ఇలా అయితే కష్టమే..

ABN , First Publish Date - 2020-03-30T10:53:49+05:30 IST

ఒక పక్క కరోనా, ఇంకో పక్క లాక్‌డౌన్‌. రేపు ఎలా ఉంటుందో..? అనే ఆందోళనకు ప్రజలు లోనవుతున్నారు. కూరగాయలు, నిత్యావసరాలు దొరుకుతాయో లేదో అనే అభద్రతకు గురవుతున్నారు.

ఇలా అయితే కష్టమే..

కూరగాయలు, మాంసం కోసం రద్దీ

జాతరను తలపించిన  రైతుబజార్లు 

కరోనా కట్టడికి కృషి చేయాలి


కర్నూలు(అగ్రికల్చర్‌)/నంద్యాల,మార్చి 29: ఒక పక్క కరోనా, ఇంకో పక్క లాక్‌డౌన్‌. రేపు ఎలా ఉంటుందో..? అనే ఆందోళనకు ప్రజలు లోనవుతున్నారు. కూరగాయలు, నిత్యావసరాలు దొరుకుతాయో లేదో అనే అభద్రతకు గురవుతున్నారు. ఇండ్లలోనే ఉండాలని, లేకపోతే వైర్‌సను కట్టడి చేయలేమని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.  కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలుకు సమయం కేటాయించడం తప్ప అధికార యంత్రాంగం ఏమీ చేయకపోవడంతో ఆ సమయాల్లో రోడ్ల మీద జనం గుంపులుగా చేరుతున్నారు.


ఆదివారం కర్నూలు నగరంలోని రైతుబజార్ల వద్ద చికెన్‌, మాంసం దుకాణాల వద్ద ఈ పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆదివారం కావడంతో  సీ.క్యాంపు రైతుబజారు వద్ద వేలాది మంది జనం జాతరకు వచ్చినట్లు   గుంప య్యారు. సామాజిక దూరం పాటించేందుకు తగిన చర్యలు ఏవీ తీసుకోక పోవడంతో కొనుగోలుదారులు గుంపులుగా ఎగబడ్డారు. అధికారులు జనసందోహాన్ని చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు.   చికెన్‌, మటన్‌ దుకాణాల వద్ద కూడా ఇదే పరిస్థితి. నిత్యావసరాలు, కూరగాయల కోసం ప్రజలు బైటికి ఇలా రాకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయనంత వరకు సమస్య పరిష్కారం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది.  


నంద్యాలలో 7వ రోజు లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా గాంధీచౌక్‌లో ఉన్న కూరగాయల పెద్దమార్కెట్‌కు వేలాది మంది జనం వచ్చారు.   పట్టణంలోని 11 ప్రాంతాలలో కూరగాయల కేంద్రాలను ఏర్పాటు చేశారు.  ఎన్‌టీఆర్‌ షాదిఖానా, శ్రీనిధి హోటల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన కూరగాయలు, పండ్ల దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం  పాటించలేదు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఈ స్థితిని పరిశీలించారు. 

బన గానపల్లెలో ఆదివారం కూరగాయల మార్కెట్‌ల వద్దకు  జనం గుంపులుగా చేరారు.  సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. 


ఎమ్మిగనూరులో కూరగాయలు, మటన్‌, చికెన్‌ కొనడానికి  ఉదయం 9.30 గంటల నుంచి అనుమతినిచ్చారు. పెద్దకటిక వీధిలో కొనుగోళ్ల కోసం  జనం గుంపయ్యారు. మూడుచోట్ల మార్కెట్‌లను ర్పాటు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. 


సంజామల మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు వారపు సంతకు కూరగాయలు కొనేందుకు ఉదయాన్నే వచ్చారు. దీంతో రద్దీ ఏర్పడింది. పోలీసు అధికారులు చెప్పినా ప్రజలు పట్టించుకోవడం లేదు. 


ఆదోనిలో  ఆదివారం ఉదయాన్నే చికెన్‌, మటన్‌, ఫిష్‌ సెంటర్ల ముందు జనం క్యూకట్టారు. కొన్ని సెంటర్ల దగ్గర బ్లీచింగ్‌ పౌడర్‌తో మార్కింగ్‌ వేయడం తప్ప గుంపులుగా జనం రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. దీంతో చిన్నమార్కెట్‌, ఓవర్‌బ్రిడ్జి, రైల్వే స్టేషన్‌ రోడ్డులో అడ్డదిడ్డంగా మాంసం కోసం ఎగబడ్డారు. కూరగాయలు పండించిన రైతులందరూ విక్రయించేందుకు మార్కెట్‌కు రావడంతో రద్దీ పెరిగింది.   మున్సిపల్‌ మైదానంలోకి తండోపతం డాలుగా చేరుకున్నారు. పట్టణంలో 8 చోట్ల కూరగాయల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల కూరగాయల సెంటర్ల ముందు మీటర్‌ దూరం ఉండేలా గళ్లు గీచారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు.  


పత్తికొండలో ఆదివారం పత్తికొండ కూరగాయల మార్కెట్‌లో జనం రద్దీ కనిపించింది. వివిధ కిరాణా దుకాణాల వద్ద వినియోగదారులు   గుంపులుగా వచ్చారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ చర్యలు నీరుగారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-03-30T10:53:49+05:30 IST