కలిసి ఉద్యమిద్దాం

ABN , First Publish Date - 2022-01-24T05:13:07+05:30 IST

కలిసి ఉద్యమిద్దాం

కలిసి ఉద్యమిద్దాం
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు

- ఏకతాటిపైకి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు

- పీఆర్సీ సాధన సమితిగా ఏర్పాటు

- నేటి నుంచి నిరసన కార్యక్రమాలు

- ఫిబ్రవరి 7 నుంచి సమ్మె

- ఐక్య కార్యాచరణ ప్రకటన

గుజరాతీపేట, జనవరి 23: ‘ఉద్యోగుల సమస్యలపై కలిసి ఉద్యమిద్దాం. ప్రభుత్వం అవలంభిస్తున్న మొండివైఖరిని ఎండగడదాం. ఉద్యోగులను ప్రజల్లో దోషులుగా చిత్రీకరించే ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను తిప్పికొడదాం. అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీ సాధనే లక్ష్యంగా పోరాడుదాం’ అని పీఆర్సీ సాధన సమితి జిల్లా శాఖ పిలుపునిచ్చింది. ఆదివారం శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్‌లో పీఆర్సీ సాధన సమితి రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దీనికి జేఏసీ జిల్లా చైర్మన్‌ హనుమంతు సాయిరాం అధ్యక్షత వహించారు.  ఏపీజేఏసీ, ఏపీజేఏసీ(అమరావతి), ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీజీఈఏలతో పాటు ఫ్యాప్టో, జాక్టో, ఫోర్లో, సచి వాలయ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు చెందిన జిల్లాలోని మొత్తం 109 సంఘాల ప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చారు. పీఆర్సీ సాధన సమితి జిల్లాశాఖగా ఏర్పడ్డారు. ఉద్యోగులకు చెందిన 71 ప్రధాన సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు ఐక్య కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 24 (సోమవారం) నుంచి ఫిబ్రవరి 7 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు తీర్మానించారు. అప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఫిబ్రవరి 7నుంచి సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా  పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు మాట్లాడుతూ..  ప్రభుత్వంలోని అన్నిశాఖలకు చెందిన ఉద్యోగులు ఐక్యమత్యంతో ఉద్యమం చేస్తే విజయం తథ్యమని తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను తీర్చాలని అడిగితే ప్రభుత్వం తమను ప్రజల్లో దోషులుగా చిత్రీకరిస్తోందన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  ఉద్యమ  నాయకులను పోలీసులు గృహనిర్బంధం, అరెస్టులు చేస్తే మిగతా ఉద్యోగులు  ద్వితీయ నాయకత్వంగా ఏర్పడి ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. 25న జిల్లాకేంద్రంలో నిర్వహించే ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు తరలిరావాలని   కోరారు. 26న జిల్లా అంతటా అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించాలన్నారు. ఫిబ్రవరి 3న జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  27 నుంచి 30 వరకు జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఫిబ్రవరి 5 నుంచి అన్నిశాఖల ఉద్యోగులు సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ సమావేశంలో ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు, ఏపీటీఎఫ్‌ 257 రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల భానుమూర్తి, ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్‌ కొమ్ము అప్పలరాజుతో పాటు వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T05:13:07+05:30 IST