌతికదూరం, శానిటైజర్‌ వినియోగం, మాస్కులు వాడకం తప్పనిసరన్నారు. పలు కార్యక్రమాలు, సమావేశాలు నివారించాలన్నారు. ఫ్రంట్‌లైన వర్కర్లు, వలంటీర్లు, హెల్త్‌ అసిస్టెంట్‌లు, అంగనవాడీ సిబ్బంది వీఓ లీడర్లు గ్రామైఖ్య సంగాల ద్వారా కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా అమలయ్యేలా చూడాలని అధికారులు తెలిపారు. గ్రామస్థాయిలో మాస్కు ధరించనివారికి రూ.వంద, మండలస్థాయిలో రూ.500 జరిమానా విధించే అధికారం కార్యదర్శులకు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ జయనాయక్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని మదీనా మసీదు సర్కిల్‌లో సమావేశం నిర్వహించి కరోనాపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఇసాక్‌బాష, పోలీస్‌ సిబ్బంది, పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-21T05:26:54+05:30 IST