ఎరుకే నిశ్చలానందరేఖ

ABN , First Publish Date - 2020-09-03T09:52:45+05:30 IST

క్షీర సాగర మథనానంతరం, పాలకడలి సాధించుకున్న మధుర గంభీర, గభీర (లోతైన), నిశ్చలత్వం అనుపమానమైనది. అలాగే.. చలచ్చలితమైన ప్రాపంచిక

ఎరుకే నిశ్చలానందరేఖ

క్షీర సాగర మథనానంతరం, పాలకడలి సాధించుకున్న మధుర గంభీర, గభీర (లోతైన), నిశ్చలత్వం అనుపమానమైనది. అలాగే.. చలచ్చలితమైన ప్రాపంచిక భావనలు సమసినపుడే మనసు అచలమవుతుంది. మనసు విజృంభించినపుడు ప్రపంచం అతలాకుతలమవుతుంది. శ్వాసను, సంసార వాసనలను నిగ్రహించగలిగితేనే మనసు నియంత్రించబడుతుంది. ఆరాటం, కామాటం, పోరాటం వదులుకోవడమే మనసును నిగ్రహించడం. కొయ్య గుర్రం గుర్రం కానట్లే, పాము బొమ్మ పాము కానట్లే, యథార్థం అనుభవం అవుతున్నపుడే, ప్రపంచస్థితి తెలుస్తుంది. చింతనాత్మకమైన ఆలోచనలోనే సత్యం ప్రస్ఫుటమౌతుంది ‘మాయ’ అర్థం కానిది. సూర్యకిరణాలు సూటిగా తగులుతూనే మంచు మటుమాయమైనట్లు.. మాయను నిశితంగా గమనించడం ప్రారంభించగానే, అది మాయమవుతుంది.


సర్వాంగీణ.. అంటే సర్వజీవులతో, పదార్థాలతో కూడిన ప్రపంచం నిండా ఆత్మ ఆవరించిప్పటికీ, మాయావరణ ప్రభావం వలన దానిని స్పృశించ లేకపోతున్నాం. మనయందున్న ఆత్మే, అన్నిటా ఉన్నదని గ్రహించడమే ఆత్మస్ఫురణ. కంటికి కనిపిస్తున్నదంతా నిజంకాదు. అది గాంధర్వం. గాంధారీయం, అంటే కనులుండీ చూడలేని స్థితి. అంతేకాదు ఎండమావి కూడా. భ్రాంతిమయం. కంటికి కనబడనిది, ఎప్పటికైనా చూడవలసినది.. లోపలే ఉంది. అది నిత్య సత్య శాశ్వతం! అదే ఆత్మ. అంతర్ముఖ స్థితిలో అన్నీ అద్దంలో బొమ్మల్లా కనిపిస్తాయి. వస్తువుల నీడలు, జాడలుగా.. తాడును పాముగా భావించే భ్రాంతి ఈ ప్రపంచ భావన. అది క్షణికం. భాతి (అంటే వెలుగు), సార్వకాలికం.


ప్రాపంచిక సుఖాలలో బంధనాలు బలపడతాయి. సుఖసంతోష పరిధులను దాటినపుడు, నిజం తెలిసినపుడు.. ఆ బంధనాలు సడలిపోతాయి. బాలుడు ఊహించుకునే బూచి ఎంత భయానకమో, ప్రపంచాపేక్ష అంతే భయంకరం. ఆభరణం స్వర్ణమయం. అది ఆకారం మాత్రమే. నిజానికి ఆభరణం నిండా ఉన్నదంతా బంగారమే. ఇదే ఎరుక! అట్లే.. వస్తువూ దాని నీడలాగా అనాత్మ, అంటే ప్రపంచము దేహము, అనుభవంలోకి రాని ఆత్మ భిన్నంగా గోచరించే ఏకమే. దేనినైనా పట్టుకున్నంతసేపూ బంధనమే. వదలటమే ముక్తి. సూర్యుడు, సూర్యకిరణాలు భిన్నంకావన్న నిశ్చిత భావనే నిర్వికల్పస్థితి, సంకల్ప వికల్పాలకు అనీతమైన నిశ్చలస్థితి. చేతిరుమాలులో అడ్డపు, నిలువు పోగులు విడదీసుకుంటూ ఉంటే, కాలగమనంలో రుమాలు తన రూపాన్ని కోల్పోతుంది. ఆ విధంగానే ప్రపంచం ఒక కలనేత. అది వ్యతిరిక్త భావాల కలబోత. అన్నీ విడిపోగా, మిగిలేది శూన్యమే.


అదే ఆత్మ. అది ఎంత శూన్యమో, అంత పూర్ణము. అలలు, కెరటాలు, తుంపరలు సముద్రంలో పుట్టి, దానియందే లయిస్తున్నట్లు, ప్రపంచం సైతం ఆత్మయందే పుట్టి ఆత్మయందే లీనమవుతోంది. కనుక అంతా ఒకటే. కుండ మళ్లీ మట్టి అయినట్లు.. ఆభరణం తన రూపం కోల్పోయినపుడు తిరిగి స్వర్ణమైనట్లు.. అలలు నీరైనట్లు..  ప్రపంచం మళ్లీ తన మూలంలోనే లయిస్తున్నది. మెలకువ రాగానే కల కల్ల అయినట్లు మరణం జన్మ అవుతున్నది. జన్మ, మరణంలోనే నిత్య సంచారం చేస్తున్నది. నిజానికి మనం నిత్య శవవాహకులమే. మనం మన దేహాన్ని మోస్తూనే ఉన్నాం కదా. దేహం శవం; చైతన్యం శివం. అన్నీ స్మృతులే! జ్ఞాపకాలే! ఎరుకే నిర్మల, నిశ్చలానందరేఖ!!

వీఎ్‌సఆర్‌ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Updated Date - 2020-09-03T09:52:45+05:30 IST