సొసైటీ స్థలానికి ఎసరు

ABN , First Publish Date - 2022-05-19T06:41:13+05:30 IST

జిల్లా సహకార ఉద్యోగుల హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీకి చెందిన సుమారు రూ.మూడు కోట్ల విలువైన స్థలాన్ని అదే శాఖకు చెందిన రిటైర్డు ఉద్యోగి ఒకరు కబ్జా చేసేందుకు యత్నించారు.

సొసైటీ స్థలానికి ఎసరు
విశాలాక్షినగర్‌ లో ఖాళీగా ఉన్న సహకార ఉద్యోగుల హౌస్‌ బిల్డింగ్‌ సోసైటీ స్థలాన్ని చదునుచేస్తున్న దృశ్యం

విశాలాక్షి నగర్‌లో రూ.3 కోట్ల విలువైన స్థలం 

ఆక్రమణకు  సహకార శాఖ రిటైర్డు ఉద్యోగి యత్నం

కబ్జాదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు

విశాఖపట్నం/విశాలాక్షి నగర్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార ఉద్యోగుల హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీకి చెందిన సుమారు రూ.మూడు కోట్ల విలువైన స్థలాన్ని అదే శాఖకు చెందిన రిటైర్డు ఉద్యోగి ఒకరు కబ్జా చేసేందుకు యత్నించారు. రెండు, మూడు రోజులుగా స్థలాన్ని చదును చేస్తుండడంతో స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. సహకార శాఖ ఉద్యోగులు 1970 ప్రాంతంలో విశాఖ జిల్లా సహకార ఉద్యోగుల హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ఏర్పాటుచేసుకున్నారు. సొసైటీ అభ్యర్థన మేరకు అప్పట్లో ప్రభుత్వం విశాలాక్షి నగర్‌లో భూమి కేటాయించింది. సొసైటీ ఆధ్వర్యంలో లేఅవుట్‌ వేసి సభ్యులకు స్థలాలు కేటాయించారు. అయితే అక్కడక్కడా కొన్ని మిగిలిపోయాయి.  ఆ తరువాత సొసైటీలో సభ్యులుగా చేరిన మరికొందరు ఉద్యోగులకు స్థలాలు కేటాయించారు. ఇంకా హనుమంతువాక నుంచి జోడుగుళ్లపాలెం బీచ్‌కు వెళ్లే రహదారి పక్కన సుమారు 200 గజాల స్థలం మాత్రం మిగిలింది. కాలక్రమేణా కార్యకలాపాలు తగ్గడంతో సొసైటీని మూసివేయాలని సహకార శాఖ ఆదేశించింది.  ఇందుకోసం సొసైటీకి లిక్విడేటర్‌గా సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ మరిడయ్య అనే అధికారిని నియమించింది. సొసైటీని మూసివేయాలని సహకార శాఖ కమిషనర్‌కు మూడు, నాలుగేళ్ల క్రితం జిల్లా సహకార శాఖాధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే సహకార చట్టం ప్రకారం ఒక సొసైటీని మూసివేయాలంటే దానికి ఎటువంటి ఆస్తులు ఉండకూడదు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించకూడదు. కానీ విశాలాక్షినగర్‌లో  గల 200 గజాల స్థలం హౌస్‌బిల్డింగ్‌ సొసైటీ పేరిట ఉంది. అలాగే బ్యాంకు ఖాతాలో రూ.21 వేల నగదు ఉంది. దీంతో సొసైటీ మూసివేయాలంటే తొలుత విశాలాక్షినగర్‌లో ఖాళీగా ఉన్న స్థలాన్ని విక్రయించాలి. అంటే సహకార శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బహిరంగ వేలం ద్వారా స్థలాన్ని విక్రయించి ప్రభుత్వ ఖజానాకు సొమ్ము జమ చేయాలి. స్థలం విక్రయానికి ఉన్నతాధికారుల నుంచి ఇంకా అనుమతి రాలేదు. విశాలాక్షి నగర్‌లో స్థలం ఖాళీగా ఉన్న విషయం తెలుసుకున్న సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి రంగంలోకి దిగారు. కొందరు ఉద్యోగుల అండదండలతో రూ.3 కోట్ల విలువైన స్థలం కబ్జాకు పావులు కదిపారు. మూడు రోజుల నుంచి ఎస్కవేటర్‌తో ఆ స్థలాన్ని చదును చేయిస్తున్నారు. కాగా ఈ స్థలం తనకు సొసైటీ కేటాయించిందని మాజీ ఉద్యోగి చెప్పుకోవడంతో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న కొంతమంది ఉద్యోగులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. ఈ స్థలం ఎవరికి కేటాయించలేదని, అటువంటప్పుడు ఎలా చదును చేస్తున్నారని అనుమానంతో ఉన్నతాధికారుకు ఫిర్యాదు చేశారు. ఇంకా జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 

ఆ స్థలం ఎవరికీ కేటాయించలేదు

మరిడయ్య, లిక్విడేటర్‌, విశాఖ జిల్లా సహకార ఉద్యోగుల హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ విశాలాక్షి నగర్‌లో విశాఖ జిల్లా సహకార ఉద్యోగుల హౌస్‌బిల్డింగ్‌ సొసైటీకి 200 గజాల వరకు ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలం ఇప్పటివరకూ ఎవరికీ కేటాయించలేదు.  దానిని వేలం వేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఎవరైనా స్థల ఆక్రమణకు దిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. 


Updated Date - 2022-05-19T06:41:13+05:30 IST