అసలు రైతులకు ఎసరు!

ABN , First Publish Date - 2021-05-09T05:25:26+05:30 IST

భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కొందరు అక్రమంగా భూములు కాజేసే పనిలో పడ్డారు. కొందరు అధికారులు, రాజకీయ నేతల సహకారంతో సామాన్యుల భూములను కొల్లగొడుతున్నారు.

అసలు రైతులకు ఎసరు!

  • మధ్యలో వచ్చిన వారి పేర్లపైనే రికార్డులు 
  • సీలింగ్‌ భూములకూ రిజిస్ట్రేషన్‌
  • పులిమామిడిలో రెవెన్యూ మాయాజాలం
  • రికార్డుల్లో 88ఎకరాల భూమిని అధికంగా చూపిన వైనం

కందుకూరు: కందుకూరు మండలం పులిమామిడి రెవెన్యూ పరిధిలో గల 84 సర్వే నెంబర్‌లో రెవెన్యూ అధికారులు భూమికి సంబంధంలేని వారి పేర్లు రికార్డుల్లో నమోదు చేసి అసలు రైతులకు ఎసరు పెట్టారు. 84వ సర్వే నెంబర్‌లో కాస్రా చౌపాసుల ప్రకారం 490 ఎకరాల 02 గుంటల భూమి రికార్డుల్లో  ఉండాలి. కానీ 1980 నుండి 2015వరకు ఉన్న రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులు, రియల్టర్ల ఒత్తిడితో భూమితో సంబంధం లేని వారి పేర్లను రికార్డుల్లో ఎక్కించారు. అసలు రైతుల పేర్లకు బదులు వారి పేర్లను ఎక్కించడమే కాకుండా వారి పేరుతో కూడా భూమి ఉన్నట్టు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో నేడు ఆ సర్వే నెంబర్‌లో 578ఎకరాల 16 గుంటల భూమి ఉన్నట్టు రికార్డుల్లోకి ఎక్కింది. రెవెన్యూ అధికారులు మొత్తంగా 88ఎకరాల 14 గుంటల భూమిని అధికంగా ఎక్కించారు. ఇటీవల కాలంలో ధరణి అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో రెవెన్యూ అధికారులు ఈ భూములు ఉన్న అసలు రైతుల పేర్లను తొలగించారు. మధ్యలో పేర్లు వచ్చిన వారిని మాత్రమే ఉంచి అసలు భూమికి వారే హక్కుదారులుగా గుర్తిస్తూ రికార్డుల్లో ఎక్కించారు. దీంతో అసలు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

  • జరిగింది ఇలా..

పులిమామిడి రెవెన్యూ పరిధిలోని 84/2 సర్వే నెంబర్‌లో బి.వెంకట్‌రెడ్డి అనే రైతుకు 65 ఎకరాల 13గుంటల భూమి ఉంది. ఇందులో ఆయన 1973లో రాష్ట్ర ప్రభుత్వానికి 11ఎకరాల భూమిని సీలింగ్‌ కింద ఇచ్చారు. మిగిలిన 54 ఎకరాల భూమి ఆయనకు ఉండాలి. దానిలో వెంకట్‌రెడ్డి 10ఎకరాల భూమిని ఇతరులకు అమ్మాడు. దీంతో అతడికి 44 ఎకరాల భూమి మిగిలింది. అయితే, 1989లో అప్పటి రెవెన్యూ అధికారులు వెంకటరెడ్డికి సమాచారం లేకుండానే అతడి 44 ఎకరాలతో పాటు మరో ఎకరం 38 గుంటల భూమిని కలిపి మొత్తంగా 45 ఎకరాల 38 గుంటల భూమిని సురేష్‌రెడ్డి అనే వ్యక్తి పేరుతో రికార్డుల్లో ఎక్కించారు. దీంతో వెంకట్‌రెడ్డి 2005లో  కోర్టుకు వెళ్లాడు. 2006 సెప్టెంబర్‌ 6న వెంకటరెడ్డికి చెందాల్సిన భూములన్నీ ఆయనవేనని జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది. అయినా, రెవెన్యూ అధికారులు కేవలం 11 ఎకరాల భూమిని మాత్రమే వెంకటరెడ్డి కోడలు మహితారెడ్డి పేరుతో ధరణిలో ఎక్కించారు. కానీ, ఆ భూమి కూడా ఎక్కడ ఉందో కూడా రెవెన్యూ అధికారులు చూపలేదు. తనభూమిలో ఇంకా 34 ఎకరాలు రావాల్సిఉందని వెంకటరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు.

  • సీలింగ్‌ భూమిని పట్టాగా చూపారు  

పులిమామిడి గ్రామానికి చెందిన బి.వెంకట్‌రెడ్డి, బి.బుచ్చిరెడ్డి, రాంచంద్రారెడ్డి, కిష్టారెడ్డిలు 1973లో 84వ సర్వే నెంబర్‌లో 39ఎకరాల భూమిని ప్రభుత్వానికి సీలింగ్‌ కింద ఇచ్చారు. కానీ ప్రస్తుత రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 20 ఎకరాలు ఇచ్చినట్టుగానే ఉంది. మిగతా 19 ఎకరాలు పట్టా భూమిగా చూపారు. ఈ భూమిని ఇతరులకు ఇచ్చినట్టుగా రికార్డుల్లో ఉంది. అయితే, నిబంధనల ప్రకారం సీలింగ్‌ భూమి రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. కానీ, ఈ 19 ఎకరాల భూమిని పహాణీతో ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేశారు. 

  • రికార్డులు తారుమారు

పులిమామిడి రెవెన్యూలోని 84 సర్వే నెంబర్‌లో రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేశారు. ఉన్నదాని కన్నా 10ఎకరాల భూమిని అదనంగా రికార్డుల్లో ఎక్కించారు. రూ. కోట్ల విలువ చేస్తున్న ఈ భూములను కాజేసిన కొందరు రియల్టర్లు రియల్‌ దందా చేస్తున్నారు. 2005కంటే ముందు ఈ సర్వే నంబర్‌లో బి.బుచ్చిరెడ్డికి 6.38గుంటల భూమిఉంది. ఈ భూమిని ఆయన దావుత్‌గూడకు చెందిన ధారావత్‌ టాక్సికి 2005లో అమ్మాడు. అప్పటి రెవెన్యూ అధికారి 13(సి)ఫారం కింద బి/4988/05లో దారావత్‌ టాక్సి కుమారులు ఆరుగురికి 6.38 ఎకరాల భూమిని బదిలీ చేయాల్సి ఉండగా.. 16.38ఎకరాల భూమిని బదిలీ చేశాడు. అంటే పదెకరాల భూమిని అదనంగా వారికి బదిలీ చేశాడు. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు రియల్టర్లు, రాజకీయ నాయకులు ఆ భూమిలో ఆరెకరాలను అదే గ్రామానికి చెందిన ఇద్దరికి రిజిస్ట్రేషన్‌ చేయించారు. వారు ఇదే భూమిని 2016లో కల్వకుర్తికి చెందిన కాసిరెడ్డి, భాస్కర్‌రెడ్డిల పేర రిజిస్ట్రేషన్‌ చేశారు. వాస్తవానికి ఈ ఆరెకరాల భూమిని దావుత్‌గూడ గ్రామానికి చెందిన ముడావత్‌ మున్యా, తమ్ముడు ముడావత్‌ కుమార్‌, వారితల్లి మంగ్లిలు 33 సంవత్సరాల క్రితం బి.వెంకట్‌రెడ్డి అనే రైతు వద్ద కొనుగోలు చేశారు. అప్పటినుంచి వారే సాగు చేసుకుంటున్నారు. ఇటీవల ఆ 6ఎకరాల భూమి తమదేనని పెద్దమ్మ తాండ, దావుత్‌గూడకు చెందిన కొందరు రియల్టర్లు ఆ భూమిలోకి వెళ్లారు. దీంతో ముడావత్‌ మంగ్లి, ఇద్దరు కుమారులు ఇటీవల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా అనేకమందికి చెందిన భూములను రెవెన్యూ అధికారులు ఇతరుల పేరుమీదకు మార్చారని, ఆ భూములను సర్వే చేయించి అసలైన రైతులకు దక్కేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

  • ఆ భూములు నిషేధిత జాబితాల్లో ఉన్నాయి

పులిమామిడి రెవెన్యూ పరిధిలోని 84వ సర్వే నెంబర్‌లో ఉన్న ఎక్కువశాతం భూములు కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఈ సీలింగ్‌ భూములపై సమగ్రంగా విచారణ జరిగే వరకు అవి రిజిస్ట్రేషన్‌ కాకుండా ఉంచాం. దీంతో పాటు రికార్డుల్లో అధికంగా భూములున్న రైతుల వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదించాం. పూర్తి నివేదికలు వచ్చేవరకు ఆ సర్వే నెంబర్‌లోని వివాదంలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌ నిలిపివేశాం.

- ఎస్‌.జ్యోతి, కందుకూరు తహసీల్దార్‌


  • భూమి నాది కాదంటున్నారు


పులిమామిడి రెవెన్యూ పరిధిలోని 84 సర్వే నెంబర్‌లో 33 సంవత్సరాల క్రితం 2ఎకరాల 20గుంటల భూమిని కొనుగోలు చేశా. అప్పటి నుంచి దాంట్లో సాగు చేస్తున్నాం. కానీ, ఇప్పుడు ఈ భూమి నాది కాదని అంటున్నారు. కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ నాయకులు నా భూమిలోనుంచి నన్ను వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

- ముడావత్‌ మున్యా, బాధిత రైతు

Updated Date - 2021-05-09T05:25:26+05:30 IST