ఎరువుల ధరల దరువు

ABN , First Publish Date - 2022-08-19T06:00:31+05:30 IST

వ్యవసాయం కలిసిరాక అన్నదాతలు ఓ వైపు అల్లాడిపోతుంటే.. ఎరువుల ధరల పెరుగుదల వారిని మరింత కుంగదీస్తోంది.

ఎరువుల ధరల దరువు

- అదుపులేకుండా పెరిగిపోతుండడంతో అల్లాడిపోతున్న అన్నదాత

- వ్యవసాయం భారంగా మారిందని ఆవేదన

- పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని గగ్గోలు


వ్యవసాయం కలిసిరాక అన్నదాతలు ఓ వైపు అల్లాడిపోతుంటే.. ఎరువుల ధరల పెరుగుదల వారిని మరింత కుంగదీస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో వ్యవసాయ యంత్రాల నిర్వహణ ఖర్చులు పెరిగిపోగా, తాజాగా ఎరువుల ధరలు కూడా అదుపులేకుండా పెరిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

------------------


చోడవరం, ఆగస్టు 18: వ్యవసాయానికి  పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకపోగా, సాగుకు అయ్యే ఖర్చులు మరీ ఎక్కువగా ఉండడంతో సాగు అంటేనే అన్నదాతలు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ఒక్క యూరియా మినహా మిగిలిన అన్ని రకాల ఎరువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు రూ.1290 ఉండే డీఏపీ బస్తా రూ.1350 వందలకు పెరిగింది. ఇక పొటాష్‌ ధర కూడా బస్తాపై రూ.500 పెరిగిపోయింది. గత ఏడాది బస్తా రూ.1200కు లభించిన పొటాష్‌ ఈ సీజన్‌లో రూ.1700 అయింది. ఇక సామాన్యులకు ఇంతకాలం అందుబాటులో ఉంటూ వచ్చిన సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌(ఎస్‌ఎస్‌పీ) ధర కూడా బస్తాపై రూ.125 వరకు పెరిగింది. గత సీజన్‌లో రూ.450కి దొరికే ఎస్‌ఎస్‌పీ బస్తా ఈ సీజన్‌లో రూ.575కు చేరింది. ఇక జిల్లాలో రైతులు ఎక్కువగా వాడే 20:20:00: కాంప్లెక్స్‌ ఎరువు వివిధ కంపెనీలను బట్టి బస్తాపై రూ. 250నుంచి 290 వరకూ ధర పెరిగింది. ఐపీఎల్‌ కంపెనీ బస్తా ధర రూ.1490 ఉంటే,  కోరమాండల్‌ కంపెనీ బస్తా ధర రూ.1470 ఉంది. ఈ ఎరువుల ధరలతో పాటు డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగిపోవడంతో ట్రాక్టర్‌ దుక్కి, దమ్ము ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది. దుక్కికి గతంలో గంటకు రూ.600 ఉంటే ఇప్పుడు గంటకు రూ.900 అయింది. దమ్ము రేటు గంటకు రూ.800 నుంచి రూ. 1200కి చేరింది. పెరిగిన డీఏపీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువుల ధరల ప్రకారం ఎకరాకు రైతుపై సుమారుగా రూ.1000 వరకు అదనంగా భారం పడనుంది. 

-------------

సాగుకు పెట్టుబడి కూడా రావడం లేదు (17సిడి ఎం5)

పంటలకు పెట్టుబడి విపరీతంగా అవుతున్నది. గతంతో పోలిస్తే ఎకరా వరికి ఖర్చు ఎక్కువగానే అవుతున్నది. కూలీలు దొరకడం లేదు. ఎరువుల ధరలు కూడా మాకు అందుబాటులో లేకుండా పోయాయి. పెట్టుబడి చేతికి వచ్చే సూచనలు కనిపించడం లేదు. 

- వాసిరెడ్డి సత్తిబాబు, రైతు. జెడ్‌.కొత్తపట్నం, రావికమతం

-----------------

వ్యవసాయం చేయడం కష్టమే (17సీడీ ఎం 6)

ఇప్పటికే వ్యవసాయం మాకు  భారంగా మారిపోయింది. కూలీలు దొరకడం లేదు. విత్తనాల రేట్లు పెరిగిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో పెట్టుబడి వేలు దాటిపోతున్నది.  ఇపుడు డీఏపీ, పొటాష్‌ల ఎరువుల ధరలు పెంచడం మాకు మరింత భారమే. ఈ పరిస్థితుల్లో సాగు చేయడం ఎవరికైనా కష్టమే. వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి చేతికి రాక నష్టాలు తప్పడం లేదు. అప్పుల పాలైపోతున్నాం. డీఏపీ కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు తగ్గించకపోతే వ్యవసాయం మానేసి కూలి పనులకు పోవడం మంచిది. 

- బొడ్డేటి ఆదివాబు, రైతు,వీరనారాయణం, మాడుగుల మండలం




 




Updated Date - 2022-08-19T06:00:31+05:30 IST