అత్యాశతో అసలుకే ఎసరు

ABN , First Publish Date - 2022-09-22T08:33:49+05:30 IST

కోట్లకు పడగలెత్తాలనే దురాశ రియల్టర్లది..

అత్యాశతో అసలుకే ఎసరు

  • తక్కువ ధరలు, బైబ్యాక్‌ ప్లాన్ల వంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో రియల్టర్ల ఎర
  • ఒకేసారి పలుచోట్ల ప్రాజెక్టుల ప్రారంభం
  • ఏవీ పూర్తిచేయలేక చేతులెత్తేస్తున్న వైనం
  • కర్ణాటకలో మంత్రి డెవలపర్స్‌ సంస్థ మోసం
  • హైదరాబాద్‌లోనూ ఆ సంస్థ ప్రాజెక్టులు
  • ఇక్కడా పలువురు రియల్టర్లది అదే దారి
  • వినియోగదారులూ తస్మాత్‌ జాగ్రత్త

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కోట్లకు పడగలెత్తాలనే దురాశ రియల్టర్లది.. చదరపుటడుగు రూ.5-6 వేలు పలికే ప్రాంతంలో రూ.3 వేల చొప్పున ఫ్లాట్‌ ఇస్తామంటూ సదరు రియల్టర్లు చెప్పే మాటలకు లొంగిపోయే ఆశ కొనుగోలుదారులది! కానీ.. ‘దురాశ దుఃఖానికి చేటు. అత్యాశకు పోతే అసలుకే ఎసరు వస్తుంది..’ అనే విషయాన్ని తెలుసుకునేలోపే ఇద్దరూ మునిగిపోతున్నారు. రియల్టర్లు తాము మునగడమే కాక.. వినియోగదారులనూ ముంచేస్తున్నారు. ఇటీవలికాలంలో సంచలనం సృష్టించిన మంత్రి డెవలపర్స్‌ కేసు చెబుతున్న నీతి ఇదే. దేశవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అయిన మంత్రి డెవలపర్స్‌ ఒకేసారి పలు ప్రాజెక్టులు చేపట్టి.. బైబ్యాక్‌ స్కీములు, తక్కువ ధరకే ఫ్లాట్ల పేరుతో వినియోగదారుల నుంచి డబ్బు వసూలు చేసి ఆ డబ్బుతో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయకుండా దారి మళ్లించి ఆర్థిక నేరాలకు పాల్పడింది. ఆ సంస్థపై నమ్మకంతో ఏళ్లతరబడి వేచిచూసిన కొనుగోలుదారులు ఆగ్రహం పట్టలేక పోలీసులను ఆశ్రయించడంతో అసలు గుట్టు బయటపడింది. ఆ సంస్థ అధినేతలు జైలులో మగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క కర్ణాటకలోనే కాదు.. మంత్రి డెవలపర్స్‌ సంస్థ దేశంలోని పలు మెట్రోపాలిటన్‌ నగరాల్లో పలు భారీ ప్రాజెక్టులు చేపట్టింది. 


వాటిలో కొన్ని హైదరాబాద్‌లో కూడా ఉన్నాయి. ఇప్పుడా సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల్లో డబ్బు పెట్టిన కొనుగోలుదారుల పరిస్థితి అగమ్యగోచరమే! అయితే మంత్రి డెవలపర్స్‌ వ్యవహారాన్ని  హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ కూడా గుణపాఠంగా తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. హైదరాబాద్‌లో స్థిరాస్తి మార్కెట్‌ మెరుగ్గా ఉండడంతో పుణె, బెంగళూరు, నోయిడా తదితర ప్రాంతాలకు చెందిన డెవలపర్లు, రియల్టర్లు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే ఉన్నవారికి.. కొత్తగా వస్తున్నవారికి మధ్య పోటీ పెరగడంతో మార్కెట్లో నిలబడేందుకు కొందరు, మార్కెట్లో గుత్తాధిపత్యం సంపాదించేందుకు కొందరు.. ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొస్తున్నారు. కొనుగోలుదారులనుఆ కట్టుకోవడానికి రకరకాల ఆఫర్లు పెడుతున్నారు. వాటిని చూసి ఆశపడి బ్యాంకుల నుంచి అప్పులుతీసుకొచ్చి చాలా మంది చెల్లింపులు చేస్తున్నారు. చివరికి ఆ ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాక ఇబ్బందిపడుతున్నారు.


పలు నిర్మాణ సంస్థలు ఇలా..

హైదరాబాద్‌ నగర శివారులోని పటాన్‌చెరు ప్రాంతంలో 8 టవర్లతో భారీ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఓ నిర్మాణ సంస్థ ఫ్రీలాంచ్‌ ఆఫర్‌ కింద ఆకర్షణీయమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. దీంతో.. చాలా మంది లక్షల రూపాయలను అడ్వాన్స్‌గా చెల్లింపులు చేసి అందులో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. కానీ ఆ ప్రాజెక్టు చేపట్టాలని భావించిన ప్రాంతంలోని భూమి వివాదంలో చిక్కుకుంది. నిర్మాణ సంస్థ ఆ వివాద పరిష్కారం కోసం కోర్టు చుట్టూ తిరగడమే సరిపోయింది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. అలాగే.. కొంపల్లి ప్రాంతంలో ఓ ప్రాజెక్టును చేపట్టిన ఒక నిర్మాణ సంస్థ.. ప్రీలాంచ్‌ ఆఫర్ల పేరుతో ఎరవేసి పెద్ద ఎత్తున ఫ్లాట్ల విక్రయాలు జరిపింది. కానీ, వచ్చిన డబ్బుతో ఆ ప్రాజెక్టును పూర్తిచేయకుండా.. ఐటీ కారిడార్‌లో మరో ప్రాజెక్టు చేపట్టేందుకు స్థలాన్ని కొనుగోలు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. కాబట్టి కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలని.. నమ్మశక్యం కాని ఆఫర్లను, కలర్‌ఫుల్‌ బ్రోచర్లను చూసి మోసపోవద్దని.. ఆ ప్రాంతంలో మార్కెట్‌ రేట్లు ఎంత ఉన్నాయో తెలుసుకుని, ఆచితూచి అడుగు ముందుకు వేయాలని గృహనిర్మాణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. 


50 కోట్లు ఇరుక్కుపోయాయి!

ప్రీలాంచ్‌, యూడీఎస్‌ కింద జనాలను మోసం చేసే సంస్థలు ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌లో బయటపడుతున్నాయి. ఫ్రీలాంచ్‌ కింద ప్రకటించిన ఆకర్షణీయమైన ఆఫర్లను నమ్మి ప్రజలు పెట్టుబడిగా పెట్టిన సొమ్ములో సుమారు రూ.50 కోట్లకు పైగానే వివిధ సంస్థల వద్ద ఇరుక్కుపోయింది. ఇలాంటి మోసపూరిత చర్యల వల్ల రెరా అనుమతులతో వచ్చే ప్రాజెక్టులపై, రియల్‌ ఏస్టేట్‌పై ప్రభావం పడుతోంది.

- రాజశేఖర్‌రెడ్డి, క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధానకార్యదర్శి


ఆఫర్లను నమ్మి మోసపోవద్దు

జనాన్ని ఆకర్షించేందుకు పలు సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లు తెస్తున్నాయి. అలాంటివాటి విషయంలో ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాలి. సదరు సంస్థకు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసే సామర్థ్యం ఉందా? అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలి. ఆకర్షణీయమైన బ్రోచర్లను చూసి మోసపోవద్దు. రెరా అనుమతులు కలిగిన ప్రాజెక్టుల్లోనే కొనుగోళ్లు జరపాలి.

- సునీల్‌ చంద్రారెడ్డి, నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ 

డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ తెలంగాణ అధ్యక్షుడు

Updated Date - 2022-09-22T08:33:49+05:30 IST