కారు అద్దెకు ఇస్తే..

ABN , First Publish Date - 2022-09-23T05:17:28+05:30 IST

కార్లు అద్దెకు ఇస్తున్నారా.. ? అయితే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే..? అద్దెకు తీసుకెళ్లిన కార్లతో కొందరు ఆకతాయిలు పలు రకాల నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి.

కారు అద్దెకు ఇస్తే..

కష్టాలు కొనితెచ్చుకున్నట్లే  

అద్దెకు తీసుకున్న కార్లతో నేరాలు

శిక్ష అనుభవిస్తున్న కార్ల యాజమానులు


కార్లు అద్దెకు ఇస్తున్నారా.. ? అయితే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే..? అద్దెకు తీసుకెళ్లిన కార్లతో కొందరు ఆకతాయిలు పలు రకాల నేరాలకు పాల్పడుతున్న ఘటనలు  ఇటీవల వెలుగు చూస్తున్నాయి. నేరం జరిగిన కొన్ని వారాల తర్వాత పోలీసులు కారును వెతుక్కుంటూ వచ్చేసరికి వాటి యజమానులు కంగుతింటున్నారు. ఇటువంటి ఘటనలు జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంటున్నాయి.


జంగారెడ్డిగూడెం టౌన్‌, సెప్టెంబరు 22 : ఇటీవల కాలంలో సెల్ఫ్‌ డ్రైవ్‌ (డ్రైవర్‌ సహాయం లేకుండా ప్రయాణికుడు సొంతంగా డ్రైవింగ్‌ చేసుకుంటూ అద్దెకు తీసుకోవడం) ఎక్కువైంది. ప్రధాన పట్టణాల్లో కొన్ని కంపెనీలు రిజిస్టర్డ్‌ యాప్‌ల ద్వారా ప్రూఫ్‌లను సేకరించి కార్లను అద్దెకు ఇస్తుంటారు. డ్రైవర్‌తో అద్దెకు ఇచ్చిన దానికన్నా, సెల్ఫ్‌డ్రైవ్‌తో అద్దె ఎక్కువ వస్తుంది. ఇదేదో బాగుందనుకున్న పలువురు కార్లను కొనుగోలు చేసి సెల్ఫ్‌ డ్రైవ్‌కు ఇస్తున్నారు. అంతా బాగానే జరుగుతుందనుకున్న తరుణంలో ఓ రోజు పోలీసులు వచ్చి మీ కారుపై కేసు ఉందంటూ కేస్‌ బుక్‌ చేసి స్టేషన్‌లో పెడుతున్నారు. కారు విడిపించు కునేందుకు యజమానులు కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. తాజాగా జంగా రెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీసులు నేరాలకు ఉపయోగించిన రెండు కార్లపై కేసు నమోదు చేశారు. నిందితులు నేరం చేయడానికి రెండు కార్లను సెల్ఫ్‌ డ్రైవ్‌కు తీసుకున్నారు.    

 

జంగారెడ్డిగూడేనికి చెందిన ఒక వ్యక్తి కారు అద్దెకు తిప్పుతూ జీవనం సాగిస్తున్నాడు. ఓ రోజు ముక్కు మోహం తెలియని వ్యక్తి కారు కావాలంటూ ఫోన్‌ చేశాడు. రోజుకు 3 వేల వరకు అద్దె ఇస్తాననడంతో ఆశపడ్డాడు. సాధారణంగా రోజుకి రూ.1500 నుంచి రూ.2 వేలకు అద్దె ఉంటుంది. అదనంగా సొమ్ము వస్తుందనే ఆశతో కారు 3 రోజులకు అద్దెకు ఇచ్చాడు. వారం రోజులైనా కారు రాలేదు. పది రోజుల తర్వాత ఫోన్‌ కూడా పనిచేయడం మానేసింది. సదరు కారు యజమానికి కంగారు మొదలైంది. కారుకు ఈఎమ్‌ఐ చెల్లించాల్సిన సమయం దగ్గరపడింది. స్నేహితులకు చెప్పాడు. రూ.5 లక్షలు విలువ చేసే కారును తెలియని వారికి ఎలా ఇచ్చేశావ్‌ అని ప్రశ్నించడంతో బిక్కమొహం పెట్టాడు. 40 రోజుల తర్వాత తెలిసిన డ్రైవర్‌ ఒకరు విజయవాడలో తన కారు చూశానని చెప్పడంతో విజయవాడలో జల్లెడ పట్టేసరికి ఓ ఫైనాన్సర్‌ దగ్గర 2.5 లక్షలకు తాకట్టులో ఉందని తెలిసి గుండె ఆగినంతపనైంది. 


జంగారెడ్డిగూడేనికే చెందిన మరో వ్యక్తి కారు క్రయ విక్రయాలు చేస్తుంటాడు. కొనుగోలు చేసిన కారు విక్రయించే వరకు సెల్ఫ్‌డ్రైవ్‌లకు ఇస్తుంటాడు. వ్యాపారం సజావుగా సాగుతున్న తరు ణంలో తన కారును లక్కవరం పోలీ సులు అర్దరాత్రి వచ్చి తీసుకెళ్ళి పోయారు. విషయం ఏమిటా అని ఆరా తీస్తే నాలుగు మాసాల క్రితం అద్దెకు తీసుకెళ్ళిన వ్యక్తి అదే కారులో రెండు మేకపోతులను దొంగలించు కొచ్చాడని పోలీసులు వివరణ ఇచ్చి కారుపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ చేతిలో పెట్టారు. 


కుమార్‌ అనే వ్యక్తి టూ వీలర్‌ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తూ కార్లను కూడా అద్దెకు ఇస్తుంటాడు. ఒకరోజు తన స్నేహితుడు వారం రోజులు కారు కావాలని అడిగాడు. ఎక్కువ అద్దె ఇవ్వలేను..చాలా అత్యవసరమైన పని మీద వెళ్తున్నానని చెప్పడంతో జాలిపడి తక్కవ అద్దెకు కారు ఇచ్చాడు. వారం దాటి 15 రోజులైనా కారు రాలేదు. కారు తీసుకెళ్ళిన స్నేహితుడు ప్రేమించిన అమ్మాయితో ఊరి నుంచి వెళ్లిపోయాడని తెలుసుకుని అవాక్కయ్యాడు.


సెల్ప్‌ డ్రైవ్‌ కార్ల విషయంలో జరిగిన మోసాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.. చాలాచోట్ల అద్దెకు ఇస్తున్న యజ మానులకు కొందరు ఆకతాయిలు చుక్కలు చూపిస్తున్నారు. అద్దెకు తీసుకెళ్లిన కారులో దొంగనోట్ల మార్పిడి, నేరస్తులను పోలీసుల కంట పడకుండా దాటించడం, యాక్సిడెంట్‌లు చేయడం, కోళ్ళను దొంగిలించడం, రోడ్డు పక్కగల దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసి పారిపోవడం, గొడవలకు దిగి గాయపర్చి అక్కడ నుంచి జారుకోవడం, మద్యం సేవించి దురుసుగా డ్రైవ్‌ చేయడం, అద్దెకు తీసుకున్న కారులో కొన్ని సామగ్రిని మార్చేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారు. అయితే నేరస్థలంలో ఉన్న స్థానికులు కారు నెంబర్‌ ద్వారా కేసు పెట్టడంతో పోలీసులు వచ్చి చెప్పే వరకు యజమాను లకు అసలు విషయం తెలియడం లేదు. ప్రతీరోజు ఈ విధమైన తగవులు జరుగుతూనే ఉన్నాయి. సరైన అనుమతులు లేకుండా కారు అద్దెకు ఇవ్వడం వల్ల ఒక్కోసారి కారు యజమాని సైతం కటకటాల్లోకి వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


Updated Date - 2022-09-23T05:17:28+05:30 IST