కష్టాల్లో కార్మిక వైద్యం..!

ABN , First Publish Date - 2022-07-06T07:07:43+05:30 IST

ఆరు దశాబ్దాల నాటి విజయవాడ కార్మిక బీమా వైద్యశాల భవనం ఆసుపత్రి శిథిలావస్థలో ఉన్నా నేటికి రోగులకు వైద్యసహాయం అందిస్తోంది. ఇక్కడకు సూమారు 5లక్షల మంది కార్మికులు వైద్య సహాయం కోసం వస్తుంటారు. భవనం కూలిపోయే ప్రమాదం ఉందని ఆంధ్రా యూనివర్సిటీ, ఐఐటీ నిపుణులు అంచన వేశారు.

కష్టాల్లో కార్మిక వైద్యం..!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ఆరు దశాబ్దాల నాటి విజయవాడ కార్మిక బీమా వైద్యశాల భవనం ఆసుపత్రి శిథిలావస్థలో ఉన్నా నేటికి రోగులకు వైద్యసహాయం అందిస్తోంది. ఇక్కడకు సూమారు 5లక్షల మంది కార్మికులు వైద్య సహాయం కోసం వస్తుంటారు. భవనం కూలిపోయే ప్రమాదం ఉందని ఆంధ్రా యూనివర్సిటీ, ఐఐటీ నిపుణులు అంచన వేశారు. పాత భవనాన్ని తొలగించి కొత్త భవనం నిర్మించాలని సూచించారు. ఈ ప్రాతిపదనలను ఇటు కార్పొరేషన్‌ అధికారులు, స్టేట్‌ డైరెక్టర్‌ అధికారులు పెడచెవిన పెట్టారు. దీంతో కొత్త ఆసుపత్రి నిర్మాణం అటకెక్కింది. శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రి భవనంపై పెచ్చులు ఎప్పుడు ఊడి మీద పడుతుందోనన్న భయం రోగుల్లో, వారి బంధువుల్లో నెలకొంది. కార్పొరేషన్‌ వద్ద నిధులున్నా కొత్త భవన నిర్మాణానికి ముందుకు రావడం లేదని రోగులు ఆరోపిసున్నారు. విజయవాడ ఈఎ్‌సఐ ఆసుపత్రికి రోజుకు సూమారు 300 మందికి పైగా రోగులు వస్తుంటారు. రోగ తీవ్రతను బట్టి ప్రయివేటు ఆసుపత్రికి రిఫరల్స్‌ రాస్తుంటారు. ఏటా ప్రయివేటు ఆసుపత్రులకు స్టేట్‌ డైరెక్టర్‌ ఆఫీసు రూ.కోట్లల్లో బిల్లులు చెల్లిస్తుంటుంది. అదే కొత్త సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణమైతే రోగులకు వైద్యం అందుబాటులో ఉంటుంది. ఈఎ్‌సఐ ఆసుపత్రి నుంచి వచ్చే రోగులవద్ద నుంచి రిఫరల్స్‌ హాస్పటల్స్‌ ఇతర పరీక్షల పేరుతో సూమారు రూ. 10 నుంచి 20 వేలవరకు గుంజుతున్నారు. అదనంగా ఖర్చు చేసిన నగదును ఈఎ్‌సఐ ద్వారా పొందాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

అరకొర వసతులతో సతమతం

ఈఎ్‌సఐ ఆసుపత్రిలో ఆరకొర వసతుల వల్ల గత ఐదేళ్ల నుంచి ఇన్‌ పెషేంట్‌లను తీసుకోవడం మానేశారు. దీనికి తోడు ఆసుపత్రి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం.. అత్యవసర చికిత్సకు సంబంధించిన పరికరాలు అందుబాటులో లేకపోవడం.. ఆపరేషన్‌ గది కూడా కూలిపోయే స్థితిలో ఉండటంతో దాన్ని మూసివేశారు. దీంతో ఈఎ్‌సఐ ఆసుపత్రి రోగులంతా రిఫరల్స్‌ ఆసుపత్రుల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి.

వేధిస్తోన్న పరికరాలు, మందుల కొరత

ఈఎ్‌సఐ ఆసుపత్రిలో మందులు, పరికరాల లేమి తీవ్రంగా వేధిస్తోంది. పదిరోజులకు సరిపడా ఐదారు రకాల మందులు వైద్యులు రాసిస్తే అక్కడ దొరికేవి కేవలం ఒకటి లేదా రెండు రకాల మందులు మాత్రమే ఉంటున్నాయి. మందులు దొరక్క రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రిఫరల్స్‌ హాస్పటల్స్‌ చికిత్స తీసుకుని వచ్చిన రోగులకు కావాల్సిన మందులు కూడా దొరకడం లేదు. వారికి కావాల్సిన మందులను ఆర్డర్‌ మీద తెప్పిస్తారు. ఆ మందులు వచ్చే వరకు రోగులు రిఫరల్స్‌ ఆసుపత్రిలోనే కొనుక్కుంటున్నారు. దీంతో ఆర్థికంగా రోగులు చితికిపోతున్నారు. డిస్పెన్సరీల్లోనూ, ఆసుపత్రిలోనూ మందుల కొరత నివారించలేకపోతున్నారు.

ఎక్స్‌రే, ఈసీజీ పరికరాలు తప్ప ఇక్కడ మరేమీ కనిపించవు. డిస్పెన్సరిల నుంచి వచ్చే రోగులకు పరీక్షలు చేయాడానికి సరైన పరికరాలు లేకపోవడం చూస్తే ఆసుపత్రి పరిస్థితిలో ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. పరికరాల కొరతతో వైద్యులు రోగులను రిఫరల్స్‌ ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యం..

నూతన భవన నిర్మాణానికి కార్పొరేషన్‌ గతేడాది డిసెంబర్‌లోనే పచ్చజెండా ఊపింది. కానీ ప్రస్తుతం ఉన్న భవనం ఖాళీచేసి అద్దె ప్రాతిపాదికన వేరే చోటకు తరలివెళ్లాలని స్టేట్‌ డైరెక్టర్‌ ఆఫీసుకు సిఫార్సు చేసింది. స్టేట్‌డైరెక్టరేట్‌ అద్దెకు భవనాన్ని తీసుకుని తరలించే ప్రయత్నం కూడా చేయకపోగా.. దీనికోసం ప్రత్యేకంగా 40 పడకల తాత్కాలిక ఆసుపత్రి నిర్మించి ఇవ్వాలని కార్పొరేషన్‌కు లేఖ పంపింది. 200 పడకలతో కూడిన ఆసపత్రి నిర్మించి ఇవ్వడానికి కార్పొరేషన్‌ సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అందుకు సహకరించడంలేదని కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్త ఆసుపత్రి నిర్మాణానికి అడ్డంకిగా మారింది.

Updated Date - 2022-07-06T07:07:43+05:30 IST