వర్షాకాల యాక్షన్‌ప్లాన్‌

ABN , First Publish Date - 2020-05-22T10:40:25+05:30 IST

వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను వాటర్‌ బోర్డు ప్రకటించింది. వర్షాకాలంలో

వర్షాకాల యాక్షన్‌ప్లాన్‌

అత్యవసర పనులకు ఈఆర్టీ బృందాలు

శివారుల్లో 1.5 మీటర్ల లోతు మ్యాన్‌హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్‌

వాటర్‌ బోర్డు నిర్ణయం


హైదరాబాద్‌ సిటీ, మే 21 (ఆంధ్రజ్యోతి): వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను వాటర్‌ బోర్డు ప్రకటించింది. వర్షాకాలంలో అత్యవసర పనులు చేపట్టేందుకు ఈఆర్టీ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో జరిగిన మ్యాన్‌హోల్‌ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని నగరంలోని 1.5 మీటర్ల లోతు గల మ్యాన్‌హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు. శివారు మునిసిపాలిటీల్లోని 1.5 మీటర్ల లోతుగల మ్యాన్‌హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నీరు నిలిచే 180 ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో గల మ్యాన్‌హోళ్లకు సేఫ్టీగ్రిల్స్‌ ఏర్పాటు చేయగా, వర్షం వచ్చే సమయంలో సివరేజీ సూపర్‌ వైజర్లను నియమించి ప్రత్యేక దృష్టి సారించనున్నారు. లోతుగా ఉన్న మ్యాన్‌హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తారు.


మ్యాన్‌హోల్స్‌ మూతలు తెరవద్దు 

మ్యాన్‌హోల్స్‌ మూతలు తెరవద్దని వాటర్‌ బోర్డు ఎండీ దానకిశోర్‌ సూచించారు. ఎక్కడైనా మ్యాన్‌ హోల్‌ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు తెలిస్తే వాటర్‌బోర్డు కస్టమర్‌ కేర్‌ నంబర్‌ 155313 కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వర్షాకాల కార్యాచరణ, సివరేజీ ఓవర్‌ ఫ్లో, మంచినీటి సరఫరా వంటి విషయాలపై ఖైరతాబాద్‌లోని వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఎండీ గురువారం సమీక్షించారు.


కరోనా కాలంలో ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సరఫరా చేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది ఆరోగ్యంపట్ల మేనేజర్లు శ్రద్ధ చూపాలని సూచించారు. రిజర్వాయర్‌ ప్రాంగణం, కార్యాలయాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ రసాయనాన్ని పిచికారీ చేయాలని, సిబ్బంది శానిటైజర్‌, మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఆదేశించారు. మ్యాన్‌హోల్స్‌ పొంగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వాటర్‌బోర్డు డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవి, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-22T10:40:25+05:30 IST