Abn logo
Mar 30 2020 @ 03:26AM

నీడ కల్పించారు..!

కూలీలు, డ్రైవర్లకు భోజన, వసతి కేంద్రాల ఏర్పాటు


దివాన్‌చెరువు/రాజానగరం, మార్చి 29: 

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో భోజన, వసతి కల్పన కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. రాజానగరం తహసీల్దార్‌ జి.బాలసుబ్రహ్మణ్యం, సీఐ ఎంవీ సుభాష్‌ ఆదివారం ఈ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ దూరప్రాంతాలనుంచి వచ్చే లారీడ్రైవర్లు, వలస కూలీలకోసం నన్నయ విశ్వవిద్యాలయంలో భోజన, వసతికేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 200మంది ఈ కేంద్రంలో బస చేయవచ్చని చెప్పారు. నన్నయ ప్రాంగణంలో సంబంధితులు తమ లారీలను నిలుపుదల చేసుకుని ఇక్కడ కేంద్రంలో వారు వసతిని, భోజన సదుపాయాన్ని పొందవచ్చని తెలిపారు.


వలస కార్మికులకు లెనోరా షెల్టర్‌

కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికుల కోసం రాజానగరంలోని కేఎల్‌ఆర్‌ లెనోరా దంతవైద్యకళాశాల, ఆస్పత్రిలో షెల్టర్‌ ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్‌ జి.బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆంక్షలను లెక్కచేయకుండా 16వ నెంబరు జాతీయ రహదారి మీదుగా లారీలు, మోటార్‌సైకిళ్లపై ప్రయాణాలు సాగిస్తున్న వారిని నిలుపుదల చేసి లెనోరాలో ఆశ్రయం కల్పిస్తామన్నారు. వీరికి భోజన వసతి కల్పిస్తామన్నారు.

Advertisement
Advertisement
Advertisement